సాక్షి, కర్నూలు: ప్రజా పంపిణీపై పర్యవేక్షణ కొరవడింది. ఈ అవకాశాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల బియ్యం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నా ఇవేవీ అక్రమ రవాణాను నిలువరించలేకపోతున్నాయి. చట్టంలో పస లేకపోవడం.. అధికారుల వైఫల్యం.. నేతల అండదండలతో ఈ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ నెలలో పక్షం రోజుల్లోనే అధికారుల దాడుల్లో 208 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా.. లోపాలపై ప్రజల నుంచి స్వయంగా కలెక్టర్‌కే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం అక్రమ రవాణా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అధికారులు అప్పుడప్పుడు దాడులు చేశామనిపిస్తున్నా పట్టుబడుతున్న బియ్యం అరకొరే కావడం గమనార్హం. ప్రతి నెలా పేదల బియ్యం పెద్ద ఎత్తున జిల్లా సరిహద్దులు దాటుతున్నా అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు.
గ్రామాల్లో బియ్యం పంపిణీ మొదలైనప్పటి నుంచి అక్రమార్కులు కూలీలను ఏర్పాటు చేసి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి సోనా మసూరి బియ్యంలో కలిపి కొందరు వ్యాపారులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడానికి చట్టంలోని లొసుగులే కారణంగా తెలుస్తోంది. కోటా బియ్యం, ఇతర కోటా సరుకులు ఎక్కడైనా పట్టుబడితే ప్రజా పంపిణీ వ్యవస్థలోని చట్టం 6ఏ కేసును మాత్రమే అధికారులు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత కలెక్టర్, జేసీలు విచారించి అపరాధ రుసుం విధించడం, స్వాధీనం చేసుకున్న సరుకులో పూర్తిగా, కొంత ప్రభుత్వ పరం చేసుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల అక్రమార్కులకు పెద్దగా నష్టం లేకపోవడంతో పదేపదే వారు ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు.
అక్రమార్కులకు ‘ఆహారం’
Published Tue, Nov 19 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement