సారూ.. నీకు హ్యాట్సాఫ్‌: 14 కిలోమీటర్లు.. రెప్పపాటు క్షణాలు | Kerala Teacher Sukumaran Walks 14 KM To Teach Tribal Students | Sakshi
Sakshi News home page

గురుబ్రహ్మ: కారడవిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..

Published Sat, Jun 5 2021 3:25 PM | Last Updated on Sat, Jun 5 2021 5:12 PM

Kerala Teacher Sukumaran Walks 14 KM To Teach Tribal Students - Sakshi

గురువు లేని విద్య గుడ్డిదని అంటారు పెద్దలు. అయితే పిల్లలపై వేధింపులకు పాల్పడే కీచకులే కాదు.. వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం వ్యయప్రయాసలకూ ఓర్చే గురు బ్రహ్మలు ఉంటారనే విషయాన్ని నిరూపించారు కేరళకు చెందిన ఓ టీచర్. బయటి ప్రపంచం ముఖం ఎరుగుని గిరిజనుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి అడవి గుండా రోజూ సాగిస్తున్న ఆయన 14 కిలోమీటర్ల ప్రయాణం పదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.    

కొచ్చి: సుకుమారన్​ టీసీ.. ఒక ఉపాధ్యాయుడు అనడం కంటే బంగారం లాంటి మనసున్న వ్యక్తి అనడం మేలు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించే మనుషుల మధ్య..  అడవిలో బతికే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం కోసమే సుకుమారన్​ ఎన్నో త్యాగాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే అక్కడి పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు ఆ గురువును దైవంగా గౌరవించుకుంటారు. 

భయపడ్డ వాళ్లతోనే..
అది జనవరి 1వతేదీ, 2001. ఆరు నెలల క్రితమే ట్రైనింగ్​లో చేరి.. శిక్షణ పూర్తి చేసుకున్న సుకుమారన్​కి జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం కింద వయనాడ్​ జిల్లా పూలపల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. అది చెక్కడీ ప్రాంతంలో బయటి మనుషులతో ఏమాత్రం సంబంధం లేని కట్టునాయ్​కర్​ గిరిజన ప్రజలు బతికే చోటు, పైగా 750రూ. జీతం మాత్రమే. వద్దని తల్లిదండ్రులు​ బతిమిలాడినప్పటికీ.. కొన్ని రోజులు చూద్దామనే ఆలోచనతో అక్కడికి చేరుకున్నాడు సుకుమారన్​. ఓ సహాయకుడితో ఆ గూడెంకి చేరుకోగానే.. అక్కడి ప్రజలంతా వీళ్లను చూసి భయంతో గుడిసెల్లోకి దూరి కన్నాల్లోంచి తొంగిచూశారట.  చివరికి కాళి అనే ఓ పెద్దావిడ ధైర్యం చేసి ఆరోజు తనతో మాట్లాడిందని సుకుమారన్ గుర్తు చేసుకున్నాడు. చివరికి సుకుమారన్​ ఉద్దేశం తెలిశాక ఆమె సర్దిచెప్పడంతో మిగతా వాళ్లు వాళ్ల పిల్లల్ని సుకుమారన్​ దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నారు.

14 కిలోమీటర్లు.. రెప్పపాటు క్షణాలు
సుకుమారన్​ అక్కడే ఉండిపోవడానికి కారణం.. వాళ్ల అమాయకత్వం, మంచితనం. ఆ తండాలో స్కూల్​ లేదు. ఆరేండ్లపాటు చెట్లకిందే పాఠాలు.. అదీ ఒక్కడే నేర్పించాడు సుకుమారన్. పూలపల్లిలో అతని రూం. అక్కడి నుంచి కట్టునాయ్​కర్ తండా ఏడుకిలోమీటర్లు. రోజూ రానూ పోనూ మొత్తం 14 కిలోమీటర్లు ప్రయాణమన్నమాట. అది కూడా దట్టమైన అడవి గుండా. గజరాజులు తిరిగే ఆ ప్రాంతం గుండా వెళ్లడానికి ఫారెస్ట్​ రేంజర్లే వణికిపోతుంటారు. కానీ, సుకుమారన్​కి అది అలవాటైన ప్రయాణం. ఈ పదేళ్లలో ఎన్నోసార్లు ఏనుగుల గుంపులు, వన్యప్రాణులు తన దారికి అడ్డుపడ్డాయని అంటాడాయన. మామూలుగా అయితే అడవి ఏనుగులు మనుషులు కనిపిస్తే దాడి చేయకుండా వదలవు. కానీ, సుకుమారన్​ విషయంలోనే ఇంతవరకూ అలాంటి ఘటనలు జరగకపోవడంపై అక్కడి తండా ప్రజలు ఆయన అదృష్టంగా భావిస్తున్నారు.

శుభ్రతతో మొదలై.. 
పిల్లలపై సుకుమారన్​ బాధ్యత కేవలం చదువుతోనే సాగలేదు. అక్కడి పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు శుభ్రతను పరిచయం చేసింది కూడా ఈయనే. మొదట్లో పిల్లలకు స్వయంగా గోర్లు, జుట్టు కత్తిరించడం కూడా చేసేవాడాయన. అంతేకాదు మధ్యాహ్నాభోజన పథకంలో కేరళ ప్రభుత్వం ఆ స్కూల్​ను చేర్చే వరకు.. ఓ ఎన్జీవో సహకారంతో స్వయంగా ఆయనే వండి.. పిల్లలకు భోజనం వడ్డించేవాడు. అలాగే అక్కడి వాళ్లలో చాలామందికి బర్త్ సర్టిఫికెట్స్​ లేవు. దీంతో స్థానిక అధికారులతో మాట్లాడి.. అందరికీ బర్త్​ సర్టిఫికెట్లు, ఆపై  చెక్కడి వార్డు పరిధిలో రేషన్​ కార్డులు అందేలా కృషి చేశాడు. సుకుమారన్​కి భార్య, ముగ్గురు పిల్లలు. కానీ, ఆ తండా పిల్లల్ని తన బిడ్డలుగానే భావిస్తుంటాడాయన. అందుకే టెంపరరీ టీచర్​ సర్వీసులో ఉన్న ఆయనకు రెండుమూడుసార్లు అక్కడి నుంచి వెళ్లిపోయే ఛాన్స్​ వచ్చినా.. కావాలనే వదిలేసుకున్నాడు. ‘సర్’​ అని అప్యాయంగా వాళ్లు పిలుస్తుంటే.. తన నడక బాధను, మూడు నాలుగు నెలలకొకసారి ఆలస్యంగా జీతాలు అందుకుంటున్న విసుగును సైతం మరిచిపోయి సంతోష పడుతుంటానని చెప్తున్నాడాయన.

చదవండి: సదువు కోసం అరిగోస

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement