మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.
ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది.
గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.
అడవి ఒక్కలాగా ఉండదు
అడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం.
వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.
మొదలైన అన్వేషణ
ఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది.
‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్‌లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్‌లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.
స్మగ్లర్లు అనుకుని
ఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్‌కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం.
టార్చ్‌లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్‌లైట్‌ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.
వారు అడవిని జయించారు
గతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.
మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?
వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment