సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే పాఠాలు బోధించడం సత్ఫలితాలను ఇస్తోంది. స్కూళ్లలో హాజరు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 920 పాఠశాలల్లో సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ‘మాతృభాష ఆధారిత బహు భాషా విద్య’ (మదర్ టంగ్ బేస్డ్ మల్టీ లింగ్విల్ ఎడ్యుకేషన్–ఎంటీఎంఎల్‌ఈ) పేరుతో ఇది అమలవుతోంది. ఒకటి, రెండు, మూడు తరగతుల్లోని దాదాపు 18,975 మంది గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలో పాఠాలు బోధిస్తున్నారు. సవర, కొండ, ఆదివాసీ, కోయ, సుగాలి పిల్లలు సొంత భాషలోనే పాఠాలు చదువుకుంటున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సవర భాషలో.. విజయనగరం జిల్లాలో కొండ, కువి, ఆదివాసీ ఒడియా భాషల్లో.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోయభాషలో.. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సుగాలి, లంబాడి భాషల్లో బోధన జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల గిరిజన విద్యార్థులకు ఆయా భాషల్లో రూపొందించిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ టీచర్లకు స్థానిక భాషల్లో బోధనకు సహకరించేందుకు మల్టీ లింగ్విల్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా(ఎంఎల్‌ఈ) ఆయా భాషలు వచ్చిన వారిని పాఠశాలల్లో నియమించారు. విద్యావంతులైన స్థానిక గిరిజన యువతనే ఎంఎల్‌ఈలుగా ఎంపిక చేశారు. ఎంఎల్‌ఈలుగా ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఆయా గిరిజన భాషలు మాట్లాడగలిగే 1,027 మందిని ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల వరకు వేతనం ఇస్తున్నారు. గిరిజన భాషల్లో బోధనకు ప్రభుత్వం రూ.42 లక్షలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తోంది.
సంప్రదాయాలు, పొడుపు కథలు
గిరిజన విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాల్లో ఆయా గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే అంశాలను, పొడుపు కథలను చేర్చారు. విద్యార్థులు వాటిని ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. గిరిజన భాషల్లోనే బాలసాహిత్యాన్ని అభివృద్ధి పర్చడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు ఒక్కో భాషకు రూ.13.33 లక్షల చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆరు గిరిజన భాషల్లో పొడుపు కథలు, బాలల కథలు, బొమ్మలతో కూడిన నిఘంటువులను, పదకోశాలను రూపొందిస్తున్నారు.
సత్ఫలితాలు వస్తున్నాయి
‘‘ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో బోధన సాగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాం. ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే ఆయా భాషల్లో బాలసాహిత్యం, ఇతర అంశాలతో కూడిన పుస్తకాలు సిద్ధం చేస్తున్నాం’’
– వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ
గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు
‘‘గిరిజన విద్యార్థులకు వారి సొంత భాషలోనే పాఠాలు బోధించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. గతంలో వారికి ఆయా పాఠాలు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు సులభంగా నేర్చుకుంటున్నారు. బిడ్డలకు తల్లిపాలు ఎంత ప్రయోజనకరమో తల్లిభాషతో బోధన కూడా అంతే ఉపయోగకరం. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో మార్పు గమనిస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆకాంక్షిస్తున్నాం’’
– పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు, విజయనగరం జిల్లా
మా పిల్లలకు ఎంతో మేలు
‘‘మా పిల్లలు గతంలో బడులకు వెళ్లినా పాఠాలు అర్థంకాక ఏమీ నేర్చుకోలేకపోయేవారు. తరగతులకు వెళ్లకుండా ఆటల్లో మునిగిపోయేవారు. ఇప్పుడు మా సవర భాషలోనే పాఠాలు చెబుతుండడంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్తున్నారు. మా సొంత భాషలోనే పాఠాలు చెబుతుండడంతో మా పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది’’
– పత్తిక సుశీల, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment