గొంతు..గొంతు ఒక్కటి చేసి.. | Tribal students concern at Parvathipuram ITDA Office | Sakshi
Sakshi News home page

గొంతు..గొంతు ఒక్కటి చేసి..

Published Tue, Nov 11 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

గొంతు..గొంతు ఒక్కటి చేసి..

గొంతు..గొంతు ఒక్కటి చేసి..

తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నా ప్రయోజకులమవ్వాలన్న విద్యార్థుల ఆకాంక్షను పాలకులు, అధికారులు దూరం చేస్తుం టే..అక్షరాలు చదవాల్సిన గిరిజన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పాఠాలు వల్లె వేయాల్సిన నోటితో నినాదాలు చేశారు. మండుటెండలో నడిరోడ్డుపై కూర్చుని అయ్యా...మా సమస్యలు పరిష్కరించండంటూ ప్రాథేయపడ్డారు.చేయి.. చేయి..కలిపి, గొంతు..గొంతు ఒక్కటి చేసిన గిరిజన విద్యార్థులు..ఆందోళనను తీవ్రం చేశారు. వారిని వారించే పనిలో పోలీసులు తమ బలాన్ని చూపించారు. అంతే పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం సోమవారం  రణరంగాన్ని తలపించింది.  
 
పార్వతీపురం: దశాబ్దాల తరబడి వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు సోమ వారం చేపట్టిన ‘ఛలో ఐటీడీఏ’ కార్యక్రమం  ఉద్రిక్తతకు దారితీసింది. చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేక, తమను తల్లిదండ్రుల్లా చూసుకునేందుకు పర్మినెంట్ వార్డెన్లు లేక, మరుగుదొడ్లు, నీరు, మంచాలు, వైద్యసదుపాయం తదితర మౌలిక సదుపాయాలు అందక అవస్థలు పడుతున్న విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.

దీనిలో భాగంగా విద్యార్థి సంఘ నాయకులు  ఎ.అశోక్, ఎం.గణేష్ తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు పార్వతీపురం   ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి బెలగాం మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా  కార్యాలయం ముందు కూర్చుని ధర్నా  చేపట్టారు. దీనిలో భాగంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని వసతిగృహాలు, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కోరారు.  గ్రీన్ చానెల్ ద్వారా 3 నెలలకొకసారి మెస్ బిల్లు చెల్లించాలన్నారు. పర్మినెంట్ వార్డెన్లను నియమించాలన్నారు.

హుద్‌హుద్ తుపాను ప్రభావంతో ఎగిరిపోయిన బాత్‌రూమ్ తలుపులు, గదుల పైకప్పులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. జీఎల్‌పురంలో పాలిటెక్నికల్ కళాశాలతోపాటు పర్మినెంట్ డీడీని నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల పట్ల కనీస స్పందన లేని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చే స్తూ పాటలు పాడారు. అనంతరం పీఓ వచ్చి తమ సమస్యలు వినాలని పట్టుబట్టారు. దీంతో  సీఐ బి.వెంకటరావు విద్యార్థి నాయకుల్ని పీఓ వద్దకు పంపించారు. విద్యార్థుల సమస్యలు విన్న పీఓ రజత్ కుమార్ సైనీ సమస్యల పరిష్కారం తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేయడంతో, ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు.

ఈసందర్భంగా ఎండను తట్టుకోలేక గుమ్మలక్ష్మీపురం కళాశాలకు చెందిన బిడ్డిక మహిష్మ అనే విద్యార్థిని సొమ్మసిల్లిపడిపోవడంతో సీఐ వెంకటరావు ఆ విద్యార్థినిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించారు.  అనంతరం విద్యార్థులు మూకుమ్మడిగా కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు వాహనాల్లో పడేశారు. విద్యార్థినులు పో లీసుల వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు.  

ఈ సందర్భంగా సీఐ వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చే శారు. అయినప్పటికీ విద్యార్థులు ససేమిరా అనడంతో కొంతమందిని రూర ల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగ తా విద్యార్థులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సహచర విద్యార్థులను విడిచిపెడితేనే తాము వెళ్తామని విద్యార్థులు మొండిపట్టుపట్టారు. ఈ నేపథ్యంలో మెయిన్‌రోడ్డుపై కొంతసేపు పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడు తూ సమస్యల పరిష్కారం కోరితే పో లీసులతో తరిమి కొట్టించారని వాపోయారు. చివరకు 30 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని మిగిలిన విద్యార్థులను చెదరగొట్టి పంపించివేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement