RTC Complex
-
డివైడర్‌ను ఢీకొనడంతో ఘటనలో ఇద్దరు మృతి
అల్లిపురం(విశాఖ దక్షిణ): ఆర్టీసీ కాంప్లెక్స్ దరి తెలుగుతల్లి ఫ్లైవోవర్‌పై నెల తిరక్కుండానే మంగళవారం మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువకుడు, ఇంటర్ విద్యార్థిని మృతి చెందారు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. సంపత్ వినాయక గుడి వైపు నుంచి రైల్వేస్టేషన్ వైపు ప్రశాంత్ (22), రాధిక (17) బైక్‌పై వస్తూ.. డీఆర్ఎం కార్యాలయం దాటిన తర్వాత వచ్చే మలుపులో డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రశాంత్ తల డివైడర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రాధికను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ప్రశాంత్‌ది విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతం. అతను సీతమ్మధారలోని ఫ్యాషన్ వైబ్స్ లో సెలూన్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రైల్వే న్యూకాలనీలో నివసిస్తున్నాడు. రాధిక మురళీనగర్‌లోని ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో నివసిస్తోంది. ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్ దరి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ కె.వెంకటరావు, ఎస్ఐలు మన్మధరావు, సల్మాన్ బేగ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వారిద్దరూ బైక్‌పై ఎందుకు కలిసి వస్తున్నారనే విషయం తెలియరాలేదు. గత నెల 20న ఇదే ప్రాంతంలో నేవల్ ఉద్యోగి అనిల్‌కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
అదనపు అక్రమం
ప్రధాన మార్గంలో సెట్ బ్యాక్ వదలకుండానే భవన నిర్మాణం పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు పైగా రోడ్డు విస్తరణలో స్థలం పోతుందంటూ ఉదారత భవన యజమానికి టీడీఆర్ బోనస్ మంజూరు ఆ దన్నుతో పక్క స్థలం కబ్జాకు తెగిస్తున్న యజమాని వారిపై బెదిరింపులు, దాడులు.. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం అదో అక్రమ కట్టడం.. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నా.. ఒక్క ఇంచీ అయినా సెట్‌బ్యాక్ స్థలం వదలకుండానే పక్కా భవంతి నిర్మించేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.. ఘనత వహించిన జీవీఎంసీ అధికారులు రోడ్డు విస్తరణలో ఆ భవనానికి చెందిన కొంత స్థలం పోతుందని నిర్థారించిన సమయంలోనైనా ఈ అక్రమాన్ని గుర్తించలేదో.. లేక గుర్తించనట్లు నటిస్తున్నారో తెలీదు గానీ.. విస్తరణలో పోయే స్థలానికి బదులుగా అదనపు అంతస్తు నిర్మాణానికి ఉదారంగా అనుమతి ఇచ్చేశారు.. కానీ సదరు భవన యజమాని విస్తరణకు స్థలాన్ని ఇవ్వకపోగా.. పక్కనున్న స్థలాలపైనా కన్నేశాడు.. వారిని ఖాళీ చేయించేందుకు బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నాడు.. విశాఖపట్నం : విశాఖ నగరంలోని కీలకమైన దొండపర్తి ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్లే ప్లై ఓవర్ మొదటి కాలమ్ వద్ద ప్రధాన రహదారిని ఆనుకుని ఓ జి ప్లస్ టు భవనం ఉంది. ఫర్నిచర్ వ్యాపారం నిర్వహిస్తున్న నవీన్ మరోడా దాని యజమాని. బహుళ అంతస్తుల భవనాలు.. అదీ రహదారిని ఆనుకొని నిర్మించేవాటికి నిబంధనల ప్రకారం రోడ్డు నుంచి కొంత స్థలానికి సెట్‌బ్యాక్‌గా వదిలిపెట్టాలి. కానీ ఈ భవన నిర్మాణ విషయంలో ఆ నిబంధనను అసలు పట్టించుకోలేదు. ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా 150 అడుగుల రహదారి ఉంది. ఆ ప్రకారం కనీసం పందొమ్మిదిన్నర అడుగుల సెట్ బ్యాక్ స్థలం వదిలి భవనాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. రహదారికి ఆనించి నిర్మాణం కానిచ్చేశారు. అయినా అధికారులెవరూ పట్టించుకోలేదు. విస్తరణ సమయంలోనూ విస్మరణ నిర్మాణ సమయంలో పట్టించుకోని అధికారులు ఈ మార్గంలో ఫ్లై ఓవర్ నిర్మాణం, రోడ్డు విస్తరణ సమయంలోనైనా ఈ అక్రమాన్ని పట్టించుకోలేదు. పైగా రోడ్డు విస్తరణ కొలతలు వేసినప్పుడు ఈ భవనానికి చెందిన 334 గజాల ఈ స్థలంలో కొంత పోతుందని నిర్థారించారు. దానికి బదులుగా 30 గజాల స్థలానికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ (టీడీఆర్)ను భవన యజమానికి ఉదారంగా ఇచ్చేశారు. ఆ హక్కుతోనే తాను సెట్ బ్యాక్ స్థలంతో కలిపి భవన నిర్మాణం చేపట్టానని యజమాని వాదిస్తున్నారు. కానీ టీడీఆర్ పొందిన వారు అదనపు అంతస్తు మాత్రమే వేసుకోవాలి గానీ.. సెట్‌బ్యాక్ స్థలాన్ని మింగేయడానికి కాదు. మరోవైపు రహదారి విస్తరణలో స్థలం కోల్పోతున్నందునే టీడీఆర్ ఇచ్చామని అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఆ స్థలం కూడా ఇవ్వకుండానే టీడీఆర్‌ను వినియోగించుకుంటున్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తులపై మరో అంతస్తుకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసినట్లే. దీని వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జీవీఎంసీ అధికారులు తనకు అనుకూలంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని తమ స్థలాన్ని ఆక్రమించేందుకు నవీన్ మరోడా ప్రయత్నిస్తున్నారంటూ పక్కనే నివాసం ఉంటున్నవారు ఆరోపిస్తున్నారు. స్థలాన్ని తనకు అప్పగించాలంటూ బెదిరింపులకు, దాడులకు సైతం పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. -
వినోద ప్రాంగణం!
ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ఇక మినీ థియేటర్లు మొదట హయత్‌నగర్, ఈసీఐఎల్, పటాన్చెరులో... ఆదాయం పెంపు వ్యూహంలో భాగంగానే.. సిటీబ్యూరో: ప్రయాణికులకు వినోదభరితమైన కబురు. సరదాగా సినిమాకి వెళ్లాలనుకుంటున్నారా...ఇక మీరు సినిమాల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలే ఇక మినీ థియేటర్లుగా అవతరించనున్నాయి.ప్రయాణ సదుపాయంతో పాటు వినోదభరితమైన చిత్రాలను కూడా అందజేయనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు గ్రేటర్‌లోని అన్ని ప్రధాన ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు రాబోతున్నాయి. హయత్‌నగర్, ఈసీఐఎల్, కాచిగూడ, కోఠీ, కూకట్పల్లి, పటాన్‌చెరులోని కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్లలో మినీథియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మొదట పటాన్‌చెరులోని ప్రయాణ ప్రాంగణంలో త్వరలో మినీ థియేటర్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో థియేటర్లో 125 నుంచి 150 మంది వరకు కూర్చొనే విధంగా ఈ థియేటర్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన తరహాలోనే మినీథియేటర్స్ను కూడా అద్దెకు ఇస్తారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు కేవలం టిక్కెట్‌పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా ఇతర మార్గాలను సైతం అన్వేషించాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. అదనపు ఆదాయం వచ్చే మార్గాన్వేషణలో భాగంగా మినీ థియేటర్లకు శ్రీకారం చుట్టారు. మొదట నగరంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లలో కూడా థియేటర్లు ఏర్పాటు చేస్తారు. అన్ని సదుపాయాలు ఒకేచోట.... రవాణా సదుపాయాన్ని అందజేయడంతో పాటు నగరవాసులకు కావలసిన సదుపాయాలన్నింటినీ ఒకే చోట అందజేయాలన్న లక్ష్యంతో ఆర్టీసీ దశలవారీగా ప్రయాణ ప్రాంగణాలను నిర్మించింది. నిత్యావసర వస్తువులు, ఈ సేవ, బ్యాంకింగ్, బస్‌పాస్‌ల జారీ వంటి అన్ని రకాల సదుపాయాలు, సేవలు లభించేందుకు అనుగుణంగా జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా దశలవారీగా ఏర్పాటు చేశారు. కాచిగూడ, కోఠీ వంటి కొన్ని ప్రాంగణాలకు వ్యాపారవర్గాల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ మరికొన్ని ఎలాంటి ఆదరణకు నోచకుండా అలంకారప్రాయంగా ఉండిపోయాయి. హయత్‌నగర్ ప్రధాన హైవేపైన ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడి కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్‌కు వ్యాపారవర్గాల నుంచి స్పందన కరువైంది. అలాగే కూకట్పల్లి, ఈసీఐఎల్ కేంద్రాల్లోనూ ఆర్టీసీ కాంప్లెక్స్‌లు అలంకారప్రాయంగానే ఉన్నాయి. ఇలాంటి చోట్ల మినీ థియేటర్లను ఏర్పాటు చేయడ ం వల్ల అదనపు ఆదాయం లభించగలదని ఆర్టీసీ అంచనా వేస్తోంది. నష్ట నివారణకు ఇదో మార్గం... నగరంలోని 28 డిపోల ద్వారా ప్రతి రోజు సుమారు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 33 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. బస్సుల నిర్వహణ, విడిభాగాలు, ఇంధనం కొనుగోళ్లు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చుల వల్ల ఏటేటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుండగా, బస్సుల నిర్వహణ కోసం రూ.3.5 కోట్ల మేర ఖర్చు చేయవలసి వస్తోంది. దీంతో రోజుకు రూ.కోటి మేర నష్టం వాటిల్లుతోంది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్ఎంసీ గత సంవత్సరం రూ.100 కోట్ల మేర అందజే సింది. తాజాగా రూ.198 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ప్రస్తుతం టిక్కెట్టేతర ఆదాయంపైన ప్రధానంగా దృష్టి సారించారు. -
గంజాయితో పట్టుబడ్డ నైజీరియన్
విశాఖపట్నం : గంజాయి తరలిస్తూ నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ద్వారకానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన ఇకెచుకువా ఆగస్టీన్(23) అరకులో గంజాయి కొనుగోలు చేసి ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సు దిగాడు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌కు నడిచివెళ్తున్నాడు. సీటీఎఫ్ పోలీసులు, ద్వారకా పోలీసులు కలసి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రెండు బ్యాగులు తనిఖీ చేయగా 30 కేజీల బరువైన 15 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. సరకుతో పాటు అర్బన్ ఎమ్మార్వో ఎదుట హాజరు పరిచారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. -
భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన నిరుద్యోగులు
విశాఖపట్నం : విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. బాబు వస్తేనే జాబు వస్తుందన్న మాట నిలబెట్టుకోవాలని, వెంటనే ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగభృతి కింద నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామన్న మాటైనా నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. -
పెరిగిన పుష్కర భక్తుల రద్దీ
శ్రీకాకుళం అర్బన్: గోదావరి పుష్కరాల కోసం ఆఖరు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో జిల్లాలోని భక్తులంతా గోదావరి వైపే పయనిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ భక్తులతో గురువారం కిక్కిరిసింది. ఇప్పటికే జిల్లాలోని చాలామంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. మిగిలిన వారు కూడా కుటుంబాలతో సహా పుష్కర స్నానాలకు బయలుదేరుతున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగానే ఆర్టీసీ అధికారులు బస్సులను నడుపుతున్నారు. శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల నుంచి బస్ సర్వీసులు వేశారు. భక్తులను క్యూలో నిల్చొబెట్టి ప్రతి 15 నిముషాలకు ఒక ఆర్టీసీ బస్సును పెట్టి భక్తులను తరలిస్తున్నారు. భక్తుల రద్దీ గత మూడు రోజులుగా ఉదయం వేళల్లో కాస్తా తక్కువగా ఉన్నా, సాయంత్రం అయ్యేసరికి అమాంతం పెరుగుతోంది. కాంప్లెక్స్‌లో పుష్కర సందడి కనిపిస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండవచ్చు గోదావరి పుష్కరాల గడువు ముగుస్తున్న కొద్దీ చివరి రెండు రోజులూ అధిక సంఖ్యలో భక్తులు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణికులకు తగ్గట్లుగానే ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. ఈరద్దీ ఇంకా ఎక్కువగా ఉంటే ముందుగా విశాఖపట్టణం తరలించి అక్కడ నుంచి రాజమండ్రికి పంపుతున్నాం. శ్రీనివాసరావు, ఆర్టీసీ డీసీటీఎం -
రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రావొద్దు
సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వచ్చే భక్తులు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుగు ప్రయాణంలో బస్సుల కోసం వేలాది మంది ప్రయాణికులు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. అయితే, భక్తులు బస్సుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్లకు కాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వస్తుండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు చెప్పారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులను నడపడం లేదని, తాత్కాలిక బస్టాండ్లకు చేరుకోవాలని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. విశాఖ వైపు నుంచి వచ్చేవారు.. విశాఖపట్నం, జగ్గంపేట, ప్రత్తిపాడు, అన్నవరం, తుని, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాజమండ్రి నగర శివారులోని హౌసింగ్ బోర్టు బస్టాండులో దిగాలి. అక్కడి నుంచి కోటిలింగాల ఘాట్‌కు చేరుకొని స్నానం చేయాలి. తిరిగి ప్రయాణంలో అదే బస్టాండుకు చేరుకొని విశాఖ వైపు వెళ్లాలి. విజయవాడ నుంచి వచ్చేవారు రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలతోపాటు, విజయవాడ, తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలవారు రాజమండ్రిలోని లూథర్‌గిరి బస్టాండులో దిగాలి. కోటిలింగాల ఘాట్‌లో పుష్కర స్నానం చేసి తిరిగి అదే బస్టాండు నుంచి స్వస్థలాలకు వెళ్లాలి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు మోరంపూడి సెంటర్లోని జెమినీ గ్రౌండ్స్‌లో దిగి అందుబాటులో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు చేసి, అదే బస్టాండుకు వెళ్లాలి. నిల్చొని ప్రయాణం చేసేవారికి రాయితీ విశాఖ వైపు బస్సుల్లో నిల్చొని ప్రయాణం చేసేవారికి టిక్కెట్ చార్జీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. శనివారం నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. -
కొనసాగిన ఆక్రమణల తొలగింపు
విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు పనులు మూడో రోజైన శనివారం కూడా కొనసాగాయి. రైల్వే స్టేషన్ రోడ్డు, జిల్లా పరిషత్ కార్యాలయం పక్కనున్న బడ్డీలు, సున్నంబట్టి, సీఎంఆర్ ఎదురుగా ఉన్న తాటాకులు ఇళ్లు, నాయుడు ఫంక్షన్ హాల్ నుంచి ఎన్సీఎస్ థియేటర్ మీదుగా రూరల్ పోలీసు స్టేషన్‌కు వరకున్న ఆక్రమణలను ప్రొక్లయినర్లతో తొలగించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను ఆక్రమించిన షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు రాజేశ్వరరావు, ఎ.లక్ష్మణరావు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రూరల్ సీఐ ఎ.రవికుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్సై టి.కామేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్సై ఎస్.అమ్మినాయుడు, ఏఎస్సై ఎ.ఎం.రాజు, టూటూన్ ఏఎస్సై ఎల్.ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి లీలామహల్ వరకు రోడ్డుపై ఉన్న షాపులను యజమానులే స్వచ్ఛందంగా తొలగించారు. ప్రజల సౌకర్యార్థమే.. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థమే ఆక్రమణలను తొలగిస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరరావు తెలిపారు. చాలామంది కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల మురుగు నీరు నిల్వ ఉండిపోతోందన్నారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు. ప్రత్యామ్నాయం చూపించాలి తొలగింపు పనులు చేపడుతున్న అధికారులు తమకు ప్రత్యామ్నాయం చూపించాలని దళిత సంక్షేమ సంఘ అధ్యక్షుడు జి. సత్యనారాయణ, పళ్ల దుకాణాలు నిర్వహించే పలువురు మహిళలు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్. సోమనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా తోటపాలానికి వెళ్లే రోడ్డుపై ఆక్రమణలు తొలగించారు. దీంతో వారందరూ కమిషనర్ వద్దకు చేరుకుని తమకు ప్రత్యామ్నాయం చూపించకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ నిబంధనల మేరకే ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. -
చిన్నారి మృతదేహంతో ఆందోళన
కాకినాడ క్రైం : చిన్నారి మృతదేహంతో బంధువులు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ డిపో గేటు వద్ద ఆందోళనకారులు బైఠాయించడంతో నాలుగు గంటలపాటు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన రేకాడి శ్రీ దుర్గ (7), ఆమె తండ్రి రేకాడి నూకరాజు, బంధువు కామాడి వెంకటేష్ మోటారు సైకిల్‌పై వెళ్తుండగా శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో జెడ్పీ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి త్రీ టౌన్ పోలీసులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆమె మృతదేహంతో బంధువులు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుని గేట్లు దిగ్బంధించారు. అక్కడికి ఏటిమొగకు చెందిన పలువురు వచ్చి చేరడంతో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. బస్సులను నిలుపుదల చేయడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ డిపోనకు వచ్చే బస్సులు కూడా రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు, నగర ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఆందోళనకారులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా శ్రీదుర్గ మృతి చెందిందని, ఆమె తండ్రి, బంధువు తీవ్రగాయాలపాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. ఒక చిన్నారి ప్రాణం పోయినా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐలు డీఎస్ చైతన్యకృష్ణ, అద్దంకి శ్రీనివాసరావు, ఎస్.గోవిందరావు, ఆండ్ర రాంబాబు తదితరులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. అయితే తాము నష్టపరిహారంగా రూ.25 వేలు మాత్రమే ఇస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడాన్ని ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు సర్ది చెప్పడంతో సాయంత్రం ఐదు గంటలకు వారు ఆందోళన విరమించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్‌కు చేరుకున్న ప్రయాణికులు, బస్సుల్లో ఉన్నవారు నాలుగు గంటలపాటు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఆందోళనకారులు భారీ స్థాయిలో వచ్చి చేరడంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఆటోలను ఆశ్రయించారు. ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడిందని అధికారులు పేర్కొంటున్నారు. -
గొంతు..గొంతు ఒక్కటి చేసి..
తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నా ప్రయోజకులమవ్వాలన్న విద్యార్థుల ఆకాంక్షను పాలకులు, అధికారులు దూరం చేస్తుం టే..అక్షరాలు చదవాల్సిన గిరిజన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పాఠాలు వల్లె వేయాల్సిన నోటితో నినాదాలు చేశారు. మండుటెండలో నడిరోడ్డుపై కూర్చుని అయ్యా...మా సమస్యలు పరిష్కరించండంటూ ప్రాథేయపడ్డారు.చేయి.. చేయి..కలిపి, గొంతు..గొంతు ఒక్కటి చేసిన గిరిజన విద్యార్థులు..ఆందోళనను తీవ్రం చేశారు. వారిని వారించే పనిలో పోలీసులు తమ బలాన్ని చూపించారు. అంతే పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం సోమవారం రణరంగాన్ని తలపించింది. పార్వతీపురం: దశాబ్దాల తరబడి వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు సోమ వారం చేపట్టిన ‘ఛలో ఐటీడీఏ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేక, తమను తల్లిదండ్రుల్లా చూసుకునేందుకు పర్మినెంట్ వార్డెన్లు లేక, మరుగుదొడ్లు, నీరు, మంచాలు, వైద్యసదుపాయం తదితర మౌలిక సదుపాయాలు అందక అవస్థలు పడుతున్న విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా విద్యార్థి సంఘ నాయకులు ఎ.అశోక్, ఎం.గణేష్ తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి బెలగాం మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేపట్టారు. దీనిలో భాగంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని వసతిగృహాలు, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కోరారు. గ్రీన్ చానెల్ ద్వారా 3 నెలలకొకసారి మెస్ బిల్లు చెల్లించాలన్నారు. పర్మినెంట్ వార్డెన్లను నియమించాలన్నారు. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో ఎగిరిపోయిన బాత్రూమ్ తలుపులు, గదుల పైకప్పులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. జీఎల్‌పురంలో పాలిటెక్నికల్ కళాశాలతోపాటు పర్మినెంట్ డీడీని నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల పట్ల కనీస స్పందన లేని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చే స్తూ పాటలు పాడారు. అనంతరం పీఓ వచ్చి తమ సమస్యలు వినాలని పట్టుబట్టారు. దీంతో సీఐ బి.వెంకటరావు విద్యార్థి నాయకుల్ని పీఓ వద్దకు పంపించారు. విద్యార్థుల సమస్యలు విన్న పీఓ రజత్ కుమార్ సైనీ సమస్యల పరిష్కారం తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేయడంతో, ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు. ఈసందర్భంగా ఎండను తట్టుకోలేక గుమ్మలక్ష్మీపురం కళాశాలకు చెందిన బిడ్డిక మహిష్మ అనే విద్యార్థిని సొమ్మసిల్లిపడిపోవడంతో సీఐ వెంకటరావు ఆ విద్యార్థినిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించారు. అనంతరం విద్యార్థులు మూకుమ్మడిగా కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు వాహనాల్లో పడేశారు. విద్యార్థినులు పో లీసుల వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. ఈ సందర్భంగా సీఐ వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చే శారు. అయినప్పటికీ విద్యార్థులు ససేమిరా అనడంతో కొంతమందిని రూర ల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగ తా విద్యార్థులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సహచర విద్యార్థులను విడిచిపెడితేనే తాము వెళ్తామని విద్యార్థులు మొండిపట్టుపట్టారు. ఈ నేపథ్యంలో మెయిన్‌రోడ్డుపై కొంతసేపు పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడు తూ సమస్యల పరిష్కారం కోరితే పో లీసులతో తరిమి కొట్టించారని వాపోయారు. చివరకు 30 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని మిగిలిన విద్యార్థులను చెదరగొట్టి పంపించివేశారు. -
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఒకేతాను ముక్కలు
విజయనగరం టౌన్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఒకే తానులోని ముక్కలని, వాటి జెండాలు వేరైనా, అజెండా మాత్రం ఒకటేనని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు రెడ్డి నారాయణరావు ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కఠిన నిర్ణయాలు, సంస్కరణల పేరిట సామ్రా జ్యవాదులకు దేశ బడా కార్పొరేటు కంపెనీల ప్రయోజనాలు కాపాడే విధానాలు అనుసరిస్తున్నారన్నారు. ఎన్నికల వాగ్దానాలకు తూట్లు పొడిచిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తూ సంక్షేమ పథకాలు కుదించడానికే ఆధార్ లింక్ పెట్టిందన్నారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అధికారం చేపట్టిన నెలరోజులు దాటకుండానే రైలు చార్జీలు పెంచిందని, అక్కడితో ప్రారంభించి ప్రతినెలా దొరికిన వస్తువులపై వడ్డింపులకు సిద్ధపడుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా అధిక ధరలను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చర్యలూ చేపట్టకుండా చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ధర్నాలో వివిధ ప్రజాసమస్యలపై చిన్నారులు గౌతమి, దేవి, సతీష్ , కార్మిక సోదరులు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకునాయి. కార్యక్రమంలో నాయకులు బి.శంకరరావు, ఆటోయూనియన్ అధ్యక్షుడు ఎన్.అప్పలరాజు రెడ్డి, ఎం.పైడిరాజు, ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
సీసీ కెమెరాల ఏర్పాటు కలేనా?
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న పాలకులు, అధికారుల హామీ కాగితా లకే పరిమితమైంది. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆరు నెలల క్రితం జిల్లా పోలీసు శాఖ నిర్ణరుుంచింది. అందుకు తగ్గ పరిశీలన, ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ముందుగా ట్రైయల్ రన్ గా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. కాంప్లెక్స్‌లో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా హెల్ప్ డెస్క్‌లో సర్వర్ ఏర్పాటు చేవారు. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారిని కూడా నియమించారు. కంప్యూటర్లో సీసీ కెమెరాలను పరిశీలించి కాంప్లెక్స్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని గమనించేవారు. దీంతో కొంతవరకూ నేరాలు తగ్గుముఖం పట్టడంతో పట్టణంలోని ప్రధాన కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావించింది. ఈ మేరకు 20 ప్రాం తాల్లో సుమారు 100 వైర్లెస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచారు. ముఖ్యంగా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలైన కోట, మూడు లాంతర్లు, గంట స్తంభం, దాసన్నపేట, రింగ్ రోడ్డు, మయూరి జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, ఆర్అండ్బీ, కలెక్టరేట్,బాలాజీ, సిటీస్టాండ్, రైల్వేస్టేషన్ రోడ్డు, కొత్తపేట, అంబటిసత్రం,ఐష్ఫ్యాక్టరీ జంక్షన్, తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేశారు. అరుుతే ఇది జరిగి ఐదు నెలలు కావస్తున్నా... ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. దీనికితోడు 20 ప్రాంతాల్లోనూ వైర్లెస్ సీసీ కెమెరాల ఏర్పాటుకు అప్పటి విజయనగరం ఎం పీ, మంత్రిని నిధులు కేటాయించాలని పోలీసు అధికారులు కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడం తో సీసీ కెమెరాలు ఏర్పాటుపై నీలినీడలు అలముకున్నాయి. -
బొత్స‘చిరు’ కన్ను!
చీపురుపల్లి, న్యూస్‌లైన్ :పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో భాగంగా వందలాది మంది చిరు వ్యాపారులు దుకాణాలు కో ల్పోయి, వీధిన పడ్డారు. వారిని ఆదుకోవాల్సిన పాల కులు, అధికారులు ఏమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ విషయమై ఇప్పటివరకు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దేవాదాయ శాఖ స్థలంలో రామచంద్రసాహు కర్రల మిల్లు వద్ద నిర్మించిన దుకాణాల వివాదంలో కూడా మంత్రి కలుగజేసుకోకపోవడంతో ఆ విషయం కో ర్టుకు వెళ్లింది. దీంతో అక్కడ దాదాపు 50 దుకాణాలకు చెందిన చిరు వ్యాపారులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఆ తరువాత ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి శ్రీనివాసామహల్ జంక్షన్ వరకు నిర్మించిన దుకాణాల విషయంలో కూడా మంత్రి బొత్స చొరవ చూపించి వ్యాపారులకు అనుకూలంగా ప్రభుత్వపరంగా ఏమైనా హక్కు లు కల్పించి ఉంటే నేడు దుకాణాలు తొలగించే పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఇక్కడ ఉంటున్న 150 మంది చిరువ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా వ్యాపారాలు లేక, అప్పులు చేసి నిర్మించిన దుకాణాలు తొల గించే పరిస్థితి వచ్చినప్పటికీ మంత్రి కనీసం పట్టించుకోవ డం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తలచుకుంటే చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏమైనా చేయగలరని, కాని ఎందుకనో వారి కి జరుగుతున్న నష్టానికి సంబంధించి పట్టించుకోవడం లేదన్న వాదనలు ఉన్నారుు. నియోజకవర్గంలోని ప్రతి అంశంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించే మంత్రి వ్యాపారుల జీవితాలను నిలబెట్టేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని పార్టీలోని స్థానిక నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా ప్రణాళికాబద్ధంగా చిరు వ్యాపారులకు పూర్తి హక్కులతో కూడిన దుకాణాలను అప్పగించాలన్న ఆ లోచన మంత్రి ఎందుకు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా స్థానిక నేతలపై ఉంచి, మనకెందుకు లే అన్న చందం గా మంత్రి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.