సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వచ్చే భక్తులు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుగు ప్రయాణంలో బస్సుల కోసం వేలాది మంది ప్రయాణికులు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. అయితే, భక్తులు బస్సుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్లకు కాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వస్తుండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు చెప్పారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులను నడపడం లేదని, తాత్కాలిక బస్టాండ్లకు చేరుకోవాలని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు.
విశాఖ వైపు నుంచి వచ్చేవారు..
విశాఖపట్నం, జగ్గంపేట, ప్రత్తిపాడు, అన్నవరం, తుని, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాజమండ్రి నగర శివారులోని హౌసింగ్ బోర్టు బస్టాండులో దిగాలి. అక్కడి నుంచి కోటిలింగాల ఘాట్‌కు చేరుకొని స్నానం చేయాలి. తిరిగి ప్రయాణంలో అదే బస్టాండుకు చేరుకొని విశాఖ వైపు వెళ్లాలి.
విజయవాడ నుంచి వచ్చేవారు
రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలతోపాటు, విజయవాడ, తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలవారు రాజమండ్రిలోని లూథర్‌గిరి బస్టాండులో దిగాలి. కోటిలింగాల ఘాట్‌లో పుష్కర స్నానం చేసి తిరిగి అదే బస్టాండు నుంచి స్వస్థలాలకు వెళ్లాలి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు మోరంపూడి సెంటర్‌లోని జెమినీ గ్రౌండ్స్‌లో దిగి అందుబాటులో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు చేసి, అదే బస్టాండుకు వెళ్లాలి.
నిల్చొని ప్రయాణం చేసేవారికి రాయితీ
విశాఖ వైపు బస్సుల్లో నిల్చొని ప్రయాణం చేసేవారికి టిక్కెట్ చార్జీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. శనివారం నుంచే దీన్ని అమలు చేస్తున్నారు.
రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రావొద్దు
Published Sun, Jul 19 2015 12:46 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement