రాజమండ్రి :అసలు తక్కువ.. హడావుడి ఎక్కువ.. అన్నట్టుగా ఉంది ప్రభుత్వ పెద్దల తీరు. గోదావరి పుష్కరాల సందర్భంగా నగర దశ దిశ మారిపోతుందని ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే తమ ప్రభుత్వం రూ.240 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి, కార్పొరేటర్ వరకూ అందరూ ఆర్భాటం చేశారు. తీరా చూస్తే.. పుష్కరాల సందర్భంగా నగరంలో చేపట్టిన పనులు.. ఆ మహాపర్వం ముగిసిన తరువాత కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల టెండర్లు ఖరారైన పనులతోపాటు, టెండర్ దశలోనే నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగడం లేదు. నగరంలోని వివిధ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడంలేదు.
పుష్కరాల సందర్భంగా కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. ఇన్ని కోట్లు వచ్చినందు పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి. కానీ నగరంలో అటువంటి పరిస్థితి కానరావడం లేదు. పుష్కర ఘాట్‌లవద్ద జరిగిన అభివృద్ధి వల్ల నగర ప్రజలకు ప్రత్యక్షంగా ఒనగూడిన ప్రయోజనం లేదన్న విమర్శలు వచ్చాయి. రహదారులు, డ్రైన్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలకు ఎక్కువగా నిధులు కేటాయించారు. ఉన్న రోడ్లపై రోడ్లు వేయడం, ఎత్తు చేస్తున్నామన్న వంకతో బాగున్న ఫుట్‌పాత్‌లు బద్దలుకొట్టి కొత్తగా నిర్మించడం, పాత డ్రైన్ల ఇనుముతో కొత్త డ్రైన్లు నిర్మించి, అడ్డగోలుగా దోచేయడం అందరికీ తెలిసిందే. రూ.240 కోట్లతో చేపట్టినవాటిలో ఇప్పటివరకూ రూ.118 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.62 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఇంకో మరో రూ.60 కోట్ల విలువైన పనులకు ఇంతవరకూ టెండర్లే పిలవలేదు.
వీటికి పరిష్కారమేదీ?
ఏమాత్రం వర్షం పడినా ఆర్యాపురం, కోటిలింగాలపేట, హైటెక్ బస్టాండ్, పేపరుమిల్లు రోడ్డు, కృష్ణానగర్, రామచంద్రరావుపేట, వెంకటేశ్వరనగర్ తదితర ప్రాంతాలు గోదావరిని తలపిస్తున్నాయి. రహదారులు కాలువలైపోతున్నాయి. ఈ సమస్య చాలాకాలంగా ఉన్నా పుష్కరాల్లో శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ రోడ్లపై మూడడుగుల ఎత్తున మురుగునీరు నిలిచిపోతోంది. పుష్కర నిధులతో డ్రైన్లు విస్తరించి, కొత్తవి నిర్మించి ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది.
గూడ్స్‌షెడ్ నుంచి ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకూ రూ.13 కోట్లతో డ్రైనేజీ నిర్మించాలి. ఈ పనులు ఇంకా మొదలవలేదు. నగరంలోని 50 డివిజన్లలో చేపట్టాల్సిన 240 డ్రైనేజీ పనులకు, 116 రహదారుల నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాలేదు. సుందరీకరణ పేరుతో పుష్కరాల్లో చనిపోయిన మొక్కలు నాటి సొమ్ములు నొక్కేసిన అధికారులు.. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన 23 జంక్షన్ల పనులు కూడా ఇంతవరకూ చేపట్టలేదు. ఇప్పటికైనా పుష్కర నిధులతో శాశ్వత పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆర్భాటం ఎక్కువ..అసలు తక్కువ
Published Sat, Sep 5 2015 12:38 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement