రాజమండ్రి : కోట్లాదిమంది వచ్చే గోదావరి పుష్కరాల కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారు. పుష్కరా లు ఫలానా సంవత్సరంలో ఫలానా సమయంలో వస్తాయని ఎన్నడో తెలిసినా.. ‘పుణ్యకాలం దగ్గర పడేదాకా’ పనులు మొదలు పెట్టని నిర్వాకం, అవినీతి ఫలితం.. పుష్కరాలు ముగిసి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాక ముందే వేసవిలో గోదావరిలో ఇసుక తిన్నెలు బయటపడ్డంత స్పష్టంగా కళ్లకు కడుతోంది. ఆర్ అండ్ బీ చేపట్టిన రాజమండ్రి- బూరుగుపూడి రోడ్డు విస్తరణ పనులే అందుకు నప్రబల నిదర్శనం. ఈ రహదారి సెంట్రల్ డివైడర్ అప్పుడే పలుచోట్ల ధ్వంసమైంది.
రాజమండ్రి నుంచి బూరుగుపూడి దాటే వరకు ఈ రహదారి విస్తరణకు ప్రభుత్వం పుష్కరాలకు ముందు రూ.37 కోట్లు కేటాయించింది. రహదారి నిర్మాణం, ఆక్రమణ తొలగింపు, డ్రైన్, సెంట్రల్ డివైడర్ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా శానిటోరియం నుంచి బూరుగుపూడి వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణం నాసిరకంగా జరిగిన విషయాన్ని ‘సాక్షి’ అప్పట్లోనే ‘దండుడుకే ప్రాధాన్యం’ అనే కథనంతో వెలుగులోకి తెచ్చింది. బలంగా తన్నితేనే పడిపోయేంత బలహీనంగా నిర్మిస్తున్న డివైడర్ ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదని ముందే హెచ్చరించినా కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు రెండు నెలలు పూర్తికాకున్నా డివైడర్ పలుచోట్ల ధ్వంసమవుతోంది. వాహనాలు ఢీ కొట్టడం వల్ల ఇలా జరిగిందని అధికారులు సాకు చెబుతున్నా, నిర్మాణంలో చోటు చేసుకున్న లోపమే కారణమని నిపుణులు అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిలిచిపోయిన కొద్దిపాటి నీటికే డివైడర్లు కొట్టుపోతున్నాయంటే నిర్మాణం ఎంత దృఢంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మధురపూడి, గాడాల, నిడిగట్ల మధ్యలో డివైడర్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల ఐదారడుగుల మేర డివైడర్లు పగిలిపోవడం గమనార్హం.
సుందరీకరణా అరకొరే..
మధురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి నగరానికి వచ్చే ఈ రహదారిలో సెంట్రల్ డివైడర్ పైన, రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ.లక్షల విలువ చేసే మొక్కలు నాటారు. వీటిని చాలా వరకు పశువులు మేసేస్తుండగా, రహదారిలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకూ మొక్కలే నాటకపోవడం గమనార్హం. మధురపూడి విమానాశ్రయం నుంచి బూరుగుపూడి దాటే వరకు సెంట్రల్ డివైడర్ ఉన్నా మొక్కలు నాటలేదు. ఇక్కడ పిచ్చి మొక్కలు, ముళ్ల మొక్కలు పెరుగుతున్నాయి. అంటే ఆహ్లాదం రాజమండ్రి-మధురపూడిల మధ్య రాకపోకలు సాగించే విమాన ప్రయాణికులకే తప్ప మిగిలినవారికి అవసరం లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండునెలలకే.. బండారం బట్టబయలు
Published Sun, Sep 13 2015 12:03 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement