రాజమండ్రి :గోదావరి పుష్కరాల పేరుతో అధికారులు కోట్ల రూపాయలు దుబారా చేశారనడానికి ఫైబర్ టాయిలెట్లు, విద్యుద్దీపాలంకరణలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటికి అసలు ఖరీదుకంటే రెట్టింపు మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లించిన ఘనత నగరపాలక సంస్థ అధికారులదే. దీనిపై వస్తున్న విమర్శలకు, ప్రశ్నలకు వారి జవాబు మౌనమే అవుతోంది. గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం చేసిన పనుల్లో అడ్డగోలు దోపిడీ జరిగింది. ప్రధానంగా ఫైబర్ టాయిలెట్ల ఏర్పాటులో సంబంధిత కాంట్రాక్టర్, కార్పొరేషన్ అధికారులు చేతులు కలిపి కాసులు దండుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని కోటిలింగాలు, పుష్కర, వీఐపీ వంటి ఘాట్‌ల వద్ద, రైల్వేస్టేషన్, బస్టాండ్, పుష్కర నగరాలు, పార్కింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫైబర్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈవిధంగా నగరంలో మొత్తం 1,200 టాయిలెట్లు ఏర్పాటు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
వాస్తవానికి ఇన్ని ఏర్పాటు చేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక వీటికి చెల్లించిన అద్దె చూస్తే నివ్వెరపోక తప్పదు. ఒక్కోదానికి రూ.26 వేల వరకూ అద్దె చెల్లించినట్టు సమాచారం. అయితే వాస్తవానికి దీని తయారీకి అయిన ఖర్చు రూ.10 వేలు కావడం గమనార్హం. మొత్తం 1,200 టాయిలెట్లకు అద్దెరూపంలో రూ.3.12 కోట్లు చెల్లించగా, వీటి తయారీకయ్యే ఖర్చు రూ.1.20 కోట్లు మాత్రమే. కార్పొరేషన్ వీటిని నేరుగా కొనుగోలు చేసి ఉంటే రూ.1.92 కోట్లు మిగిలేది. వీటిని వచ్చే కృష్ణా పుష్కరాలకు పంపించడం ద్వారా అటు ప్రభుత్వం నుంచి కానీ, లేదా విజయవాడ నగరపాలక సంస్థ నుంచి కానీ రాజమండ్రి కార్పొరేషన్ ఆదాయం పొంది ఉండేది. లేకుంటే కనీసం తుక్కు రూపంలో అమ్మినా ఎంతోకొంత ఆదాయం వచ్చేది. అవేమీ లేకుండా మొత్తం టాయిలెట్లను ఒకే కాంట్రాక్టర్ నుంచి అద్దె పద్ధతిలో తీసుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ములు వృథా అయ్యాయి.
ఇక పుష్కరాల సమయంలో నగరాన్ని విద్యుద్దీప తోరణాలతో ముస్తాబు చేసిన విషయంలో కూడా అధికారులు ఇదే పద్ధతి అవలంబించి, కార్పొరేషన్‌పై ఆర్థిక భారం మోపారు. నగర వీధుల్లోను, రాజమండ్రి - కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన, పాత హేవలాక్, మూడో రైలు వంతెనలకు సగం వరకూ ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు, పార్కులు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలకు ఏకంగా రూ.2 కోట్ల వరకూ అద్దె రూపంలో చెల్లించారు. ఇక్కడ కూడా ఒక కాంట్రాక్టర్‌నే ఆశ్రయించారు. అద్దెకు బదులు కొనుగోలు చేసి ఉంటే ఇంతకన్నా ఎక్కువ విద్యుద్దీపాలంకరణ చేసుకోవడంతో పాటు, తరువాత వేలం వేయడం ద్వారా మూడొంతుల ఖర్చు వెనక్కు వచ్చేదని అధికార పార్టీ కార్పోరేటర్లే బాహాటంగా అంటున్నారు.
అసలు ఎన్ని లైట్లు ఏర్పాటు చేశారు? ఎంత చొప్పున, ఎంత మొత్తం చెల్లించారనే ప్రశ్నలకు నగరపాలక సంస్థ అధికారుల వద్ద సమాచారం లేదు. ఈ విషయంపై ఇటీవల జరిగిన కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు ప్రశ్నించినా అధికారుల నుంచి సమాధానం లేదు. శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మొత్తం వివరాలు వెల్లడిస్తామని చెప్పి తప్పించుకున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 15 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేసేది కూడా లేదని సమాచారం.
అద్దె పేరుతో.. అడ్డగోలు దోపిడీ
Published Sun, Sep 6 2015 1:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement