చిన్నారి మృతదేహంతో ఆందోళన
కాకినాడ క్రైం : చిన్నారి మృతదేహంతో బంధువులు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ డిపో గేటు వద్ద ఆందోళనకారులు బైఠాయించడంతో నాలుగు గంటలపాటు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన రేకాడి శ్రీ దుర్గ (7), ఆమె తండ్రి రేకాడి నూకరాజు, బంధువు కామాడి వెంకటేష్ మోటారు సైకిల్‌పై వెళ్తుండగా శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో జెడ్పీ సెంటర్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి త్రీ టౌన్ పోలీసులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం ఆమె మృతదేహంతో బంధువులు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుని గేట్లు దిగ్బంధించారు. అక్కడికి ఏటిమొగకు చెందిన పలువురు వచ్చి చేరడంతో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. బస్సులను నిలుపుదల చేయడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ డిపోనకు వచ్చే బస్సులు కూడా రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు, నగర ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఆందోళనకారులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా శ్రీదుర్గ మృతి చెందిందని, ఆమె తండ్రి, బంధువు తీవ్రగాయాలపాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. ఒక చిన్నారి ప్రాణం పోయినా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐలు డీఎస్ చైతన్యకృష్ణ, అద్దంకి శ్రీనివాసరావు, ఎస్.గోవిందరావు, ఆండ్ర రాంబాబు తదితరులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. అయితే తాము నష్టపరిహారంగా రూ.25 వేలు మాత్రమే ఇస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడాన్ని ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు సర్ది చెప్పడంతో సాయంత్రం ఐదు గంటలకు వారు ఆందోళన విరమించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్‌కు చేరుకున్న ప్రయాణికులు, బస్సుల్లో ఉన్నవారు నాలుగు గంటలపాటు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఆందోళనకారులు భారీ స్థాయిలో వచ్చి చేరడంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఆటోలను ఆశ్రయించారు. ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడిందని అధికారులు పేర్కొంటున్నారు.