Child Dead Body
-
ఎంత పని చేశావు తల్లీ..!
సాక్షి, రాయచోటి: కడుపులో పెరుగుతున్నప్పటి నుంచే తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. భూమి పైకి వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుతుంది. కట్టుకున్న భర్త పట్టించుకోకపోయినా.. నా అన్న వారు పలకరించకపోయినా.. చివరికి తాను ఏకాకైనా సరే సర్వం ధారపోసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డను తన చేతులతోనే కర్కోటకంగా గొంతు నులిమి చంపిన సంఘటన రాయచోటిలో చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె గ్రామం పొలాల వద్ద ఉన్న నక్కలగుట్టలో జరిగింది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, అనవసర భయంతో ఆమె ఈ దుర్ఘటనకు పాల్పడింది. అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరులోని చెన్నారెడ్డి వీధికి చెందిన షేక్ మహమ్మద్ బాషా సంబేపల్లె మండలం చౌటపల్లె గ్రామం షేక్ ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి రుక్సానా (10 నెలల) కుమార్తె ఉంది. ఫాతిమా మానసిక స్థితి సరిగా లేదు. ఆమె భర్త ఇంటి నుంచి అప్పుడప్పుడూ చెప్పకుండా పుట్టింటికి వచ్చేది. తన ఆరోగ్యం సరిగా లేదని, త్వరగా చనిపోతానని భావించింది. తాను చనిపోతే తన బిడ్డను ఎవరు చూసుకుంటారు అనే అనుమాన పడింది. ఎవరూ చూసుకోరనే నిర్ణయానికి వచ్చింది. అనుకున్నదే తడువుగా శనివారం తన పసిబిడ్డను తీసుకొని రాయచోటికి వచ్చింది. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లేందుకు మనసు నచ్చక రాయచోటిలోనే ఆగిపోయింది. రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె సమీపాన ముళ్ల పొదల వద్ద ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి కుమార్తె గొంతు నులిమి చంపేసింది. కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని రాయచోటికి వచ్చి, అక్కడి నుంచి తిరిగి పీలేరుకు వెళ్లింది. అప్పటికే రాత్రి కావడంతో పీలేరు నుంచి భర్త బంధువులకు ఫోన్ చేసి తన బిడ్డను చంపేశానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉంది. బంధువులు పాప శవాన్ని తీసుకొని రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అట్టపెట్టెలో పసికందు మృతదేహం
సాక్షి, విజయనగరం టౌన్: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో... ఏ కామాంధుడి కర్కశత్వానికి బలైపోయిందో... లేక పుట్టిన బిడ్డ భారంగా భావించారో... లేక దురదృష్టవశాత్తూ ఆ పుట్టిన బిడ్డ వెంటనే కన్నుమూసిందో తెలీదు గానీ ఓ అట్టపెట్టెలో పెట్టేసి నిర్దాక్షిణ్యంగా రోడ్డుపక్కన పడేశారు. సాధారణంగా చికిత్స పొందుతూ గానీ, డెలివ రీ సమయంలో గానీ బిడ్డ చనిపోతే ఆ మృత శిశువును ఎక్కడో ఓ చోట పూడ్చి పెడతారు. కానీ మానవత్వం లేకుండా అట్టపెట్టెలో ప్యాక్ చేసి మరీ విసిరేశారు అలా రోడ్డుపక్కన పడేసి మూడురోజులైపోయి ఉండొచ్చేమో... ఆదివా రం సాయంత్రం దుర్గంధం వెదజల్లడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికులు గుర్తించి, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమందించారు. ఓ పక్క వర్షం. మరోపక్క ఒంటిపై డైపర్ మినహా మరే ఆచ్ఛాదనా లేని ఆ మృతశిశువును చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. చంపేసి పడేశారా...? నగరంలోని ఎల్ఐసీ కార్యాలయం నుంచి బాలాజీ జంక్షన్‌కు వెళ్లే రహదారిలో మాన్సాస్ పంటపొలాల వైపు ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మలవిసర్జనకు వెళ్లాడు. అక్కడ అట్టపెట్టెలోంచి వాసన రావడం గమనించి, పరిశీలించగా అందులో మగశిశువు మృతదేహం కనిపించింది. దీంతో హతాశుడైన ఆయన మిగిలినవారికి సమాచారం. అమానుషం... అందించడంతో వారంతా కలసి 100కి సమాచారం అందించారు. మృతశిశువుకు డైపర్ కట్టి ఉంది. చేతికి ఇంజెక్షన్ చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అలాగే ప్యాక్ చేసి విసిరేశారు. శిశువు పుట్టి మూడురోజులు అయ్యే అవకాశం ఉందని ప్రాధమికంగా తెలుస్తోంది. నెలలు నిండిన మగ పసికందును చంపేసి పడేశారా... లేక చనిపోయిన తర్వాత పడేశారా అన్నది అర్థం కావట్లేదు. దూరప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణం ఇలా పుట్టిన పసికందును పడేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పట్టణ డీఎస్పీ పొన్నపాటి వీరాంజనేయరెడ్డి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు. -
చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి
మరో వివాహానికి అడ్డుగా ఉందని ఘాతుకం తానూరు(ఆదిలాబాద్) : తన రెండో వివాహానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని చెరువులో పడేశాడో తండ్రి. ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం కర్భాల గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సోంటకే గౌతం కొన్నేళ్లుగా హైదరాబాద్, భైంసాలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భైంసాలో నంద అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గౌతం, నంద కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు జేసికా(5) ఉంది. ఇద్దరు కలిసి రెండేళ్లుగా భైంసాలో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం స్వగ్రామమైన కర్భాలకు వచ్చి ఉంటున్నారు. వారం రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో నంద వెళ్లిపోయింది. అయితే, మరో వివాహం చేసుకోవడానికి కూతురు జేసికా అడ్డుగా ఉందని గౌతం భావించాడు. శనివారం అర్ధరాత్రి కూతురిని తీసుకెళ్లి గ్రామ సమీపంలోని చెరువులో ఉన్న నీటి గుంతలో పడేశాడు. ఆదివారం ఉదయం తానూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్న సమయంలో చెరువులో బాలిక మృతదేహం పైకి తేలింది. పశువుల కాపరి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ గణపతిజాదవ్ గౌతంను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. మరో వివాహం చేసుకోవడానికి అడ్డుగా ఉందని హతమార్చినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఆ ‘కన్న’తల్లి ఎవరో.. ఎవరు చేసిన ‘పాప’మో!
టెక్కలి రూరల్ : ఆదివారం ఉదయం...సుమారు 9 గంటల సమయం... పట్టణమంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎదో అలికిడి. ఏమిటాని ఆరా తీస్తే.. అక్కడికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న బావిలో ఓ పసికందు మృతదేహం కనిపించడం చర్చనీయాంశమై.. కలకలం రేగింది. స్థానికులు కొంతమంది ఆ ప్రాంతం వైపు బహిర్భూమికి వెళ్లి బావిలో చూడగా పసికందు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. నెలలు నిండినట్టుగానే ఉన్న ఈ పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ‘కన్న’తల్లి ఎవరోగాని.. ఏ కష్టమొచ్చిందో.. ఎలాంటి పరిస్థితుల్లో ఇలా పొత్తిళ్లలోని పసిగుడ్డును పాడుబడిన బావిలో పడేసిందంటూ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసుకున్న ఎస్ఐ పి.న ర్సింహమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన పసికందు ఆడ లేక మగ అనే వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారి మృతదేహంతో ఆందోళన
కాకినాడ క్రైం : చిన్నారి మృతదేహంతో బంధువులు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ డిపో గేటు వద్ద ఆందోళనకారులు బైఠాయించడంతో నాలుగు గంటలపాటు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన రేకాడి శ్రీ దుర్గ (7), ఆమె తండ్రి రేకాడి నూకరాజు, బంధువు కామాడి వెంకటేష్ మోటారు సైకిల్‌పై వెళ్తుండగా శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో జెడ్పీ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి త్రీ టౌన్ పోలీసులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆమె మృతదేహంతో బంధువులు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుని గేట్లు దిగ్బంధించారు. అక్కడికి ఏటిమొగకు చెందిన పలువురు వచ్చి చేరడంతో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. బస్సులను నిలుపుదల చేయడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ డిపోనకు వచ్చే బస్సులు కూడా రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు, నగర ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఆందోళనకారులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా శ్రీదుర్గ మృతి చెందిందని, ఆమె తండ్రి, బంధువు తీవ్రగాయాలపాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. ఒక చిన్నారి ప్రాణం పోయినా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐలు డీఎస్ చైతన్యకృష్ణ, అద్దంకి శ్రీనివాసరావు, ఎస్.గోవిందరావు, ఆండ్ర రాంబాబు తదితరులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. అయితే తాము నష్టపరిహారంగా రూ.25 వేలు మాత్రమే ఇస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడాన్ని ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు సర్ది చెప్పడంతో సాయంత్రం ఐదు గంటలకు వారు ఆందోళన విరమించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్‌కు చేరుకున్న ప్రయాణికులు, బస్సుల్లో ఉన్నవారు నాలుగు గంటలపాటు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఆందోళనకారులు భారీ స్థాయిలో వచ్చి చేరడంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఆటోలను ఆశ్రయించారు. ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడిందని అధికారులు పేర్కొంటున్నారు. -
కొట్టేసిన బ్యాగులో ఓ బుడ్డోడు దొరికాడు
బుల్లిబ్యాగులో ఓ బుడ్డోడు దొరికాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. చూసిన జనానికే కాదు. ఆ బ్యాగును దొంగతనం చేసిన దొంగకు కూడా. ప్రయాణికులతో పాటు అధికారులను కూడా ఓ గంటపాటు ఆందోళనకు గురిచేసిన ఈ సంఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్లో జరిగింది. ప్లాట్‌ఫామ్‌పై ఆగిఉన్న రైలు కంపార్టుమెంటునుంచి దొంగ ఓ బ్యాగును దొంగిలించాడు. అందులో కొంత డబ్బు, విలువైన వస్తువులు ఉంటాయని ఊహించుకుంటూ.. దూరంగా వెళ్ళి జిప్పు తెరిచిచూసి షాక్ తిన్నాడు. ఎత్తుకోమంటున్నట్లు చేతులాడిస్తున్న చిన్నోడు కనిపించాడు. బ్యాగును తిరిగి తీసుకెళ్ళి.. రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్‌పై తినుబండారాలు అమ్ముకునే ఓ వ్యక్తి దగ్గర వదిలేశాడు. టికెట్లు చెకింగ్ చేస్తున్న రైల్వే అధికారులకు ఆ దృశ్యాన్ని చూసి అనుమానంతో బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులోఉన్న మగశిశువును చూసి షాక్ తిన్నారు. వెంటనే దగ్గర్లోని బాబా ఆస్పత్రిలో చేర్పించారు. మగ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎంత పేదవారైనా ఎటువంటి అంగవైకల్యం లేకుండా.. పూర్తి ఆరోగ్యంతో ఉన్న శిశువును ఎందుకు వదిలించుకోవాలనుకున్నారో అర్థం కాలేదని వైద్యులు చెబుతున్నారు. శిశువును ముంబై మాతాశిశు సంరక్షణ కేంద్రం ఆశా సదన్‌లో చేర్చారు. -
పోతురాజుకాలువలో శవమై తేలిన నాలుగేళ్ల చిన్నారి
ఆరు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల బాలిక.. ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతురాజుకాలువలో శవమై తేలింది. దీంతో బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే... కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన కట్టా శరత్‌బాబు కుమార్తె కట్టా నీరజ (4) ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. రాత్రంతా గాలించిన కుటుంబ సభ్యులు ఫలితం లేకపోవడంతో 10వ తేదీ ఉదయం కొత్తపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బాలిక అదృశ్యం కేసు నమోదు చేసిన ఎస్సై శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. కనిపించడం లేదంటూ బాలిక ఫొటోతో కరపత్రాలు కూడా ముద్రించి చుట్టుపక్కల గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో చింతల సమీపంలోని పోతురాజుకాలువలో చిన్నారి మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కాలువలో చెట్లకు చిక్కుకుని ఆగి ఉన్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఆ మృతదేహం నీరజదేనని గుర్తించిన తల్లిదండ్రులు సంఘటన స్థలంలో భోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కొత్తపట్నం ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభించడంతో నాలుగేళ్ల బాలిక అంతదూరం నడుచుకుంటూ వెళ్లి కాలువలో పడి ఉంటుందా..లేక, ఎవరైనా హత్యచేసి మృతదేహాన్ని కాలువలో పడేశారా... అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక, పోలీసు దర్యాప్తులో నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.