సాక్షి, రాయచోటి: కడుపులో పెరుగుతున్నప్పటి నుంచే తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. భూమి పైకి వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుతుంది. కట్టుకున్న భర్త పట్టించుకోకపోయినా.. నా అన్న వారు పలకరించకపోయినా.. చివరికి తాను ఏకాకైనా సరే సర్వం ధారపోసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డను తన చేతులతోనే కర్కోటకంగా గొంతు నులిమి చంపిన సంఘటన రాయచోటిలో చోటుచేసుకుంది.
ఈ ఘటన శనివారం రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె గ్రామం పొలాల వద్ద ఉన్న నక్కలగుట్టలో జరిగింది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, అనవసర భయంతో ఆమె ఈ దుర్ఘటనకు పాల్పడింది. అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరులోని చెన్నారెడ్డి వీధికి చెందిన షేక్ మహమ్మద్ బాషా సంబేపల్లె మండలం చౌటపల్లె గ్రామం షేక్ ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి రుక్సానా (10 నెలల) కుమార్తె ఉంది. ఫాతిమా మానసిక స్థితి సరిగా లేదు. ఆమె భర్త ఇంటి నుంచి అప్పుడప్పుడూ చెప్పకుండా పుట్టింటికి వచ్చేది. తన ఆరోగ్యం సరిగా లేదని, త్వరగా చనిపోతానని భావించింది.
తాను చనిపోతే తన బిడ్డను ఎవరు చూసుకుంటారు అనే అనుమాన పడింది. ఎవరూ చూసుకోరనే నిర్ణయానికి వచ్చింది. అనుకున్నదే తడువుగా శనివారం తన పసిబిడ్డను తీసుకొని రాయచోటికి వచ్చింది. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లేందుకు మనసు నచ్చక రాయచోటిలోనే ఆగిపోయింది. రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె సమీపాన ముళ్ల పొదల వద్ద ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి కుమార్తె గొంతు నులిమి చంపేసింది.
కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని రాయచోటికి వచ్చి, అక్కడి నుంచి తిరిగి పీలేరుకు వెళ్లింది. అప్పటికే రాత్రి కావడంతో పీలేరు నుంచి భర్త బంధువులకు ఫోన్ చేసి తన బిడ్డను చంపేశానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉంది. బంధువులు పాప శవాన్ని తీసుకొని రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment