పోతురాజుకాలువలో శవమై తేలిన నాలుగేళ్ల చిన్నారి | Child Invisible, dead body found in canal | Sakshi
Sakshi News home page

పోతురాజుకాలువలో శవమై తేలిన నాలుగేళ్ల చిన్నారి

Published Sat, Aug 17 2013 5:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

Child Invisible, dead body found in canal

ఆరు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల బాలిక.. ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతురాజుకాలువలో శవమై తేలింది. దీంతో బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే... కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన కట్టా శరత్‌బాబు కుమార్తె కట్టా నీరజ (4) ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. రాత్రంతా గాలించిన కుటుంబ సభ్యులు ఫలితం లేకపోవడంతో 10వ తేదీ ఉదయం కొత్తపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బాలిక అదృశ్యం కేసు నమోదు చేసిన ఎస్సై శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. కనిపించడం లేదంటూ బాలిక ఫొటోతో కరపత్రాలు కూడా ముద్రించి చుట్టుపక్కల గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో చింతల సమీపంలోని పోతురాజుకాలువలో చిన్నారి మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు.. కాలువలో చెట్లకు చిక్కుకుని ఆగి ఉన్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఆ మృతదేహం నీరజదేనని గుర్తించిన తల్లిదండ్రులు సంఘటన స్థలంలో భోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కొత్తపట్నం ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభించడంతో నాలుగేళ్ల బాలిక అంతదూరం నడుచుకుంటూ వెళ్లి కాలువలో పడి ఉంటుందా..లేక, ఎవరైనా హత్యచేసి మృతదేహాన్ని కాలువలో పడేశారా... అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక, పోలీసు దర్యాప్తులో నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement