సాక్షి, విజయనగరం టౌన్: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో... ఏ కామాంధుడి కర్కశత్వానికి బలైపోయిందో... లేక పుట్టిన బిడ్డ భారంగా భావించారో... లేక దురదృష్టవశాత్తూ ఆ పుట్టిన బిడ్డ వెంటనే కన్నుమూసిందో తెలీదు గానీ ఓ అట్టపెట్టెలో పెట్టేసి నిర్దాక్షిణ్యంగా రోడ్డుపక్కన పడేశారు. సాధారణంగా చికిత్స పొందుతూ గానీ, డెలివ రీ సమయంలో గానీ బిడ్డ చనిపోతే ఆ మృత శిశువును ఎక్కడో ఓ చోట పూడ్చి పెడతారు. కానీ మానవత్వం లేకుండా అట్టపెట్టెలో ప్యాక్ చేసి మరీ విసిరేశారు అలా రోడ్డుపక్కన పడేసి మూడురోజులైపోయి ఉండొచ్చేమో... ఆదివా రం సాయంత్రం దుర్గంధం వెదజల్లడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికులు గుర్తించి, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమందించారు. ఓ పక్క వర్షం. మరోపక్క ఒంటిపై డైపర్ మినహా మరే ఆచ్ఛాదనా లేని ఆ మృతశిశువును చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
చంపేసి పడేశారా...?
నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి బాలాజీ జంక్షన్‌కు వెళ్లే రహదారిలో మాన్సాస్ పంటపొలాల వైపు ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మలవిసర్జనకు వెళ్లాడు. అక్కడ అట్టపెట్టెలోంచి వాసన రావడం గమనించి, పరిశీలించగా అందులో మగశిశువు మృతదేహం కనిపించింది. దీంతో హతాశుడైన ఆయన మిగిలినవారికి సమాచారం.
అమానుషం...
అందించడంతో వారంతా కలసి 100కి సమాచారం అందించారు. మృతశిశువుకు డైపర్ కట్టి ఉంది. చేతికి ఇంజెక్షన్ చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అలాగే ప్యాక్ చేసి విసిరేశారు. శిశువు పుట్టి మూడురోజులు అయ్యే అవకాశం ఉందని ప్రాధమికంగా తెలుస్తోంది. నెలలు నిండిన మగ పసికందును చంపేసి పడేశారా... లేక చనిపోయిన తర్వాత పడేశారా అన్నది అర్థం కావట్లేదు. దూరప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణం ఇలా పుట్టిన పసికందును పడేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పట్టణ డీఎస్పీ పొన్నపాటి వీరాంజనేయరెడ్డి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment