వినోద ప్రాంగణం!
ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ఇక మినీ థియేటర్లు
మొదట హయత్‌నగర్, ఈసీఐఎల్, పటాన్‌చెరులో...
ఆదాయం పెంపు వ్యూహంలో భాగంగానే..
సిటీబ్యూరో: ప్రయాణికులకు వినోదభరితమైన కబురు. సరదాగా సినిమాకి వెళ్లాలనుకుంటున్నారా...ఇక మీరు సినిమాల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలే ఇక మినీ థియేటర్‌లుగా అవతరించనున్నాయి.ప్రయాణ సదుపాయంతో పాటు వినోదభరితమైన చిత్రాలను కూడా అందజేయనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు గ్రేటర్‌లోని అన్ని ప్రధాన ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్‌లు రాబోతున్నాయి. హయత్‌నగర్, ఈసీఐఎల్, కాచిగూడ, కోఠీ, కూకట్‌పల్లి, పటాన్‌చెరులోని కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్‌లలో మినీథియేటర్‌లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మొదట పటాన్‌చెరులోని ప్రయాణ ప్రాంగణంలో త్వరలో మినీ థియేటర్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో థియేటర్‌లో 125 నుంచి 150 మంది వరకు కూర్చొనే విధంగా ఈ థియేటర్‌లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన తరహాలోనే మినీథియేటర్స్‌ను కూడా అద్దెకు ఇస్తారు.
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు కేవలం టిక్కెట్‌పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా ఇతర మార్గాలను సైతం అన్వేషించాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. అదనపు ఆదాయం వచ్చే మార్గాన్వేషణలో భాగంగా మినీ థియేటర్‌లకు శ్రీకారం చుట్టారు. మొదట నగరంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్‌లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లలో కూడా థియేటర్‌లు ఏర్పాటు చేస్తారు.
అన్ని సదుపాయాలు ఒకేచోట....
రవాణా సదుపాయాన్ని అందజేయడంతో పాటు నగరవాసులకు కావలసిన సదుపాయాలన్నింటినీ ఒకే చోట అందజేయాలన్న లక్ష్యంతో ఆర్టీసీ దశలవారీగా ప్రయాణ ప్రాంగణాలను నిర్మించింది. నిత్యావసర వస్తువులు, ఈ సేవ, బ్యాంకింగ్, బస్‌పాస్‌ల జారీ వంటి అన్ని రకాల సదుపాయాలు, సేవలు లభించేందుకు అనుగుణంగా జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా దశలవారీగా ఏర్పాటు చేశారు. కాచిగూడ, కోఠీ వంటి కొన్ని ప్రాంగణాలకు వ్యాపారవర్గాల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ మరికొన్ని ఎలాంటి ఆదరణకు నోచకుండా అలంకారప్రాయంగా ఉండిపోయాయి. హయత్‌నగర్ ప్రధాన హైవేపైన ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడి కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్‌కు వ్యాపారవర్గాల నుంచి స్పందన కరువైంది. అలాగే కూకట్‌పల్లి, ఈసీఐఎల్ కేంద్రాల్లోనూ ఆర్టీసీ కాంప్లెక్స్‌లు అలంకారప్రాయంగానే ఉన్నాయి. ఇలాంటి చోట్ల మినీ థియేటర్‌లను ఏర్పాటు చేయడ ం వల్ల అదనపు ఆదాయం లభించగలదని ఆర్టీసీ అంచనా వేస్తోంది.
నష్ట నివారణకు ఇదో మార్గం...
నగరంలోని 28 డిపోల ద్వారా ప్రతి రోజు సుమారు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 33 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. బస్సుల నిర్వహణ, విడిభాగాలు, ఇంధనం కొనుగోళ్లు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చుల వల్ల ఏటేటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుండగా, బస్సుల నిర్వహణ కోసం రూ.3.5 కోట్ల మేర ఖర్చు చేయవలసి వస్తోంది. దీంతో రోజుకు రూ.కోటి మేర నష్టం వాటిల్లుతోంది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్‌ఎంసీ గత సంవత్సరం రూ.100 కోట్ల మేర అందజే సింది. తాజాగా రూ.198 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ప్రస్తుతం టిక్కెట్టేతర ఆదాయంపైన ప్రధానంగా దృష్టి సారించారు.