
భర్త నుంచి కారు, నగదు ఇప్పించాలని డిమాండ్
అంగీకరించకపోవడంతో పోలీసులపై ఆరోపణలు
లింగోజిగూడ: తన భర్త వద్ద ఉన్న కారు బంగారు, నగదును ఇప్పించాలని పోలీసులను కోరిన మహిళ అందుకు వారు నిరాకరించడంతో పోలీసులపైనే బెదిరింపుకు పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే హయత్‌నగర్, మునగనూర్‌లో నివాసం ఉంటున్న కాటమోని పావని తన మొదటి భర్త గోపీతో విడాకులు తీసుకుని ఐదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన గోరుకంటి శ్రీకాంత్‌ను రెండో వివాహం చేసుకుంది.
శ్రీకాంత్ స్థానికంగా పురోహితం చేస్తుండగా, పావని జూనియర్ లాయర్‌గా పని చేసేది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెలలో శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పావనీ మీర్‌పేట పోలీస్టేషన్‌లో తన భర్త తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని అతడి తల్లి పద్మ పేరున ఉన్న కారుతో పాటు బంగారం, నగదు తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. సివిల్ కేసు కావడంతో తమ పరిధిలోకి రాదని పోలీసులు తేల్చి చెప్పారు.దీంతో ఆమె గత నెల 16న తన భర్త కనిపించడం లేదంటూ హయత్‌నగర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ కర్నూలులో ఉన్నట్లు గుర్తించి అతడిని పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు.
అతను పావనీతో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో వదిలేశారు. దీంతో ఆమె అతడి వద్ద ఉన్న కారు, బంగారం, నగదు ఇప్పించాలని కోరడంతో వారు కారు, కొంత నగదును ఇప్పించారు. అయినా సంతృప్తి చెందని పావని బంగారం మరింత నగదు కోసం డిమాండ్ చేయడంతో అది తమ పని కాదని సివిల్ తగదాలు కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 23న హయత్‌నగర్ పోలీస్టేషన్‌లో తన భర్త శ్రీకాంత్, అతని సోదరుడు దుర్గప్రసాద్‌తో కలిసి వేధింపులకు గురి చేస్తున్నారని, దుర్గప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.
ఎస్‌ఐపై ఆరోపణలు
పావనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్ సైదులు కేసు వివరాలు తెలుసుకునేందుకు తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేయడంతో పాటు సీపీకి ఫిర్యాదు చేసినట్లు సామాజిక మధ్యమాల్లో వార్త సంచలనమైంది.
మా పరిధి కాదన్నందుకే..
సివిల్ తగదాలు తాము పరిష్కరించమని, కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతోనే పావనీ ఎస్‌ఐ సైదులుతో పాటు తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని హయత్‌నగర్ సీఐ నాగరాజ్‌గౌడ్ అన్నారు. పావని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.