అడ్వాన్స్‌డ్‌లోనూ 'మెయిన్‌' అంశాలే | New topics JEE Advanced reduced burden of students preparation | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌డ్‌లోనూ 'మెయిన్‌' అంశాలే

Published Fri, Jul 22 2022 3:34 AM | Last Updated on Fri, Jul 22 2022 8:11 AM

New topics JEE Advanced reduced burden of students preparation - Sakshi

సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2022లో జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు చేసిన మార్పులతో విద్యార్థులపై ప్రిపరేషన్‌ భారం తగ్గుతోంది. విద్యార్థులు ఆయా అర్హత పరీక్షల్లో నేర్చుకున్న సిలబస్‌తో అనుసంధానమయ్యేలా మెయిన్, అడ్వాన్స్‌డ్‌లోని అంశాలను మార్పు చేశారు. దీనివల్ల విద్యార్థులు గతంలో మాదిరిగా ఒత్తిడికి లోనుకారని నిపుణులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్‌ తొలివిడత పూర్తయింది. ఈ నెల 25 నుంచి రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి. జేఈఈ మెయిన్‌ను దేశవ్యాప్తంగా 6.29 లక్షల మంది రాస్తున్నారు. వీరిలో అర్హత సాధించిన టాప్‌ 2.5 లక్షల మందికి ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించనున్నారు.  

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో కుస్తీ.. 
ఇంటర్‌ ఎంపీసీ పూర్తిచేసినవారిలో అత్యధికులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా ఉద్యుక్తులవుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. మెయిన్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులు ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై దృష్టి సారించారు. మెయిన్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌లో ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను అనుసరించి ప్రశ్నలను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ బోర్డుల సబ్జెక్టులతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. 

ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్‌లోనే డెప్త్‌.. 
ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి అడ్వాన్స్‌డ్‌లో ఎలాంటి మార్పు లేకున్నా.. మెయిన్‌లోని అంశాలే కొంత లోతుగా ఉంటున్నాయని అంటున్నారు. అందువల్ల విద్యార్థులు ఎక్కువగా వీటిపై దృష్టి సారించాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జేఈఈ మెయిన్‌ కెమిస్ట్రీలో అదనపు అంశాలు చేర్చారని.. ఈసారి వాటిని అడ్వాన్స్‌డ్‌కు కూడా కొనసాగిస్తున్నందున ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఆ అంశాలను మెయిన్‌లో బాగా ప్రిపేర్‌ అయ్యేవారికి మేలు చేకూరుతుందంటున్నారు. కెమిస్ట్రీపైన గతంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ ప్రకారం.. 20%కి పైగా ప్రశ్నలు ఉండేవని.. విద్యార్థులు వీటిపై ఎక్కువగా దృష్టి సారించేవారని అంటున్నారు. ఇప్పుడు మెయిన్‌కు చదివే వాటిని మళ్లీ పునశ్చరణ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని అంశాలు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ఉండటంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాటికోసం డిగ్రీ, పీజీ స్థాయిల్లోని అంశాలను కూడా తీసుకొని బోధన చేయాల్సి వస్తోందంటున్నారు.   

అడ్వాన్స్‌డ్‌లో కొత్త అంశాలు 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఈసారి కొత్తగా గణితంలో స్టాటిస్టిక్స్, సెట్స్‌ అండ్‌ రిలేషన్స్, మ్యాథమెటికల్‌ రీజనింగ్‌ వంటి అంశాలను చేర్చారు. ఇవి అడ్వాన్స్‌డ్‌లో గతంలో లేవు. మెయిన్‌లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటిని అడ్వాన్స్‌డ్‌లోనూ చేర్చడంతో విద్యార్థులకు వెసులుబాటు కలుగుతోందని ప్రముఖ కోచింగ్‌ సంస్థ అకడమిక్‌ డీన్‌ మురళీరావు అన్నారు. విద్యార్థులు మెయిన్‌లో వీటిని బాగా చదివి ఉంటారు కాబట్టి ఆ మేరకు ఇతర అంశాలపై దృష్టి సారించవచ్చన్నారు. అదనపు సమయాన్ని 10% వరకు ఇతర అంశాలకు కేటాయించవచ్చన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement