సాక్షి, అమరావతి: గతంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వచ్చిన సీటును వదిలేసుకున్నవారికి జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ సంస్థ ఐఐటీ బాంబే షాకిచ్చింది. అలాంటివారు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీని ప్రకారం.. గతంలో కౌన్సెలింగ్ ద్వారా కేటాయించిన సీటుకు అంగీకారం తెలిపి.. తర్వాత చేరని విద్యార్థులకు అడ్వాన్స్‌డ్–2022 పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే ఐఐటీల్లో చేరి మధ్యలో మానేసినవారికి కూడా చాన్స్ లేదని పేర్కొంది.
అదేవిధంగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2021 కౌన్సెలింగ్‌లో కేటాయించిన ఐఐటీ సీటును ఆమోదించి.. ఆ తర్వాత చివరి రౌండ్ కౌన్సెలింగ్‌కు ముందువరకు దాన్ని ఉపసంహరించకుండా కొనసాగి ఉంటే వారికి కూడా అడ్వాన్స్‌డ్ రాయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగే అడ్వాన్స్‌డ్‌లో అర్హత మార్కులు సాధించినవారే ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కి అర్హులని పేర్కొంది. జేఈఈ మెయిన్ పేపర్ 2ఏ, 2బీల్లో అర్హత ఉన్నా అడ్వాన్స్‌డ్ రాయకుండా నేరుగా ఏఏటీ పరీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఐఐటీ బాంబే ఈ విషయాలు వెల్లడించింది.
జేఈఈ మెయిన్‌కు నమోదు చేసిన కేటగిరీలే కొనసాగింపు
విద్యార్థులు తమ రిజర్వేషన్, తదితర కేటగిరీలకు సంబంధించి జేఈఈ మెయిన్‌లో నమోదు చేసిన అంశాలే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కూ యథాతథంగా కొనసాగుతాయని ఐఐటీ బాంబే తెలిపింది. మెయిన్‌లో తప్పుగా కేటగిరీలను నమోదు చేస్తే వాటిని అడ్వాన్స్‌డ్‌లో సరిచేసుకునేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌లో జనరల్ కేటగిరీ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద నమోదు చేసుకున్న విద్యార్థులు ఆ పత్రాలను సమర్పించకపోతే.. జనరల్ కటాఫ్ మార్కులు సాధిస్తేనే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులని పేర్కొంది.
ఇదే నిబంధన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీకి వర్తిస్తుందని తెలిపింది. అలాగే రాష్ట్రాల జాబితాలో ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీలో ఉండి.. సెంట్రల్ ఓబీసీ జాబితాలో లేని కేటగిరీల విద్యార్థులు కూడా ఆ కేటగిరీ ప్రయోజనాలు పొందలేరని వెల్లడించింది. రక్షణ సర్వీసుల్లో పనిచేసేవారి పిల్లల రిజర్వేషన్లు కూడా కొన్ని కేటగిరీల వారికే వర్తించనున్నాయి. యుద్ధాల్లో లేదా శాంతిస్థాపన కార్యక్రమాల్లో మరణించిన, వికలాంగులైన, కనిపించకుండాపోయిన వారి సంతానానికి మాత్రమే ఈ కోటా సీట్లు దక్కుతాయి.
ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్
కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. వాస్తవానికి ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 4న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్, జూలై నెలల్లోకి వాయిదా పడడంతో అడ్వాన్స్‌డ్ పరీక్షను కూడా వాయిదా వేయక తప్పలేదు. కాగా జేఈఈ మెయిన్‌లో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి.. అర్హత పొందిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
వీరికి మాత్రమే అడ్వాన్స్‌డ్–2022కు అవకాశం..
► గతేడాది జోసా చివరి రౌండ్ కౌన్సెలింగ్‌కు ముందు ఉపసంహరించుకున్నవారు.
► బీఈ, బీటెక్‌లతోపాటు డ్యుయెల్ డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందేందుకు ఐఐటీలు నిర్వహించే రెసిడెన్షియల్ ప్రిపరేటరీ కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు.
► గతేడాది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లో సీట్లు వచ్చినవారు. అయితే వీరికి నిర్దేశిత అర్హతలు ఉండాలి.
► గతేడాది సీటు పొందినా దాన్ని ఆమోదించడం, ఫీజు చెల్లించడం, విద్యా సంస్థలో రిపోర్టు చేయనివారు
► 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొని రెండు పేపర్లూ రాయనివారు.. జేఈఈ మెయిన్–2022లో అర్హత సాధించినవారు.
► జేఈఈ మెయిన్ బీఈ, బీటెక్ కోర్సులకు సంబంధించిన పేపర్–1ను కాకుండా పేపర్ 2ఏ, 2బీలను రాసినవారు.
Comments
Please login to add a commentAdd a comment