
జేఈఈ మెయిన్‌లో మెరిసిన తెలుగు తేజాలు
♦ ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్‌ఈ
♦ జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులకు అగ్రస్థానం
♦ టాప్ మార్కులు సాధించిందీ తెలుగు విద్యార్థే
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులకు అగ్రస్థానం లభించింది. మొత్తంగా 360 మార్కులకుగాను తెలుగు విద్యార్థి తాళ్లూరి సాయితేజ (హాల్‌టికెట్ నంబర్ 20438099)కు అత్యధికంగా 345 మార్కులు రావడం విశేషం. రెండో అత్యధికమైన 340 మార్కులను కొండా విఘ్నేశ్‌రెడ్డి సాధించాడు. ఈ ఇద్దరు చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులే. 300 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిలో 43 మంది తమ విద్యార్థులని శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు ప్రకటించగా... వారిలో 34 మంది చైతన్య టెక్నోస్కూల్‌లో చదువుకున్నవారే.
ఈనెల 3న రాతపూర్వకంగా.. 9, 10 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.07 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 1.30 లక్షల మంది ఉన్నారు. ఇందులో తెలంగాణ నుంచి 59,731 మంది పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడి కావడంతో ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేందుకు గౌహతి ఐఐటీ చర్యలు చేపట్టింది.
మే 22న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకావాలనుకునే విద్యార్థులు మే 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించాలని ప్రకటించింది. జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు ఓపెన్ కేటగిరీలో 1,01,000 మంది, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 54 వేల మంది, ఎస్సీల్లో 30 వేల మంది, ఎస్టీల్లో 15 వేల మందిని ఎంపిక చేస్తారు. ఈ మొత్తం రెండు లక్షల మందిలో తెలంగాణ, ఏపీల నుంచి దాదాపు 25 వేల మంది ఉండనున్నట్లు అంచనా. ఇది గతేడాది సుమారు 18వేలు మాత్రమే.
తగ్గిన కటాఫ్
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత సాధించిన విద్యార్థుల కటాఫ్ మార్కులను సీబీఎస్‌ఈ ప్రకటించింది. గతేడాది టాప్ 1.5 లక్షల మంది జనరల్ కేటగిరీ అభ్యర్థులను ఎంపిక చేసి, 105 మార్కులను కటాఫ్‌గా ప్రకటించగా... ఈసారి టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకోవడంతో కటాఫ్ జనరల్ కేటగిరీలో 100కు తగ్గింది. ఇక ఓబీసీ-నాన్ క్రీమీలేయర్‌లో 70 మార్కులుగా, ఎస్సీల్లో 52 మార్కులుగా, ఎస్టీల్లో 48 మార్కులుగా కటాఫ్‌ను ప్రకటించింది.
అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీబీఎస్‌ఈ ఫలితాలను ప్రకటించింది. ప్రతి విద్యార్థికి ఇచ్చిన మార్కుల జాబితాలోనే కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెల్లడించింది. అందులోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో (http://jeeadv.nic.in) రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. మే 22న జరిగే అడ్వాన్స్‌డ్ పరీక్ష మార్కుల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలను చేపడతారు. ఇక ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి, నార్మలైజ్ చేసి తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఈ ర్యాంకులను జూన్ 30న, లేదా అంతకంటే ముందుగానే ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఇక విద్యార్థులు తమ అర్హత పరీక్ష అయిన 12వ తరగతి వివరాల్లో ఏవైనా పొరపాట్లుంటే http://www.jeemain.nic.in వెబ్‌సైట్‌లో సవరించుకోవాలని సూచించింది.
నాన్న గుర్తించిన ప్రతిభ..
మొదట్లో సాధారణ స్కూల్‌లో చదువు. అయినా ఆ పిల్లాడు చదువులో ఘనాపాటి. అన్ని తరగతుల్లోనూ నూటికి నూరు మార్కులు. ఐదో తరగతిలో బిడ్డ టాలెంట్‌ను గుర్తించిన తండ్రి మంచి స్కూల్‌లో చేర్పించాలని తపించాడు. ఈ క్రమంలో పేరొందిన స్కూల్‌లో చేర్పించడానికి ప్రవేశపరీక్ష రాయించాడు. అందులో రాష్ట్రం నుంచి నంబర్ వన్ ర్యాంకు ఆ అబ్బాయి వశమైంది. ఎస్సెస్సీ, ఇంటర్, తాజాగా జేఈఈ మెయిన్స్.. ఇలా ర్యాంకులన్నీ అతని ముంగిట మోకరిల్లాయి. ఆ అబ్బాయే జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా స్థాయిలో 345 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన తాళ్లూరి సాయితేజ. తండ్రి ఆనాడు సాయితేజ ప్రతిభను గుర్తించకపోయి ఉంటే.. ఇప్పుడు అతనికి ఆలిండియా స్థాయి ర్యాంకులు వచ్చేవికావేమో.
తండ్రి చలపతిరావు, జయలక్ష్మిది గుంటూరు జిల్లాలోని తెనాలి వద్ద ఉన్న కూచిపూడి. తేజ పుట్టకముందే వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. కూకట్‌పల్లిలోని వసంత్‌నగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. చలపతిరావు ఆల్విన్ వాచ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. జయలక్ష్మి గృహిణి. ప్రస్తుతం చలపతిరావు సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్‌టీఎస్‌ఈ)లో ఉత్తమ ప్రతిభ కనబర్చి స్కాలర్‌షిప్ పొందాడు సాయితేజ. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై) స్కాలర్‌షిప్‌కి కూడా ఎంపికయ్యాడు. అలాగే ఫిజిక్స్ ఒలింపియాడ్‌లోనూ సత్తా చాటాడు. డాక్టర్ ఏఎస్ రావు ఒలింపియాడ్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ‘నా కుమారుడు ఐఏఎస్‌గా స్థిరపడాలని అనుకున్నా. అందుకే ఐఐటీ వైపు తేజ దృష్టి మళ్లింది. ఏనాటికైనా తేజను ఐఏఎస్‌గా చూస్తా’ అని అతని తండ్రి చలపతిరావు చెప్పారు.
నంబర్ వన్‌గా ఉంటానని అనుకోలేదు..
‘‘నాన్న పడుతున్న కష్టం.. విద్యా వ్యవస్థపై ఆయనకున్న అవగాహన.. నేను అత్యుత్తమ మార్కులు సాధించడానికి దోహదపడ్డాయి. నారాయణ శ్రీచైతన్య విద్యాసంస్థల సహకారం ఎంతో ఉంది. మెయిన్స్ పరీక్ష క్లిష్టంగా అనిపించింది. బెస్ట్ స్కోర్ చేస్తానని అంచనా వేశా. అత్యుత్తమ మార్కులు వస్తాయని మాత్రం అనుకోలేదు. చివరకు ఆలిండియా స్థాయిలో బెస్ట్ స్కోర్ చేయడం చాలా సంతృప్తినిచ్చింది. అడ్వాన్స్‌డ్‌లోనూ టాప్ 10లో నిలుస్తానని నమ్మకం ఉంది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేస్తా. ఆ తర్వాత ఎంబీఏ చేయాలనేది నా లక్ష్యం’’.
- సాయితేజ, టాప్ స్కోరర్ (345/360)
సైంటిస్ట్‌గా స్థిరపడతా..
‘‘తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల దిశానిర్దేశంతో ఉత్తమ మార్కులు సాధించగలిగాను. పూర్తిగా సమయాన్ని చదువులకే కేటాయించే వాడిని కాదు. రోజుకు గంట ఆటలకు సమయమిచ్చా. దీంతో కాస్త ఒత్తిడి తగ్గడంతోపాటు నూతనోత్తేజం వచ్చేది. మెయిన్స్ పరీక్ష కఠినంగా అనిపించింది. కానీ పూర్థిస్థాయిలో శిక్షణ పొందడంతో.. కష్టమేమీ అనిపించలేదు. ఇస్రోలో సైంటిస్ట్‌గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’.
- కొండా విఘ్నేష్ రెడ్డి, 340/360
సొంత కంపెనీ పెడతా..
‘‘తల్లిదండ్రులు, కెమిస్ట్రీ అధ్యాపకురాలు సుభాషిణి సహకారంతోనే జేఈఈ మేయిన్స్‌లో 330 మార్కులు సాధించాను. దేశంలోనే బాలికల విభాగంలో మొదటి ర్యాంకు, ఓవరాల్‌గా 3వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో 6వ తరగతిలో చేరాను. ఉపాధ్యాయుల సహకారంతో పదో తరగతిలో 10 పాయింట్స్ సాధించాను. ఇంటర్‌లో 987 మార్కులొచ్చాయి. ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్, ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరాలని నా ఆకాంక్ష. భవిష్యత్తులో సొంత కంపెనీ పెట్టాలన్నది నా జీవితాశయం’’.
- ఆర్. గాయత్రి (మాదాపూర్) బాలికల్లో మొదటి ర్యాంకు