రేపటి నుంచి జేఈఈ మెయిన్‌    | JEE Main from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జేఈఈ మెయిన్‌   

Published Mon, Jan 7 2019 1:35 AM | Last Updated on Mon, Jan 7 2019 1:35 AM

JEE Main from tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ)ల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్‌ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 263 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి చొప్పున జేఈఈ మెయిన్‌ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించగా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి విడత పరీక్షను నిర్వహిస్తోంది. రెండో విడత పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 

ఈ నెల 31న ఫలితాలు... 
కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం మార్పు ఉండదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒక షిఫ్ట్‌కు బదులు రెండు షిఫ్ట్‌లలో లేదా వేర్వేరు రోజుల్లో రెండుస్లారు పరీక్ష పరీక్ష రాసినా వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని, వారి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని పేర్కొంది. పరీక్ష ఫలితాలను ఈ నెల 31న వెల్లడించనున్నట్లు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement