పాలిటెక్నిక్‌ విద్యలో నవోదయం  | Higher standards Jobs with diploma | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ విద్యలో నవోదయం 

Published Tue, May 23 2023 5:47 AM | Last Updated on Tue, May 23 2023 9:06 AM

Higher standards Jobs with diploma - Sakshi

పాలిటెక్నిక్‌ విద్యార్థులు

ఈ చిత్రంలోని విద్యార్థి పేరు కె. తరుణ్‌. రావులపాలేనికి చెందిన ఓ రైతు కొడుకు. మూడేళ్ల క్రితం పాలిసెట్‌లో ర్యాంకు సాధించి కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాడు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో విప్రో కంపెనీలో రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగంతో పాటు నాలుగేళ్ల సర్వీసు అనంతరం బిట్స్‌ పిలానీ నుంచి బీటెక్‌ డిగ్రీ ఇచ్చేందుకు కంపెనీ ఆఫర్‌ ఇచ్చింది. కానీ, ‘పదో తరగతిలో నా స్నేహితులు 10 మంది పాలిసెట్‌ రాశాం. నలుగురికి ర్యాంకులు వచ్చాయి. నేరు డిప్లొమాలో చేరితే మిగతా వారు ఇంటర్, తర్వాత ఇంజినీరింగ్‌లో చేరారు. వారింకా చదువుల్లో ఉంటే నేను 18 ఏళ్లకే మంచి ప్యాకేజీతో ఉద్యోగం అందుకున్నా. డిప్లొమా వదిలేసినందుకు వారిప్పుడు బాధపడుతున్నారు’.. అని తరుణ్‌ అంటున్నాడు.
 

ఈ విద్యార్థి పేరు ప్రేమ్‌సాయి. ఊరు ప్రొద్దుటూరు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇతను విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో మెకానికల్‌ డిప్లొమా కోర్సులో చేరాడు. ఇటీవల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో రూ.6.25 లక్షల వేతనంతో మెట్సో ఒటోటెక్‌ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కానీ, ఈ­యన సోదరి ఇంకా బీటెక్‌ మూ­డో ఏడాది చదువుతుండగానే ప్రేమ్‌­సాయి ఉద్యోగం సాధించేశాడు.

విశాఖపట్నానికి చెందిన పి. నవ్యశ్రీని ఆమె తల్లి చిరుద్యోగం చేస్తూ కుమార్తెను చదివించింది. భీమునిపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఈసీఈ డిప్లొమా మూడో ఏడాది చదువుతోంది. రూ.4.06 లక్షల ప్యాకేజీతో స్క్లంబర్గర్‌ కంపెనీలో కొలువు సంపాదించింది. 

కంచరపాలేనికి చెందిన జి. గీతాభవాని తండ్రి ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గీత విశాఖపట్నంలోని గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పెట్రో కెమికల్స్‌లో డిప్లొమా చేసింది. ఇటీవల క్యాంపస్‌ ఎంపికల్లో రూ.4 లక్షల వేతనంతో అల్ట్రాటెక్‌ కంపెనీలో కొలువును సొంతం చేసుకుంది.

కేవలం 18 ఏళ్ల వయసులో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు ఏడాదికి సగటున రూ.2.80 లక్షల వేతనంతో కొలువులతో పాటు, ఉన్నత విద్యావకాశాలు కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాంగణ ఎంపికల్లో మరో రెండు వేల మందికి పైగా ఉద్యోగాలు సాధిస్తారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ సి. నాగరాణి గర్వంగా చెబుతున్నారు. ఇదంతా గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ప్రోత్సాహంతోనే సాధ్యమైందంటున్నారు. 

సాక్షి, అమరావతి: పదో తరగతి తర్వాత పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల గమ్యం మూడేళ్ల  పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు. చదువుతో పాటే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో రూ.లక్షల వేతనాలతో విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. 2022–23 బ్యాచ్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు 4,000 మందికి పైగా ఇంకా పరీక్షలు పూర్తికాకుండానే మంచి వేతనాలతో క్యాంపస్‌ కొలువులను సొంతం చేసుకున్నారు.

గరిష్టంగా రూ.6.25 లక్షలు, సరాసరి రూ.2.80 లక్షల వార్షిక వేతనాలతో బహుళజాతి సంస్థల్లో ఆఫర్‌ లెటర్లు అందుకున్నారు. ఇంటర్, ఇంజినీరింగ్‌ కోర్సులతో ఆరేళ్లు చదివి పూర్తిచేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే అందుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం 400 దాటని అవకాశాలు.. ఇçప్పుడు వేలమందికి అందడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంస్కరణల ప్రభావం ఎంతో ఉంది. దీంతోపాటు ఏపీ సాంకేతిక విద్యాశాఖ చూపిన చొరవతో డిప్లొమా బోధనలోను మార్పులు చేశారు.   

ప్రభుత్వ కాలేజీల్లోనే అధిక కొలువులు
రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు, 175 ప్రైవేటు, ఒక ఎయిడెడ్‌ కాలేజీ ఉన్నాయి. వీటిల్లో గత దశాబ్ద కాలంలో ఏనాడు కొలువులు 450 దాటలేదు. 2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652, 2021–22లో 780 ఉద్యోగాలు అందుకుంటే.. ఈసారి 2022–23లో ఒక్క ప్రభుత్వ కాలేజీ విద్యార్థులే 4,071 మంది ఉద్యోగాలు సాధించారు.

మే చివరి వరకు కొనసాగే ఈ నియామక ప్రక్రియలో మరో రెండువేల మందికి పైగా అవకాశాలు పొందుతారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ సి. నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, ప్రైవేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లోని 24,667 మంది విద్యార్థుల్లో రెండువేల మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకున్నారు. 31 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది స్కిల్‌ హబ్‌లను ఏర్పాటుచేయడంతో శిక్షణ పొందిన విద్యార్థులు సునాయాసంగా కొలువులను దక్కించుకున్నారు. 

అత్యధికంగా నంద్యాలలోని ఈఎస్‌సీ పాలిటెక్నిక్‌ కాలేజీ నుంచి 352 మంది, విజయవాడ పాలిటెక్నిక్‌ నుంచి 277 మంది, కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్‌ నుంచి 224 మంది, అనంతపురం పాలిటెక్నిక్‌ నుంచి 215 మంది, విశాఖపట్నం (నేషనల్‌ హైవే) పాలిటెక్నిక్‌ నుంచి 174 మంది ఎంపికయ్యారు. 

ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులు
గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే సీని­యారిటీ ప్రకారం వేతనాలు పెరిగే పరిస్థితి. ఈ ఏడా­ది నుంచి సాంకేతిక విద్యాశాఖ చేసిన కృషితో చాలా కంపెనీలు డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదివేందుకూ అవకాశం కల్పించాయి. వాటిల్లో ఆర్సెలర్‌ మిట్టల్, నిప్పన్, విప్రో, స్మార్ట్‌ డీవీ టెక్నాలజీస్, ఏషియన్‌ పెయింట్స్, టాటా ప్రాజెక్ట్స్, షాపూర్జీ–పల్లోంజీ, జేఎస్‌డబ్ల్యూ, అల్ట్రాటెక్, మెట్సో ఉటోటెక్‌ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఉండడం గమనార్హం.

ఉద్యో­గాల్లో చేరిన వారికి నాలుగేళ్లల్లో ‘వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ (వైల్‌) ద్వారా బీఎస్సీ, బీటెక్‌ డిగ్రీ ఇచ్చేలా ఆయా కంపెనీలు అంగీకరించాయి. వ­చ్చే ఏడాది నుంచి విద్యార్థులు చదువులో భాగంగా చే­సే 6 నెలలు, ఏడాది ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌లోనే నూ­రు శాతం ఉద్యోగాలు లభించేలా శిక్షణనివ్వనుంది.  

ప్రతి కాలేజీలోనూ ప్లేస్‌మెంట్‌ సెల్‌
ఇంజినీరింగ్‌ చేస్తేనే అవకాశాలు ఉంటాయన్నది అపోహే. ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 11,604 మంది విద్యార్థులు చివరి సంవత్సరం చదువుతుంటే వారిలో 4 వేల మందికి పైగా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. కమిషనర్‌ నాగరాణి ఆయా పరిశ్రమలను స్వయంగా పరిశీలించి ఒప్పందం చేసుకున్నారు. అన్ని కాలేజీల్లోను ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటుచేసి కేంద్ర కార్యాలయంతో అనుసంధానించారు. ఫైనలియర్‌లోనే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. 
– డాక్టర్‌ ఎంఏవీ రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్‌ (ప్లేస్‌మెంట్‌ సెల్‌)

ఇండస్ట్రియల్‌–అకడమిక్‌ సౌజన్యంతో.. 
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాలిటెక్నిక్‌ విద్యా బోధనలో మార్పులు చేస్తున్నాం. 31 జీపీటీల్లో స్కిల్‌ హబ్స్‌ను ఏర్పాటుచేశాం. రాష్ట్రానికి బహుళజాతి కంపెనీలూ వస్తున్నాయి. వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం. ఆ కంపెనీలే క్యాంపస్‌కు వచ్చి ఉద్యోగాలిస్తున్నాయి. అలాగే, మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాం.

ఈ ఏడాది మొదటి విడతగా 84 మంది ప్రొఫెసర్లను ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌కు పంపించాం. చాలామంది విద్యార్థులు డిప్లొమా తర్వాత బీఎస్సీ, బీటెక్‌ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తూనే నాలుగేళ్లల్లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఇచ్చేలా యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది నూరుశాతం ప్లేస్‌మెంట్స్‌కు ప్రణాళిక సిద్ధంచేశాం.                    
 – సి. నాగరాణి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement