- రేపే జేఈఈ మెయిన్ పరీక్ష
- 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 69,467 మంది, ఏపీ నుంచి 80 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కు నిర్వహించే పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. 9.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు.
హైదరాబాద్, ఖమ్మం,వరంగల్‌లలో కేంద్రాలు..: జేఈఈ పరీక్షలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో, ఏపీలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆఫ్‌లైన్ పరీక్షకు నిర్ణయించిన సమయాల్లోనే ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్షలకు మరో 25 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. పరీక్షలో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానినికి 4 మార్కుల చొప్పున 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో తప్పు సమాధానానికి ఒక్క మార్కు తగ్గుతుంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ ప్రధాన నిబంధనలు..
► పేపర్–1 పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు.
► ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థుల తనిఖీ ఉంటుంది.
► పరీక్ష హాలులోకి మాత్రం ఉదయం 9 గంటలకు అనుమతిస్తారు.
► 9.20 గంటలకు ప్రశ్నపత్రం ఓఎంఆర్ బుక్‌లెట్‌ను ఇస్తారు. దాన్ని 9.25 గంటలకు తెరవాలి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది.
► 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
► హాల్‌టికెట్, గుర్తింపుకార్డు తప్ప మరేవీ అనుమతించరు.
► కాలిక్యులేటర్లు, అవి ఉండే గడియారాలు, సెల్‌ఫోన్లను అనుమతించరు.
► పరీక్ష బ్లూ/బ్లాక్ పెన్‌తోనే రాయాలి. పెన్సిల్‌ను అనుమతించరు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Published Sat, Apr 1 2017 4:37 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement
Advertisement