Engineering education
-
‘ప్రమోట్’కు ఒకటే ప్రమాణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకే తరహా ప్రమోషన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం సాంకేతిక విద్య విభాగానికి సూచించింది. ఇంజనీరింగ్‌లో కనీసం 20 క్రెడిట్స్ ఉంటేనే తర్వాతి ఏడాదికి ప్రమోట్ చేసే విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలో అన్ని వర్సిటీల వీసీలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్రెడిట్ పాయింట్లను బట్టి మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ విధానం ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉంది. దీంతో కొన్ని వర్సిటీల విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, మహాత్మాగాంధీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కో విధానం వర్సిటీల్లో ఒక్కో సెమిస్టర్‌కు 20 చొప్పున, ఏడాదికి 40 క్రెడిట్స్ ఉంటాయి. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి మొదటి సంవత్సరంలో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. మిగతా సంవత్సరాల విషయంలోనూ ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. నాలుగేళ్లకు కలిపి మొత్తం 160 క్రెడిట్ పాయింట్లు ఉంటాయి. 4వ సంవత్సరంలో 160 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అయితే యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్‌ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్‌లో ఐదు థియరీ సబ్జెక్టులు, మూడు ల్యాబ్‌లు ఉంటాయి. విద్యార్థి పాసయ్యే ఒక్కో సబ్జెక్టుకు దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్లు అతని ఖాతాలో పడతాయి. విద్యార్థులు ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో చూసుకుని ఆ వర్సిటీని ఎంచుకుంటున్నారు. -
ఆ స్కిల్స్ ఏవీ?
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో ఇంజనీరింగ్ విద్యను లైట్‌గా తీసుకున్న విద్యార్థులు..ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటెక్‌లో ముఖ్యమైన నైపుణ్య మెళకువలపై దృష్టి పెట్టకపోవడం అక్కడ చాలామంది స్కిల్ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ప్రాజెక్టులు, ఇంటర్న్ íÙప్లు ఇండియాలో సరిగ్గా పూర్తి చేయకపోవడంతో విదేశీ ఉద్యోగాలు చేజిక్కడం లేదు. ఇంజనీరింగ్‌లో సెమినార్‌ను లైట్‌గా తీసుకోవడం వల్ల విదేశాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రదర్శించలేక పోతున్నారు. ఎంఎస్ కోసం ఏటా 7.50 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. వీరిలో 1.90 లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్లేవారే. ఇందులోనూ అత్యధికంగా అమెరికాకు 90 వేలకుపైగా వెళుతున్నారు. లీప్ స్కాలర్స్ అధ్యయనం ప్రకారం అమెరికాలో వివిధ దేశాలకు చెందిన 2.25 లక్షల మంది ఏటా స్కిల్ ఉద్యోగాలు పొందుతుంటే, తెలంగాణ విద్యార్థుల వాటా 8 వేలకు మించడం లేదు. మిగతా వారంతా అన్‌స్కిల్డ్, పార్ట్‌టైం ఉద్యోగాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యాలపై దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. కలివిడితనమే కీలకంఎంఎస్ తర్వాత విదేశాల్లో ఉద్యోగం పొందాలంటే కలివిడిగా దూసుకెళ్లడం కీలకం. ఇంటర్వ్యూలు, సెమినార్లు, గ్రూప్ డిస్కషన్స్‌కు విదేశీ సంస్థలు ప్రాధాన్యమిస్తాయి. నాయకత్వ లక్షణం ఉంటేనే ప్రాజెక్టు ముందుకెళుతుందనే భావనతో ఉంటాయి. చాలామందిలో ఈ లోపం కనిపిస్తోందని యూఎస్‌లో లీడింగ్ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడు నీరజ్ పంకజ్ తెలిపారు. అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులకు స్థానిక వసతి, రవాణా, మార్కెట్లు, కరెన్సీ వంటి అంశాలపై కూడా ఆరునెలల వరకూ అవగాహన ఉండటం లేదని తెలిపారు. కేవలం కన్సల్టెన్సీలనే నమ్ముకుంటున్నారని, ఇతరులతో పరిచయాలు పెంచుకునే నైజం ఉండటం లేదన్నారు. ఇంజనీరింగ్‌లో ఇంటర్న్ షిప్‌లు, గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొంటే, సెమినార్లు తరచు చేస్తూ ఉంటే ఈ సమస్య ఉండదన్నారు. ఏకాగ్రతను దెబ్బతీసే అలవాటు మనకు, ఇతర దేశాలకు వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలుంటాయి. సంస్కృతి, భాష వంటకాల్లో కూడా అంతే. ఈ అసౌకర్యంతో చాలామంది విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తింటోంది. హోమ్‌సిక్ బారిన పడుతున్నారు. మనవారు సాధారణంగా టూరిస్ట్ గైడ్, టీచింగ్ అసిస్టెంట్, లైబ్రరీ మానిటర్, గిగ్ మార్కెట్లో పనిచేస్తుంటారు. ఇవన్నీ పార్ట్‌టైం ఉద్యోగాలే. వాస్తవానికి ఇండియాలో ఉన్నప్పుడు అసలీ రంగాలపైనే వారికి అవగాహన ఉండటం లేదని, ఇతర దేశాలకు వెళ్లి నేర్చుకోవడం కష్టంగా ఉంటోందని ఆ్రస్టేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు ఆదిత్య తెలిపారు. ఈ అసౌకర్యం వల్ల ప్రధానమైన స్కిల్ ఉద్యోగాలపై ఏకాగ్రత తగ్గుతోందన్నారు. వీసా గడువు పూర్తయ్యే నాటికి కూడా మంచి ఉద్యోగం పొందే స్కిల్ ఉండటం లేదని చెప్పారు. ఆ నిర్లక్ష్యంతోనే ఒత్తిడి ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థి ఏకకాలంలో ఎన్నో పనులు చేయాలి. క్లాసులకు హాజరవ్వాలి. అసైన్మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. ఇంకోవైపు పార్ట్‌టైం ఉద్యోగమూ చేయాలి. వాస్తవానికి ఇవన్నీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇంజనీరింగ్ చేసేప్పుడూ ఇవన్నీ ఉంటాయి. కానీ మనవారు పట్టించుకోవడం లేదని కెనడాలో ఉంటున్న హైదరాబాద్‌వాసి సాయిచరణ్ తెలిపారు. విదేశాల్లో ఇవన్నీ ఏకకాలంలో చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రణాళికాబద్ధమైన జీవన విధానం దెబ్బతింటోందన్నారు. సామాజిక అవగాహనతో ఇంజనీరింగ్ విద్య చేసేవారు ఈ ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఆవిష్కరణలు, వాటిపై జరిగే సెమినార్లలో పాల్గొంటే ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం నాణ్యమైన విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విద్యార్థులకే విదేశీ ఉద్యోగాలు తేలికగా లభిస్తున్నాయి. అక్కడే వివిధ అంశాల బోధనకు అవసరమైన వాతావరణం ఉంటుంది. ఇందులోనే పరిశోధన ఉంటుందని నమ్ముతున్నాయి. జ్ఞానాన్నీ, తార్కిక ఆలోచనా నైపుణ్యాన్నీ పెంచుకునే అవకాశాలు విద్యార్థులకు విస్తృతంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో రాణించే మెళకువలు ఇంజనీరింగ్ నుంచే అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. తరగతిగదిలో లెక్చరర్లు బోధించే సమయం, వారానికి కొన్ని గంటలపాటు పరిమితంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత నేర్చుకోవడం, అవసరమైన సమాచారాన్ని సేకరించగలగడమే విదేశీ విద్య తర్వాత రాణించడానికి మార్గం సుగమం చేస్తుంది. -
చదువు పూర్తయిందా.. ఉద్యోగం కావాలా..? ఇదే బెస్ట్ ఛాయిస్..
ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. కానీ ఎంచుకున్న రంగంలో ఏ విభాగంలో డిమాండ్ ఉందో తెలుసుకోలేక నష్టపోతుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విభాగంలో ఎక్కువ కొలువులు రానున్నాయో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. చదువు అయిపోయాక ఉపాధి అవకాశాలు లభించాలంటే విద్యను అభ్యసిస్తున్నపుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటుండగా... ఇందులో చాలా శాతం మంది ఉద్యోగాలు సాధించడం లేదు. సొంతంగా అంకుర సంస్థలను స్థాపించేందుకు కొద్దిమందే ముందుకొస్తున్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్‌లో పరిశోధనలు.. విదేశాల్లో కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఆటోమేషన్ అంశాలపై అధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో విభిన్నమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఓ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ కొద్ది నెలల కిందట కృత్రిమ మేధతో అనుసంధానమైన స్మార్ట్‌ఫ్రిజ్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా దేశాల్లో ఆవిష్కరించింది. ఇదీ చదవండి: 4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే.. ఒక సాంకేతిక పరికరాన్ని ఫ్రిజ్‌లో అమర్చితే చాలు అందులోని కూరగాయలు ఏ రోజు వండుకోవాలో చెబుతుంది. పండ్లు, ఇతర సామగ్రి ఖాళీ అవుతున్నప్పుడు దానంటదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు, సాఫ్ట్వేర్లు ఇతర రంగాలకూ అవసరం. వీటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా చాలా మార్పులు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అంశాలను విద్యను అభ్యసిస్తున్నపుడే నేర్చుకుంటే చదువు అయిపోయాక వెంటనే కొలువు దొరికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్‌లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
యువ ఇంజనీర్లకు 'ఉపాధి ఎక్కడ'?
► నిజామాబాద్‌కు చెందిన సూర్యకిరణ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశాడు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్సే అతని ప్రధాన సబ్జెక్టు. ఇతను ఓ ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మైక్రో లెవల్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఇంత సూక్ష్మ స్థాయి టెక్నాలజీ గురించి అతను పుస్తకాల్లో చదవలేదు. ప్రాజెక్టు సమయంలోనూ దీని జోలికెళ్ళలేదు. దీంతో నైపుణ్యం లేదని కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే కాదు..దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆకర్షణీయమైన వేతనంతో ఏ బహుళజాతి కంపెనీలోనో తక్షణ ఉద్యోగం లేదా డిగ్రీ పూర్తి కాగానే ఎమ్మెస్ కోసం అమెరికా లాంటి దేశానికి వెళ్లి పోవచ్చు. డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రధానంగా ఇలాంటి కారణాలతోనే ఇంజనీరింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా కంప్యూటర్ సంబంధిత కోర్సులపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఏటా సగటున 14 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. కానీ ఏటా సగటున కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభిస్తుండటం గమనార్హం. ఇందులోనూ కేవలం 8 శాతం మందికి మాత్రమే వారు చదివిన విద్యకు తగిన ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వారంతా ఏదో ఒక ఉద్యోగంతో సరిపుచ్చుకుంటున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలు స్పష్టం చేస్తుండటం శోచనీయం. మన రాష్ట్రంలో 2021–22లో 87 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరారు. వీరిలో 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లో చేరారు. కానీ ఈ ఏడాదిలో కేవలం 39 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు పొందారు. వీటిల్లో ఎక్కువగా నాన్–స్కిల్డ్ ఉద్యోగాలే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంకేతికతకు సరిపడ నైపుణ్యాలు కొరవడటం, సంబంధిత సబ్జెక్టుపై తగిన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏళ్ల నాటి టెక్నాలజీయే ఇప్పుడూ..! ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతికతను అన్ని రంగాలూ అందిపుచ్చుకుంటున్నాయి. మానవ వనరులతో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి టెక్నాలజీ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తోంది. అయితే వీటి నిర్వహణకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ల అవసరం ఉంది. కానీ బోధనలో ఎప్పటికప్పుడు మార్పు చెందే టెక్నాలజీని చేర్చడం లేదని, ఏళ్ళ నాటి టెక్నాలజీతోనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. గత కొన్నేళ్ళుగా కంప్యూటర్ సైన్స్‌లో అనేక కొత్త కోర్సులు వస్తున్నాయి. ఇవన్నీ మూడేళ్ళ క్రితమే డిజైన్ చేసినవి. కోవిడ్ తర్వాత అన్ని రంగాలు తక్కువ మానవ వనరులతో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను అభివృద్ధి చేశాయి. ఇంటినుంచే బ్యాంకు లావాదేవీలు, ఢిల్లీలో ఉండి ఎక్కడో మారుమూల ఉన్న సోలార్ సిస్టమ్‌ను పరిశీలించే విధానాలు వచ్చాయి. కానీ ఈ టెక్నాలజీ విద్యార్థుల వరకూ వెళ్ళడం లేదు. ఇలాంటి పరిస్థితులే యువ ఇంజనీర్ల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు. తూతూ మంత్రం ప్రాజెక్టులు ఇంజనీరింగ్ విద్యలో ప్రాజెక్టులు కీలకం. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసేవారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే టెక్నాలజీపై ప్రాజెక్టులు చేయాలి. కానీ ఏదో ఒక ప్రాజెక్టును ఎవరితోనో చేయించుకుని వస్తున్నారని, విధిలేని పరిస్థితుల్లో వాటిని అనుమతించాల్సి వస్తోందని ఒక యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఇక ప్రైవేటు కాలేజీలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. చాలా కాలేజీలకు నాణ్యమైన పరిశ్రమలతో ఎలాంటి సంబంధాలూ లేవు. దీంతో విద్యార్థులకు మంచి ప్రాజెక్టులను సూచించలేకపోతున్నారు. విద్యార్థులు కూడా ఏదో ఒక ప్రాజెక్టు చేశామనిపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త విషయాలపై దృష్టి పెట్టాలనే ఆలోచనను విద్యార్థి దశలోనే విస్మరిస్తే, కంపెనీలు కోరుకునే కొత్త టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యకే కాదు..ఉన్నత విద్య మొత్తానికీ ఇదే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిలో, విద్యా విధానంలో మార్పు రావాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అంటున్నారు. సాంకేతికతలో మార్పులు అందిపుచ్చుకోవడం లేదు ఉన్నత విద్యకు వచ్చిన విద్యార్థి తరగతి గదిలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే కొత్త విషయాలను రాబట్టే విధానం అభివృద్ధి చెందుతుంది. మెజారిటీ విద్యార్థుల్లో ఇది కన్పించడం లేదు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఇదే ఉపాధికి ప్రధాన అడ్డంకిగా మారింది. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్టీయూహెచ్) ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి 75 ఏళ్ళు గడిచినా భారత విద్యా విధానంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. అనేక కమిషన్లు వేసినా ఈ దిశగా ముందడుగు వేయలేదు. ఈ కారణంగానే మన అవసరాలకు కావాల్సిన విద్యా విధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాం. పరిశోధనాత్మక విద్యకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. థియరీ విద్యతో పాటు ప్రధానంగా ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయాలి. – ప్రొఫెసర్ తాటికొండ రమేష్ (వీసీ, కాకతీయ వర్సిటీ) నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ పెంచాలి సాంకేతిక విద్యే కాదు.. ఉన్నత విద్యలోనూ థియరీలోనే ముందుకెళ్తున్నాం. కానీ పుస్తకాల్లో ఉన్నదానికి నిజ జీవితంలోని అనుభవాలు జోడించడం లేదు. థియరీతో పాటు నాణ్యమైన ప్రాజెక్టు వర్క్ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే పెంచాలి. ఈ దిశగా ఏఐసీటీఈ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. ఏదో ఒక ఉపాధి అనుకోవడం కాదు.. ఉన్నత విద్య తర్వాత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం) విద్యార్థి దశలోనే సంస్థలతో భాగస్వామ్యం ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా అన్ని సంస్థలు యాంత్రిక విధానాలను అనుసరిస్తున్నాయి. వీటి నిర్వహణ నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లకే ఉపాధి అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఆసుపత్రులు ఏఐ ద్వారా ముందుకెళ్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలియాలంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఆ విద్యార్థికి సంస్థలు, కంపెనీలతో భాగస్వామ్యం అవసరం. అప్పుడే భవిష్యత్ అవసరాలకు ఇంజనీరింగ్ విద్యను ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది. ఈ దిశగా ఉన్నత విద్యలో మార్పులు అవసరం. – ఎస్.నీలిమ (సీఈవో, అనురాగ్ యూనివర్సిటీ) నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే విధానం ఉండాలి విద్యార్థికి మార్కులు కొలమానంగా ఉండే విద్యా విధానం మారాలి. అందుకే దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని ఓ సంస్థను కోరాం. విద్యార్థిలో ఉండే నైపుణ్య సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే పరీక్షా విధానం భావి ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి) -
రెండో ఏడాది నుంచే ఫీల్డ్ స్టడీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య ఈ ఏడాది నుంచి సరికొత్తగా ఉండబోతోంది. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అన్ని కాలేజీలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. విశ్వవిద్యాలయాలు సైతం ఇప్పటికే బోధన ప్రణాళిక తీరు తెన్నులను కాలేజీలకు పంపాయి. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా స్వీయ అనుభవంతో బోధన ఉండబోతోందని యూనివర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విజ్ఞానం అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలని అంటున్నాయి. ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు నాలుగో సంవత్సరంలో కాకుండా ముందు నుంచే విద్యార్థులపై దృష్టి పెట్టబోతున్నాయి. వారిలో నైపుణ్యానికి పదును పెట్టే రీతిలో ప్రాజెక్టు వర్క్స్‌ను ఎంపిక చేసినట్టు కొన్ని కాలేజీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు తెలిపాయి. రెండో ఏడాది నుంచే... అన్ని బ్రాంచీల విద్యార్థులకు మొదటి సంవత్సరం పుస్తక విషయ పరిజ్ఞానం ఆధారంగానే కొనసాగుతుంది. రెండో ఏడాది నుంచి ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నాల్గవ సంవత్సరంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉండేది. అదికూడా విద్యార్థులు ఇష్టానుసారం ఏదో ఒక ప్రాజెక్టు సమర్పించేవాళ్లు. ఈ క్రమంలో విద్యార్థులు ఎవరో తయారు చేసిన ప్రాజెక్టులను కొని తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. దీనివల్ల విద్యార్థికి డిగ్రీ చేతికొచ్చినా విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండేది కాదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు రిపోర్టులను పక్కాగా తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన ప్రముఖ కంపెనీలకు సెకండియర్ విద్యార్థి వెళ్లాలి. అక్కడి నిపుణులతో మమేకమై సరికొత్త టెక్నాలజీపై ఆలోచన చేయాలి. విద్యార్థిలో విషయ పరిజ్ఞానం ఉందని, ప్రాజెక్టు రిపోర్టు సరికొత్తదేనని సంబంధిత సంస్థలు ధ్రువీకరించాలి. అప్పుడే ప్రాజెక్టు రిపోర్టును విశ్వవిద్యాలయాలు ఆమోదిస్తాయి. ఇదేవిధంగా నాల్గో సంవత్సరంలోనూ మరింత లోతైన అవగాహనతో ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి సంపూర్ణమైన స్వీయ పరిజ్ఞానం పొందుతాడని విశ్వవిద్యాలయాలు భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులపై దృష్టి రాష్ట్రంలో 90 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరగా, ఇందులో 64 శాతం కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీలకు చెందిన వారున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇంజనీరింగ్ విద్యలో కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకోవడం ఇప్పటివరకూ జరిగింది. ఇక నుంచి తొలి ఏడాదిలోనే అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న కోడింగ్ విధానంపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల అనుసంధానంతో కంప్యూటర్ కోర్సుల్లో లోతైన ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుపరిచే దిశగా ఈ ఏడాది నుంచి బోధన ప్రణాళిక ఉండబోతోందని వర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. కోడింగ్‌పై సరైన అవగాహన ఉందనేది ప్రాజెక్టు రిపోర్టుల ద్వారా విద్యార్థి నిరూపించుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులే కీలకం ఈ ఏడాది నుంచి సెకండియర్‌లో ప్రాజెక్టు నివేదికలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనివల్ల విద్యార్థి నాణ్యమైన ఇంజనీర్‌గా బయటకొచ్చే వీలుంది. ఎంతోమంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నా, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఆ దిశగానే సరికొత్త బోధన ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూ వీసీ -
ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తేవాలనుకుంటున్న ఈ బోధనా విధానం ప్రకారం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోనే ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే మార్కులు ఇస్తారు. అలాగే ఆఖరి సంవత్సరంలో మరో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాలనే షరతు పెట్టనున్నారు. ఎందుకీ మార్పు...? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో 12 శాతం మంది మాత్రమే స్కిల్డ్ జాబ్స్ పొందుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సర్వేలో ఇది స్పష్టమైంది. కంప్యూటర్ సైన్స్‌లో కనీసం కోడింగ్ కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో వెల్లడైంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళిక లేదని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల కోసం స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బోధన స్థాయిలోనూ పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని ఏఐసీటీఈ సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొంతకాలంగా సరికొత్త బోధన ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడది ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. నాణ్యమైన విద్య, తక్షణ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్నత విద్యలో మార్పులతోపాటు ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంజనీరింగ్ విద్యలో ఫీల్డ్ అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే దీని భాగస్వామ్యాన్ని పెంచనున్నాం. నవీన దృక్పథంతో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే ఇంటర్నల్ మార్కులను 20 నుంచి 40కి పెంచాం. ఎక్స్‌టర్నల్స్ 60 మార్కులకు ఉండేలా మార్పులు చేశాం. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్ చేయడం, సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ తీసుకురావడాన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఇవన్నీ ఇంజనీరింగ్ విద్య నాణ్యతను పెంచుతాయని, మార్కెట్లో మంచి నిపుణులుగా విద్యార్థులను నిలబెడతాయని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ -
ఇంజనీరింగ్ విద్య పల్లెకు దూరం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చేయాలంటే ఇక రాజధానికే చేరాలా? సొంతూళ్లలో ఉండి చదువుకోవడం సాధ్యం కాదా? సాంకేతిక విద్యారంగ నిపుణులు లేవనెత్తే సందేహాలివి. నిజమే! ఇంజనీరింగ్ కాలేజీలు శరవేగంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు మాత్రమే పోటీ ప్రపంచంలో పడుతూ లేస్తూ నిలబడుతున్నాయి. రాష్ట్రంలో 2014లో 249 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ఇప్పుడు వీటి సంఖ్య 175కు తగ్గింది. అంటే 2014 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లలో 74 కాలేజీలు మూతపడ్డాయి. ఇందులో 54 కళాశాలలు గ్రామీణ ప్రాంతాలకు చేరువలో జిల్లా కేంద్రంలో ఉండేవే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కాలేజీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కాలేజీల మనుగడే కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన బ్రాంచీల్లోనే పూర్తిగా సీట్లు నిండని కళాశాలలు 15 వరకూ జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. హైదరాబాద్ బాట పట్టడం వల్లేనా?: టెన్త్ వరకూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నా... తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండి ఇంటర్ చదివేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్ సహా పలు పోటీ పరీక్షలకు రాజధానిలో కోచింగ్ తీసుకోవడం తేలికని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఉపాధే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీంతో అవసరమైన అనుబంధ కోర్సులు చేసేందుకు హైదరాబాద్‌లోనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పలు కంపెనీలు క్యాంపస్ నియామకాలను హైదరాబాద్ పరిసర కాలేజీల్లోనే నిర్వహిస్తున్నాయనే ప్రచారం ఉంది. కంప్యూటర్ కోర్సులూ కారణమే.. గత ఐదేళ్లుగా సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల కన్నా, కంప్యూటర్ సైన్స్, కొత్తగా వచ్చిన దాని అనుబంధ కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. గత ఏడాది సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో 38,796 సీట్లు ఉంటే, 37,073 సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 13,935 సీట్లకు 12,308 సీట్లు, సివిల్‌లో 6 వేల సీట్లకు 3 వేలే భర్తీ అయ్యాయి. ఈఈఈలో ఉన్న 7 వేల సీట్లల్లో 4 వేలు, మెకానికల్‌లో 5,800 సీట్లుంటే 2,550 మాత్రమే భర్తీ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే.. సివిల్, మెకానికల్‌లో చేరే వారి సంఖ్య తగ్గింది. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను నిర్వహించడం గ్రామీణ కాలేజీలకు సాధ్యం కావడం లేదు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 48 కాలేజీలుంటే, ఇప్పుడు 11కు పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మి గిలాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 11లో రెండు మాత్రమే ఉన్నాయి. ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. నిర్వహణ కష్టం.. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు నిర్వహణ కష్టంగానే ఉంది. మంచి ఫ్యాకల్టీ హైదరాబాద్ విడిచి వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో భవిష్యత్ ప్రయోజనాల కోసం విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. ఇది గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలకు గడ్డు పరిస్థితి తెస్తోంది. –ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, వీసీ, జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయిలో మార్పులు అవసరం గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచాలి. సంప్రదాయ సివిల్, మెకానికల్ కోర్సులకు ఆధునిక సాంకేతికత జోడించి కొత్తదనం వచ్చేలా చూడాలి. వీటితో ఉపాధి ఉంటుందనే నమ్మకం కలిగించాలి. లేకపోతే ఇంజనీరింగ్ విద్య మరింత భారమయ్యే అవకాశం ఉంది. –అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యను ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. పాఠ్యపుస్తకాల ముద్రణను వేగవంతం చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మొదటి సంవత్సరం పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో రూపొందించే పనిలో నిమగ్నమైంది. వీటితో పాటు డిప్లొమా పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదింపజేస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతీయ భాషలకు చెందిన 226 మంది రచయితలతో 218 పాఠ్యపుస్తకాలను తర్జుమా చేయించి సిద్ధం చేసింది. ఇకపై ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వారికి భాష అడ్డంకిగా ఉండదని ఏఐసీటీఈ ట్విట్టర్లో పేర్కొంది. నూతన విద్యావిధానంలో భాగంగా దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంజనీరింగ్ విద్యను అందించేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. హిందీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు నిర్ణయించింది. అయితే, ఇంజనీరింగ్ సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేకపోవడం, వాటిని బోధించే సిబ్బంది కూడా లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లోని కాలేజీలు ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యకు సుముఖత చూపడం లేదు. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 5 ప్రాంతీయ భాషల్లో 14 ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్‌లోని కొన్ని కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు ముందుకొచ్చాయి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను తమిళ భాషలో అందించేందుకు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గుంటూరు జిల్లాలోని ఒక కాలేజీ తెలుగు మాధ్యమంలో కొన్ని కోర్సులను అందించేందుకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకుంది. ఈ ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్ధులు ఆ భాషలో కానీ, ఆంగ్లంలో కానీ పరీక్షలు రాసేందుకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది. -
ప్రాంతీయ భాషల్లో బీటెక్ సాధ్యమేనా?
సాక్షి, అమరావతి: నూతన విద్యావిధానంలో పేర్కొన్న మేరకు ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీటెక్ వంటి సాంకేతిక కోర్సులను స్థానిక భాషల్లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్నది చర్చ సాగుతోంది. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల అమలు కష్టమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక భాషల్లో సాంకేతిక పదజాలం ఏది? స్థానిక భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలంటే ముఖ్యంగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన సాంకేతిక పదజాలం ప్రాంతీయ భాషల్లో లేదు. వాటిని ఏదోలా తర్జుమా చేసినా విద్యార్థులకు పదాలు అర్థమవడం కష్టమే. ప్రస్తుతం ఇంజనీరింగ్ సహా అనేక అంశాల పరిజ్ఞానం ఆంగ్లంలోనే లభ్యమవుతోంది. ఆ భాషలో నైపుణ్యమున్న వారికే ఆ పరిజ్ఙానం ఎక్కువగా పొందగలుగుతున్నారు.ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులను నిర్వహించడం, అభ్యసించడం కష్టమే కాకుండా అలా చదువులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు దక్కవు ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లిషు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికే ప్రాధాన్యం దక్కుతోంది. తెలుగు వంటి స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించడం చాలా కష్టం. అందరూ ఎల్కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమానికి మొగ్గుచూపుతున్న తరుణంలో తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రారు. తెలుగులో ఇంజనీరింగ్ చేసేవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకురావు. – చొప్పా గంగిరెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఆప్షన్ మాత్రమే ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలన్నది జాతీయ నూతన విద్యావిధానంలో పాలసీగా పెట్టినా అది ఆప్షన్ మాత్రమే. దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కొన్ని ఎంపికచేసిన ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా తర్జుమా చేయించారు. కాలేజీలు తమకు నచ్చితే అమలు చేయవచ్చు. వద్దనుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమంలోనే బీటెక్ కోర్సులను కొనసాగించవచ్చు. అది వారిష్టం. – సతీష్‌చంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ -
మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ ప్రవేశాలకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్‌గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి.. 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ (రివైజ్డ్) 2020–21లో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్/బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియట్లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మన దగ్గర ఎంపీసీ విద్యార్థులే ఇంజనీరింగ్‌లో చేరుతారు. ఏఐసీటీఈ పేర్కొన్న పలు కాంబినేషన్ల సబ్జెక్టులు మన దగ్గర ఇంటర్మీడియట్లో లేవు. పైగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - పాపిరెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి అన్ని కోణాల్లో పరిశీలిస్తాం నిర్దేశిత సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే చాలని పేర్కొన్న ఏఐసీటీఈ నిబంధనను పరిశీలిస్తాం. ఈసారి సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై సబ్జెక్టు నిపుణులతో, యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విభాగం నిపుణులతో చర్చిస్తాం. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అయితే అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు/ సంబంధిత బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పినందున ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చిస్తాం. మండలి సూచనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - ప్రొఫెసర్ గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్ -
త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్య త్వరలో ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులకు అందుబాటులోకి రాబోతోంది. గిరిజనులు కూడా తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే 105.32 ఎకరాల భూమిని, రూ.153 కోట్లను కేటాయించారు. వీలైనంత వేగంగా పనులు జరిగేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గిరిజన కాలేజీని జేఎన్టీయూ కాకినాడకు అనుబంధం చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ నెలలోనే మంత్రుల చేతుల మీదుగా ఈ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు ఇప్పటికే ప్లానింగ్ పూర్తి చేశామని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్‌లలో తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నాలుగేళ్ల డిగ్రీ హానర్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యకు దీటుగా సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఉన్నత విద్యా మండలి డిగ్రీలో బీఎస్సీ డాటా సైన్స్, బీకాం అనలిటిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉద్యోగ, ఉపాధికి వెళ్లేవారికోసం, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం బీటెక్ తరహాలోనే నాలుగేళ్ల డిగ్రీ హానర్స్ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. బీఎస్సీ డాటా సైన్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు), బీకాం అనలిటిక్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు) డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు బీటెక్ తరహాలో నాలుగేళ్ల డిగ్రీ చదివి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఈ కోర్సులు అనుమతి పొందిలేవు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులకు సిలబస్‌ను రూపొందించి, యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఆమోదం తీసుకుని ప్రవేశ పెట్టేలా కసరత్తు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఆర్.రామచంద్రం నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈనెల 14వ తేదీన కమిటీ సమావేశం జరగనుందని, అందులో సిలబస్, ఇతరత్రా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సిలబస్‌కు సంబంధించి, డిగ్రీ కాలేజీల్లో ఈ సిలబస్‌ను బోధించే అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన టీసీఎస్‌తో తాము ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు. ఈ కోర్సులను రాష్ట్రంలోని 50 వరకున్న అటానమస్ కాలేజీలతోపాటు, పలు ప్రభుత్వ కాలేజీలు, నాణ్యత ప్రమాణాలు పాటించే ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో తాము కోరుకున్న కోర్సును చదువుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఇంజనీరింగ్‌పై నో ఇంట్రస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. పలు కోర్సులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరడానికి నిరాసక్తత చూపుతున్నారు. ఇక ఇటు యాజమాన్యాలే కాలేజీల మూసివేత, కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకుంటుండగా, మరోవైపు తగిన వసతులు, ఫ్యాకల్టీ లేక అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు వివిధ కోర్సుల్లో సీట్లకు కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా 4 వేల నుంచి 7 వేల వరకు క్రమంగా సీట్లకు కోత పడుతోంది. దీంతో అనుబంధ గుర్తింపు లభిస్తున్న సీట్ల సంఖ్య తగ్గుతోంది. అనుమతించినా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో దాదాపు 11 వేల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఉన్నత విద్యా మండలి తేల్చిన తాజా పూర్తి స్థాయి లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్లలో 33 కాలేజీలు మూత.. ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మేనేజ్మెంట్ కోటాలో 2016 నుంచి 2018 వరకు ప్రవేశాల్లో పెద్దగా తగ్గుదల లేనప్పటికీ 2018 నుంచి 2019కి వచ్చేసరికి మాత్రం భారీగానే ప్రవేశాలు తగ్గిపోయాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కలుపుకొని 2016 సంవత్సరంలో రాష్ట్రంలోని 220 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,758 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అదే 2019 సంవత్సరం వచ్చేసరికి 187 కాలేజీల్లోని 93,790 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. అంటే నాలుగేళ్లలో 33 కాలేజీలు మూతపడగా, 10,968 సీట్లు రద్దయ్యాయి. మరోవైపు విద్యార్థులు చేరకపోవడంతో ప్రవేశాలు తగ్గిపోయాయి. 2016లో 73,686 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరగా, 2019లో 62,744 మంది మాత్రమే ఇంజనీరింగ్‌లో చేరారు. ఇందులో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా తగ్గింది. 2016లో 54,064 నుంచి 46,134కు పడిపోయింది. గడిచిన రెండేళ్ల ప్రవేశాలను పరిశీలిస్తే మాత్రం మేనేజ్మెంట్ కోటాలోనూ చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. డిమాండ్ లేని కోర్సులకు దూరం.. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే చేర్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రమాణాలు పాటించని కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. విద్యార్థులు కూడా తమ ఆలోచనను మార్చుకొని టైంపాస్ కోసం ఏదో ఓ కోర్సులో చేరాలనుకోవడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు లేకపోతే వాటిల్లో చేరేందుకే అస్సలు ఇష్టపడటం లేదని వారంటున్నారు. ఇలాంటి కారణాలతోనే ఏటా 8 నుంచి 15 వరకు కాలేజీలు మూత పడుతూనే ఉన్నాయి. ఈసారి కూడా 10 కాలేజీలు మూసివేత కోసం జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈసారి మరో 7 వేల వరకు సీట్లు తగ్గిపోవచ్చు. అయితే మార్కెట్లో డిమాండున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అవి ఇప్పటివరకు అన్ని కాలేజీల్లో లేవు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి మాత్రం జేఎన్టీయూలోని అన్ని కాలేజీల్లో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో 3 వేల వరకు సీట్లలో ఆయా కోర్సులకు అనుమతి ఇచ్చే అవకాశముంది. అయినా 2020 ప్రవేశాల్లో 4 వేల వరకు సీట్లు తగ్గే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రవేశాల్లో తగ్గుదలే తప్ప పెరుగుదల కనిపించడం లేదు. ఇంజనీరింగ్‌కు కెమిస్ట్రీ తప్పనిసరి కాదు ఇంజనీరింగ్ చదివేందుకు కెమిస్ట్రీని తప్పనిసరి సబ్జెక్టుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌లో 2021–22 విద్యా ఏడాది నుంచి అమల్లోకి తేనుంది. 2020–21 విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం ఇప్పటికే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష గత జనవరిలో జరిగినందున వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 2020–21 విద్యా ఏడాదిలో ఇది అమలు చేసే అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము 2020–21 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని ఏఐసీటీఈని కోరాయి. దీంతో ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన 2020–21 అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌లోనూ మార్పులు చేసింది. దీంతో మనరాష్ట్రంలో వేలమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తప్పిన తప్పనిసరి కెమిస్ట్రీ.. ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. వాటినే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు మెటీరియల్స్ కాంపొజిషన్‌లో మాత్రమే కెమిస్ట్రీ అవసరం అవుతుందని, అదీ ప్రాథమిక అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బీఈ/బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకునే వారికి కెమిస్ట్రీ అవసరం లేదని పేర్కొంటున్నారు. అందుకనుగుణంగానే బీఈ/ బీటెక్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివుండాలని, వాటితో పాటు కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టు/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్‌ను మూడవ సబ్జెక్టుగా చదివిన వారు కూడా అర్హులేనని అప్రూవల్ ప్రొసెస్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేసింది. దీంతో ఇంటర్లో ఎంపీసీ చదివినవారే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు పైన పేర్కొన్న సబ్జెక్టులు చదివిన వారు కూడా బీటెక్ చేసేందుకు అర్హులే. కాగా, శనివారం జరగనున్న ఎంసెట్ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నేడు ఎంసెట్ కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కమిటీ సమావేశం ఈ నెల 15న నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం ఈ సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష ఫీజు, అర్హతలకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామన్నారు. ఈనెల 19న ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకు ఫీజు రాయితీ ఇచ్చే అంశాన్ని ఖరారు చేయనున్నారు. -
24న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఈనెల 24న విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి, ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 9న విడుదల చేసింది. ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,42,210 మంది దరఖాస్తు చేసుకోగా, 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ రాసేందుకు 74,989 మంది దరఖాస్తు చేసుకోగా, 68,550 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. ప్రస్తుతం వాటిల్లో అర్హత సాధించిన విద్యార్థులంతా ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాయి. ఈ సారి 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం ఇంకా తేలకపోవడం, యాజమాన్యాలు కోర్టులో కేసు వేయడంతో ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలు విషయంలో ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంకా ఆలస్యం అయితే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈనెల 24న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి, కౌన్సెలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత వారం రోజుల సమయంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించి, సీట్లు కేటాయింపు చేపట్టాలని ఆలోచిస్తోంది. మరోవైపు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ ప్రవేశాలకు కూడా ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఈనెల 20న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఆ రెండింటి ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూలు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. -
ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ఏఐ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ప్రత్యేక బ్రాంచ్‌గా బీటెక్ ప్రోగ్రామ్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీహెచ్) ప్రారంభించింది. దేశంలో కృత్రిమ మేధస్సును బ్రాంచ్‌గా నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్‌ను అందించనున్న తొలి ఇన్స్టిట్యూట్ గా ఘనతకెక్కింది. అంతర్జాతీయంగా మూడో ఇన్స్టిట్యూట్గా నిలిచింది. ప్రస్తుతం బీటెక్ (ఏఐ) కోర్సును ఎంఐటీ (యూఎస్), కార్నెగీ మిలన్ వర్సిటీ(యూఎస్)లే అందిస్తున్నాయి. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హెచ్లో ఏఐ అందుబాటులోకి రానుంది. తొలి బ్యాచ్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధా రంగా 20 మందితో దీన్ని ప్రారంభించనున్నట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ తెలిపారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను అందించేలా ఏఐ బ్రాంచ్ కరిక్యులమ్ ను రూపొందించినట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పరిష్కారాలు ప్రస్తుతం మన దేశంలో హెల్త్‌కేర్, పంటలు, నేల నిర్వహణ, వాతావరణ అంచనాలు, భద్రత, రక్షణ వంటి విభాగాల్లో ఉపయోగపడుతున్నాయని ఐఐటీ హెచ్ఆర్ అండ్ డీ డీన్, ప్రొఫెసర్ ఎస్.చన్నప్పయ్య తెలిపారు. ఇతర బ్రాంచ్‌ల్లో బీటెక్ చేరిన అభ్యర్థులు ఏఐను మైనర్ కోర్సుగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ విభాగం లో మానవ వనరుల డిమాండ్–సప్లయ్ వ్యత్యా సం తగ్గించేలా అడుగులు వేస్తామన్నారు. -
రోజుకు 2 సెషన్లలో ‘గేట్’
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పూర్తిస్థాయి షెడ్యూలు జారీ అయింది. దేశంలోని ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో 2019–20 విద్యా సంవత్సరంలో ఎంటెక్‌లో ప్రవేశాలకు గత ఆగస్టులోనే నోటిఫికేషన్ జారీ చేసిన ఐఐటీ మద్రాసు పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూలును బుధవారం జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఐఐఎస్సీ బెంగళూరు, ఏడు ఐఐటీల నేతృత్వంలో నిర్వహించే బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించాయి. గత సెప్టెంబర్‌లోనే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఐఐటీ మద్రాస్ స్వీకరించారు. 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో గేట్‌ను నిర్వహిస్తామని వెల్లడించింది. రోజూ 2 సెషన్లుగా 4 రోజుల పాటు 24 సబ్జెక్టుల్లో గేట్ నిర్వహించనుంది. 2019లో స్టాటిస్టిక్స్ సబ్జెక్టులోనూ ప్రవేశాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షల కోసం తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్ పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులను పరీక్ష హాల్లోకి 40 నిమిషాల ముందునుంచే అనుమతిస్తారు. ఉదయం సెషన్లో 10 గంటల తర్వాత, మధ్యాహ్నం సెషన్ వారిని 3 గంటల తర్వాత అనుమతించరు. నెగటివ్ మార్కుల విధానం ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. పరీక్ష ఫలితాలు 2019 మార్చి 16న విడుదల అవుతాయి. పెరిగిన ప్రాధాన్యం.. ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తాము చేపట్టే నియామకాల్లో గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తుండటంతో తెలంగాణ నుంచి గేట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బీహెచ్ఈఎల్, గెయిల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఐవోసీఎల్, ఎన్టీపీసీ, ఎన్పీసీఐఎల్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వంటి సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. అలాగే కేంద్రం గ్రూప్–ఏ కేటగిరీలోని సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్; సీనియర్ రీసెర్చ్ ఆఫీ సర్ వంటి పోస్టులను కూడా గేట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తోంది. అయితే గేట్ నిర్వహణ సంస్థకు, ఉద్యోగ నియామకాలకు సంబంధం లేదని, అది అభ్యర్థులే చూసుకోవాలని ఐఐటీ మద్రాసు స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ కోర్సు ల్లో పరిశోధన విద్యార్థులు ఆర్థి«క సాయం పొందేందుకు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి ఇచ్చే స్కాలర్షిప్లు పొందేందుకు గేట్లో అర్హత సాధించాలి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌ను ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి మూడేళ్ల పాటు పరిగణనలోకి తీసుకుంటారు. -
సివిల్ ఇంజనీర్లకు డిమాండు తక్కువే
దేశంలో సివిల్ ఇంజనీర్ కోర్సుకు అనుకున్నంతగా డిమాండు లేదని ప్రాంగణ నియామకాల తీరు వెల్లడిస్తోంది.2012–13 నుంచి2015–16 మధ్య కాలంలో సివిల్ ఇంజనీరింగ్ పాసయిన వారిలో కేవలం 38 శాతం మందికే ఉద్యోగాలు లభించాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)గణాంకాలను బట్టి తెలుస్తోంది.దేశంలో నిర్మాణ రంగం శరవేగంతో పురోగమిస్తున్న ఈ తరుణంలో ఆ రంగానికి కీలకమైన సివిల్ ఇంజనీర్లకు డిమాండు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏఐసీటీఈ ఆమోదించిన ఆరు ఇంజనీరింగ్ కోర్సుల్లో మూడు కోర్సులకు –కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్–మాత్రమే డిమాండు ఉంది. ఆ కోర్సుల్లో ప్రాంగణ నియామకాలు 50 శాతానికి మించి ఉన్నాయి.అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్‌తో పోలిస్తే కెమికల్ ఇంజనీరింగ్‌వంటి కోర్సుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ఏఐసీటీఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2012–13 సంవత్సరంలో సివిల్ ఇంజనీరింగ్‌లో 11.98 లక్షల మంది చేరగా, వారిలో 4.64 లక్షల మంది(39శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1.74 లక్షల మంది(38శాతం)కే ఉద్యోగాలు లభించాయి. కెమికల్ ఇంజనీరింగ్‌లో 86 వేల మంది చేరితే,45 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో25వేల మందికి(55%) ఉద్యోగాలు వచ్చాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 20 లక్షల మందికిపైగా చేరారు. వీరిలో 9.40 లక్షల మంది పాసయ్యారు.4.74 లక్షల(50శాతం) మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం మీద కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లలోనే 50శాతానికిపైగా ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ సీట్లు తామరతంపరగా పెరిగిపోవడంతో కోర్సు పూర్తి చేసి బయటకొస్తున్న వారి సంఖ్య కూడ పెరుగుతోందని, అయితే, వారిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడటంతో ఉద్యోగాలు లభించడం లేదని నిపుణులు చెబుతున్నారు. -
నేనో నిరుద్యోగి.. చదివింది ఇంజనీరింగ్
► ఉద్యోగం ఇవ్వని ఇంజనీరింగ్ విద్య.. నైపుణ్యాల కొరతే ప్రధాన సమస్య ► అడ్డగోలుగా కాలేజీలు.. ప్రమాణాలు మాత్రం శూన్యం.. దేశవ్యాప్తంగా 32.88% మందికే ఉద్యోగాలు ► ఏటా ఇంజనీరింగ్ చదువుతున్న వారు 15 లక్షల పైనే.. ఉద్యోగాలు లభిస్తున్నది 4.95 లక్షల మందికే ► తెలంగాణలో 28.3% శాతం మందికే ఉద్యోగాలు.. రెండేళ్లుగా మెరుగుపడుతున్న పరిస్థితి.. అరవింద్.. వయసు 26 ఏళ్లు.. ఊరు నల్లగొండ జిల్లా తేరట్పల్లి. ఇంజనీర్ కావాలన్నది అతడి చిన్నప్పటి ఆశయం.. దానికి తగ్గట్టే బీటెక్ చదివాడు. 2012లో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.. బీటెక్ పూర్తిచేశాడు గానీ ఇంజనీర్ కావాలన్న అతడి ఆశయం మాత్రం అలాగే ఉండిపోయింది. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఓరల్లో అంతా ఇంగ్లిష్‌లోనే సమాధానమివ్వాలి.. అరవింద్ అక్కడ తడబడ్డాడు.. నేటికీ నిరుద్యోగిగానే మిగిలిపోయాడు. సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతోంది. కొరవడిన నాణ్యతా ప్రమాణాలు, సబ్జెక్టుపై పట్టులేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం వంటి కారణాలతో దాదాపు 67% మందికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు గానే మిగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 15 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ విద్య పూర్తిచేసుకుంటున్నా.. వారిలో 32.88% మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇవీ కూడా కాలేజీల యాజమాన్యాలు చెప్పిన లెక్కలే. వాస్తవంగా ఈ శాతం మరింత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తెలంగాణలో కేవలం 28.31 శాతం మందికి, ఏపీలో 27.92% మందికే ఉద్యోగావకాశాలు లభిస్తుండడం గమనార్హం. ఏఐసీటీఈ సర్వేలోనే.. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 2016–17 విద్యా సంవత్సరంలో 1,18,419 మంది ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసుకున్నారు. ఇందులో 33,529 మందికి (28.31%) మాత్రమే ఉద్యోగావకాశాలు లభించాయి. ఏపీలో గతేడాది 1,47,699 మంది ఇంజనీరింగ్ పూర్తి చేయగా.. 41,312 మందికే (27.97%) ఉద్యోగాలు వచ్చాయి. ఇవి లెక్కలు కూడా సాక్షాత్తు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్వయంగా తేల్చినవి కావడం గమనార్హం. ఎన్నో కారణాలతో.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లభించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో నైపుణ్యాల కొరత, మార్కెట్ అవసరాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇంగ్లిషు భాషా సమస్య వంటివి ప్రధానమైనవి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ఇంజ నీరింగ్ కాలేజీలు, వాటిల్లో ప్రమాణాల లేమి, మౌలిక సౌకర్యాల కొరత, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బోధన జరపకపోవడం వంటి వాటి కారణంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాల లేమి కనిపిస్తోంది. పీపుల్ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, లింక్డ్ఇన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోనే ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీబాక్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్టు (వెస్ట్) పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 5.2 లక్షల మంది అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించారు. ఇక అస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలోనూ ఇవే అంశాలు వెల్లడయ్యాయి. వీటితోపాటు పారిశ్రామిక రంగంలో, మార్కెట్లో అవసరాల కంటే ఏటా రెట్టింపు సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు రావడమూ కారణమని తేలింది. మరోవైపు మంచి నైపుణ్యం ఉన్న అభ్యర్థుల కోసం డిమాండ్ కూడా పెరుగుతుండడం గమనార్హం. మెరుగవుతున్న పరిస్థితి గత ఒకటీ రెండేళ్లుగా ఉద్యోగాలు పొందుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల శాతం స్వల్పంగా పెరిగింది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా గతేడాది ఉద్యోగాలు పొందిన వారి శాతం పెరిగింది. తెలంగాణలో 2015–16లో 26.79% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించగా... 2016– 17లో 28.31% మందికి ఉద్యోగాలు వచ్చాయి. పొరుగు రాష్ట్రం ఏపీలో 2015–16లో 25.30% మందికి ఉద్యోగాలురాగా.. 2016–17లో 27.97% మందికి లభించాయి. -
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి
-
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి
కొన్ని కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి - ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి - జేఎన్టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాల లపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే ఆశిస్తుందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. కొన్ని యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని, ఇలాంటి కళాశాలల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వసతులు, నిపు ణులు లేకపోయినా అడ్మిషన్లు తీసుకుంటున్నా యని, ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తు న్నారని అధికారులను ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ సారస్వత్‌కు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. పరిశోధనా పత్రాలు సమర్పించిన వారికి పీహెచ్డీ అవా ర్డులతో పాటు ఇంజనీరింగ్‌లో అత్యుత్తుమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. గవర్నర్ మాట్లా డుతూ... ఉన్నత విద్య ఆశయాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాలేజీలను మూసివే యించడమే ఉత్తమమన్నారు. ‘ఓ సామాన్యు డిలా అడుగుతున్నా..’ అంటూ అధ్యాపకులు, విద్యార్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఖర్చులు తగ్గించే దిశగా సాగాలి... ఒక అధ్యాపకుడు వంద మందికి గైడ్‌గా ఎలా వ్యవహరిస్తారని నరసింహన్ ప్రశ్నించారు. పీహెచ్డీ పట్టాలు ఉద్యోగుల పదోన్నతులకు పనికివస్తున్నాయేమో కానీ.. సమాజానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదన్నారు. పరి శోధనలు సమాజానికి ఉపయోగపడినప్పుడే వాటికి విలువ ఉంటుందన్నారు. దేశ జనాభా రోజురోజుకూ పెరుగుతోందని, వారి అవసరా లకు అనుగుణంగా ఆహార పంటలు పండటం లేదని, చాలా మంది తిండి లేక, తాగేందుకు నీరు లేక పస్తులుండాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య భద్రత లేదన్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే.. అక్కిడి వైద్య ఖర్చులు భరించలేని స్థాయిలో ఉన్నాయని, వైద్య ఖర్చులు తగ్గించే దిశగా తమ పరిశోధనలు చేపట్టాలని విద్యార్థు లకు సూచించారు. సోలార్ పలకలు మన దగ్గర లేకపోవడంతో వాటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, సామా న్యులకు ఈ ధరలు భారంగా మారుతున్నాయ ని, వీటి ధరలు తగ్గించే దిశగా పరిశోధనలు చేయాలన్నారు. ఐ ప్యాడ్లతో మెదడుకు ముప్పు... సాంకేతిక పరిజ్ఞానం పేరుతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రాథమిక దశలోనే ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు చేతికిస్తున్నారని, ఇది పిల్లల ఆలోచనా పరిజ్ఞానాన్ని దెబ్బతీయడమే కాకుం డా వారి మెదడు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని నరసింహన్ హెచ్చరించా రు. నీటిపారుదల ప్రాజెక్టులపై పరిశోధనలు చేయడం ద్వారా వాటి ఫలాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సాంకేతిక విద్యకు మంచి భవిష్యత్తు విద్య విద్యార్థులకు ఓ ఆయుధం. చదువు, పరిశోధనలే విద్యార్థులను ఉన్న తులుగా తీర్చిదిద్దుతాయి. సాంకేతిక విద్య కు మంచి భవిష్యత్తు ఉంది. దేశంలో 300 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతు న్నారు. 833మిలియన్ల మంది మారు మూల గ్రామాల్లోనే జీవిస్తున్నారు. 260 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి జరుగు తుంది. అయినా 42 శాతం మంది పిల్లలు పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ప్రతి వెయ్యికి 44మంది పిల్లలు చనిపోతు న్నారు. 2050 నాటికి సగం జనాభా నగరీ కరణ చెందుతుంది.వీరి అవసరాలు తీర్చా లంటే మరిన్ని పరిశోధనలు అవసరం. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- రేపే జేఈఈ మెయిన్ పరీక్ష - 8, 9 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 69,467 మంది, ఏపీ నుంచి 80 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కు నిర్వహించే పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. 9.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. హైదరాబాద్, ఖమ్మం,వరంగల్‌లలో కేంద్రాలు..: జేఈఈ పరీక్షలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో, ఏపీలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆఫ్‌లైన్ పరీక్షకు నిర్ణయించిన సమయాల్లోనే ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలకు మరో 25 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. పరీక్షలో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానినికి 4 మార్కుల చొప్పున 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో తప్పు సమాధానానికి ఒక్క మార్కు తగ్గుతుంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ ప్రధాన నిబంధనలు.. ► పేపర్–1 పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ► ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థుల తనిఖీ ఉంటుంది. ► పరీక్ష హాలులోకి మాత్రం ఉదయం 9 గంటలకు అనుమతిస్తారు. ► 9.20 గంటలకు ప్రశ్నపత్రం ఓఎంఆర్ బుక్‌లెట్‌ను ఇస్తారు. దాన్ని 9.25 గంటలకు తెరవాలి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ► 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ► హాల్‌టికెట్, గుర్తింపుకార్డు తప్ప మరేవీ అనుమతించరు. ► కాలిక్యులేటర్లు, అవి ఉండే గడియారాలు, సెల్ఫోన్లను అనుమతించరు. ► పరీక్ష బ్లూ/బ్లాక్ పెన్‌తోనే రాయాలి. పెన్సిల్‌ను అనుమతించరు. -
దేశమంతా ఒకటే ఎంట్రన్స్
ఇంజనీరింగ్ ప్రవేశాలపై ఏఐసీటీఈ చైర్మన్ సహస్రబుద్ధే ⇒ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం ⇒ ఒక్కో విద్యార్థి పది ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయాల్సిన పనిలేదు ⇒ ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘ఏకీకృత ఫీజు’ సాధ్యం కాదు ⇒ విద్యార్థులకు ‘స్వయం’ ఉపయోగపడుతుంది ⇒ ‘సాక్షి’తో సహస్రబుద్ధే ప్రత్యేక ఇంటర్వూ్య సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశానికి దేశమంతా వచ్చే ఏడాది నుంచి ఒకే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నా మని, రెండు మూడు విడతల్లో ఆ పరీక్ష నిర్వహిస్తామని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యు కేషన్(ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ దత్తాత్రేయ సహస్రబుద్ధే చెప్పారు. దేశమంతా ఒకేరకమైన ఫీజు విధానం సాధ్యం కాదన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కాలేజీలకు అనుమతి ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరి స్తున్నామని తెలిపారు. అధ్యాపకులకు శిక్షణ ఇస్తామని, శిక్షణ పూర్తిచేసిన వారే కాలేజీల్లో టీచింగ్ చేయాలనే నిబంధన తెస్తామని వెల్లడిం చారు. కాగా, దాదాపు 3 దశాబ్దాల పాటు ఐఐటీ లో బోధించిన అనుభవం సహస్రబుద్ధే సొంతం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్వహించిన ‘సృజన’ కార్యక్రమంలో పాల్గొన డానికి శుక్రవారం విజయవాడ వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వూ్య ఇచ్చారు. ప్రశ్న: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ పరీక్ష ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఒకే ఎంట్రన్స్ వల్ల ప్రయోజనం ఏమిటి? సమాధానం: వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నాం. ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశానికి చాలా పరీక్షలు నిర్వహిస్తు న్నారు. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం పొందడానికి ఒక్కో విద్యార్థి 5 పరీక్షలు రాయా ల్సి ఉంటుంది. అన్ని పరీక్షలకు ఫీజులు చెల్లిం చాలి. ఇకపై ఒకే పరీక్ష నిర్వహిస్తాం. రెండు మూడు విడతల్లో ఈ పరీక్ష నిర్వహిస్తాం. ఏ విడతలోనైనా విద్యార్థి పరీక్ష రాయవచ్చు. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికీ ఈ పరీక్షే ఉంటుందా? స: తొలి దశ పరీక్షగా ఇదే ఉంటుంది. కావాలనుకుంటే.. ఐఐటీ, ఎన్ఐటీలు అడ్వాన్స్ పరీక్ష నిర్వహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ (+2) సిలబస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. మరి ఉమ్మడి పరీక్ష వల్ల ఇబ్బందులు ఉండవా? స: కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించాలి. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఇప్పటికే ఉమ్మడి పరీక్ష ఉంది. ప్రతిపాదిత ఉమ్మడి ప్రవేశ పరీక్షతో కొత్తగా ఇబ్బందేమీ ఉండదు. రాష్ట్రాలకు సంబంధించినంత వరకు.. పరీక్ష ఉమ్మడి ఉన్నా, పోటీ మాత్రం ఆ రాష్ట్ర విద్యా ర్థుల మధ్యే ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు కనీస స్థాయిలోనే ఉంటాయి. సీబీఎస్సీ సిలబస్‌కు అనుగుణంగా రాష్ట్రాలు కూడా తమ సిలబస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారుగా! ఫీజులూ ఒకేలా ఉంటాయా? ఏకీకృత ఫీజు విధానం సాధ్యమవుతుందా? స: ఒకే రకమైన ఫీజు విధానం సాధ్యం కాదు. కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఫీజు ఉండాలి. ఉన్నత ప్రమాణాలు ఉన్న కాలేజీల్లో ఫీజు కాస్త ఎక్కువ ఉంటుంది. మిగతా కాలేజీల్లో తక్కువ ఉంటుంది. ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమా ణాలు లేవు. పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసే నైపుణ్యం లేకపోవడమే ప్రధాన సమస్యని పరిశ్రమల వర్గాలు అంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏఐసీటీఈ ఏమైనా చేస్తుందా? సమాధానం: దురదృష్టవశాత్తూ.. డిమాండ్ కంటే ఎక్కువ సంఖ్యలో కాలేజీలు ఏర్పాటయ్యాయి. కాలేజీలకు అనుమతి ఇచ్చే విషయంలో ఏఐసీటీఈ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రమాణాలు పాటించలేని, అడ్మిషన్లు తక్కువగా ఉన్న కాలేజీలను మూసేయమని మేం సూచిస్తున్నాం. నాణ్యమైన బోధనా సిబ్బంది లేకపోవడం అసలు సమస్యకు కారణం. దీన్ని అధిగమించేందుకు ఏఐసీటీఈ చేపడుతున్న చర్యలేమిటి? స: రెండు చర్యలు చేపడుతున్నాం. 1. ఎంటెక్ పూర్తి చేసి, టీచింగ్ రంగంలోకి రావాలనుకునేవారికి 2–3 నెలల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఈ శిక్షణకు హాజరై, పరీక్ష ఉత్తీర్ణులైతేనే టీచింగ్‌లోకి వెళ్లాలని నిబంధన తీసుకురానున్నాం. 2. ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ శిక్షణ పూర్తి చేయకుంటే టీచింగ్ రంగంలో కొనసాగడానికి వీలు కాని విధంగా నిబంధనలు రూపొందిం చనున్నాం. వారం క్రితం సమావేశంలో ఈ సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నాం. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుబాటులోకి తీసుకురావచ్చు కదా? స: ‘స్వయం’ అలాంటిదే. ప్రముఖ ప్రొఫెసర్లు, ఆయా రంగాల్లో నిపుణుల పాఠాలను ‘స్వయం’ ద్వారా విద్యార్థులు నేరుగా వినవచ్చు. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. గ్రామీణ విద్యార్థులకు ‘స్వయం’ ఎంతో ఉపయోపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలు ‘స్వయం’ ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ‘ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం’(సీబీసీఎస్) కేవలం కాగితాలకే పరిమితం. పూర్తిస్థాయిలో అమలుకు ఏం చేయాలి? స: ఐఐటీల్లో అనుసరిస్తున్న సీబీసీఎస్ విధానం సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అమలు చేయడం కష్టమే. కొత్త విధానానికి అలవాటుపడటానికి టైం పడుతుంది. నాణ్యత ప్రమాణాలు పెరిగితే ‘సీబీసీఎస్’ స్ఫూర్తి అమలు సాధ్యమవుతుంది. అందుకు తగిన శిక్షణ అధ్యాపకులకు ఇవ్వాలి. -
కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థల మూత
► 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం ►శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్‌లో చేరాలని ►యాజమాన్యం హుకుం ఎన్ఓసీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ► విద్యార్థుల డిమాండ్ కల్లూరు: ఇంజనీరింగ్ విద్య విభాగంలో ఒక వెలుగు వెలిగిన కొట్టం ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ విద్యా సంస్థలో సీఎస్ఈ, ఈసీఈ, ఈసీ, సీఎస్ఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సులు చదువుతున్న 350 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కొట్టం కరుణాకరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లు చిన్నటేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ కాలేజ్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కళాశాలలోని ల్యాబ్పరికరాలను యాజమాన్యం అమ్ముకుని ల్యాబ్ పరీక్షలు, ప్రయోగాలపై వారికి శిక్షణ ఇవ్వలేదు. బస్సు సౌకర్యాలను రద్దు చేయడంతో సొంత వాహనాలు,ఆర్టీసీ బస్సులద్వారా కొందరు విద్యార్థులు కాలేజ్‌కు వస్తుండగా మరికొందరు సమీప గ్రామాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అడ్మిషన్ పొందుతున్న సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తామని యాజమాన్యం చెప్పి మోసం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థలను మూసివేస్తున్న సమాచారం తమకు ఇవ్వలేదని, కేవలం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్‌లో చేరాలని యాజమాన్యం హుకుం జారీచేసిందని ఈసీఈ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాధవరెడ్డి, శశిధర్, బి.రాజశేఖర్, బి.ఈరన్న తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు గురువారం వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు ఎన్ఓసీ ధ్రువీకరణ పత్రాలు అందేలా చూడాలని కోరుతున్నారు. -
ఐఐటీలకు దీటైనవెన్నో..
గెస్ట్ కాలమ్ జేఈఈ మెయిన్ ఫలితాలు, ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో... ఐఐటీలు, అప్టిట్యూట్ టెస్ట్, ఇంజనీరింగ్ విద్య తదితర అంశాలపై ప్రొఫెసర్ సరిత్ కుమార్‌తో గెస్ట్‌కాలం.. * ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించి తాజాగా ప్రతిపాదించిన స్టాండర్డయిజ్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్య పట్ల ఉన్న వాస్తవ అభిరుచి, ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన సహజ నైపుణ్యాలను గుర్తించడం. దాంతోపాటు కోచింగ్ సంస్కృతికి స్వస్తి పలకడం. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల విద్యార్థులు కోచింగ్ ద్వారా పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఐఐటీల్లో అడుగు పెడుతున్నారు. ఐఐటీల్లో చేరాక అక్కడి వాతావరణంలో ఇమడలేక ఒత్తిడికి గురవుతున్నారు. * ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధించిన విద్యార్థులకు.. ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన బేసిక్స్‌ను పరీక్షించేందుకు సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధించిన విద్యార్థులు... కోచింగ్‌తో సంబంధం లేకుండా సింగిల్ ఎంట్రన్స్‌లో రాణించగలరని ఐఐటీ నిపుణుల కమిటీ గట్టిగా నమ్ముతోంది. * విద్యార్థుల్లో అధిక శాతం మంది గమ్యం ఐఐటీలే!కానీ ఐఐటీల్లో సీట్ల సంఖ్య పరిమితం.. పోటీ మాత్రం అపరిమితం. కాబట్టి విద్యార్థులు ముందు నుంచే ఐఐటీలకు ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిపెట్టాలి. ఐఐటీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించే ఇన్స్టిట్యూట్స్ ఎన్నో దేశంలో ఉన్నాయి. అంతేకానీ ఐఐటీలో సీటు రాలేదని కుంగిపోకూడదు. * ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు క్యాంపస్‌లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే లక్ష్యం దిశగా కృషి చేయాలి. ఇంజనీరింగ్‌లో చేరడమే విజయం కాదని.. తమ లక్ష్యం పూర్తి స్థాయిలో సాధించాలంటే నాలుగేళ్ల కోర్సులో రోజూ రాణించడం ముఖ్యమని గుర్తించాలి. ప్రాక్టికాలిటీతో పర్ఫెక్షన్ ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. బోర్డ్ సిలబస్ తరహాలో క్లాస్ రూం లెర్నింగ్‌కు, లెక్చరర్స్‌పై ఆధారపడటం అనే ఆలోచనకు స్వస్తి పలకాలి. ప్రాక్టికల్ అప్రోచ్‌ను పెంపొందించుకోవాలి. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక కాన్సెప్ట్ చెబితే దానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి. - ప్రొఫెసర్ సరిత్ కుమార్ దాస్ డైరెక్టర్, ఐఐటీ - రోపార్