కాసుల కక్కుర్తిలో నాణ్యతకు పాతర
* ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇష్టారాజ్య విధానాలు
* మొన్న ఎన్‌ఆర్ ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా పెంపు
* ఇపుడు ఎంసెట్ లేకుండానే యాజమాన్య కోటాలో ప్రవేశాలు
* ఎంసెట్‌నే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం
* యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఎంసెట్ మనుగడనే ప్రశ్నార్థకం చేసే నిర్ణయం తీసుకున్నారు. మొన్న ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సిఫారసు చేసిన అధికారులు.. తాజాగా మేనేజ్‌మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగానే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు అనుకున్నదే తడవుగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం వెనుక భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు..
ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత లేకుండాపోయింది. టాప్ కాలేజీల్లోనే ఫలితాలు 50 శాతం నుంచి 80 శాతానికి మించడం లేదు. అయినా కొన్ని ప్రముఖ కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గిన అధికారులు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను మరింత పాతాళానికి తొక్కుతున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఇపుడు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పూర్తిగా ఇంటర్మీడియెట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తే నాణ్యత మరింత దెబ్బతింటుందని, ఎంసెట్‌కు ప్రాధాన్యమే ఉండదన్న వాదనలు ఉన్నాయి.
ప్రస్తుతం అనేక నిబంధనలు ఉన్నప్పుడే మేనేజ్‌మెంట్ కోటా సీట్లను బేరం పెడుతున్న ప్రముఖ కాలేజీలకు ఇక ఇంటర్మీడియెట్ మెరిట్‌తోనే యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అవకాశం ఇస్తే.. సీట్లను మరింత అడ్డగోలుగా అమ్ముకుంటారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆలోచనలతోనే ముందుకొచ్చిన కొన్ని ప్రముఖ కాలేజీల యాజమాన్యాల ముడుపుల బాగోతం, ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో పక్కా విధానం అనుసరించాలన్న కోర్టు ఆదేశాల పేరుతో యాజమాన్య అనుకూల విధానాలు తీసుకువస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా పెంపులో మరో కుట్ర
ప్రస్తుతం ఐదు శాతం ఉన్న ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచడం ద్వారా సీట్లు అమ్ముకునేందుకు యాజమాన్యాలకు మరింత అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 705 ఇంజనీరింగ్ కాలేజీల్లోనే 3,06,925 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తోంది. మరో ఐదు శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాలో భర్తీకి, 25 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేసేలా గతేడాది చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి. దీంతో యాజమాన్యాలతో సమావేశమైన ఉన్నత విద్యామండలి యాజమాన్యాల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటాను 15 శాతానికి పెంచాలని నిర్ణయించి ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
జూన్ 9న ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రాతపరీక్ష ఫలితాలు జూన్ 9న ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో మే 17న నిర్వహించాల్సిన ఎంసెట్ రాతపరీక్షను అదే నెల 22వ తేదీకి వాయిదా వేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎంసెట్ కమిటీ ప్రిలిమినరీ కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ఫలితాల వెల్లడి తేదీలనూ మార్పు చేసిందని ఎంసెట్-2014 కన్వీనర్ రమణారావు శుక్రవారం వెల్లడించారు. తొలుత మే 19న ప్రాథమిక కీ విడుదల చేసి, 26వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని, జూన్ 2న ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించారు. అయితే పరీక్ష తేదీ మారడంతో మే 24న ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను మే 31 వరకు స్వీకరిస్తారు. జూన్ 9నఎంసెట్ ఫలితాలు, ర్యాంకులను వెల్లడిస్తారు.