ఇంజనీరింగ్‌ విద్యలో భారీ మార్పులు | Telangana: Huge changes are going to happen in Engineering Education | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యలో భారీ మార్పులు

Oct 19 2022 2:46 AM | Updated on Oct 19 2022 2:46 AM

Telangana: Huge changes are going to happen in Engineering Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తేవాలనుకుంటున్న ఈ బోధనా విధానం ప్రకారం ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలోనే ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే మార్కులు ఇస్తారు. అలాగే ఆఖరి సంవత్సరంలో మరో ప్రాజెక్టు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. అది కూడా సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాలనే షరతు పెట్టనున్నారు. 

ఎందుకీ మార్పు...? 
ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో 12 శాతం మంది మాత్రమే స్కిల్డ్‌ జాబ్స్‌ పొందుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సర్వేలో ఇది స్పష్టమైంది. కంప్యూటర్‌ సైన్స్‌లో కనీసం కోడింగ్‌ కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో వెల్లడైంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళిక లేదని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని నిపు­ణులు అంటున్నారు.

కోవిడ్‌ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టుల కోసం స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బోధన స్థాయిలోనూ పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని ఏఐసీటీఈ సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొంతకాలంగా సరికొత్త బోధన ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడది ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నత విద్యా­మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలి­పారు. నాణ్యమైన విద్య, తక్షణ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్నత విద్యలో మార్పులతోపాటు ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.

సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం
ఇంజనీరింగ్‌ విద్యలో ఫీల్డ్‌ అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే దీని భాగస్వామ్యాన్ని పెంచనున్నాం. నవీన దృక్పథంతో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే ఇంటర్నల్‌ మార్కులను 20 నుంచి 40కి పెంచాం. ఎక్స్‌టర్నల్స్‌ 60 మార్కులకు ఉండేలా మార్పులు చేశాం. ఇంజనీరింగ్‌ రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్‌ చేయడం, సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ తీసుకురావడాన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఇవన్నీ ఇంజనీరింగ్‌ విద్య నాణ్యతను పెంచుతాయని, మార్కెట్లో మంచి నిపుణులుగా విద్యార్థులను నిలబెడతాయని ఆశిస్తున్నాం. 
– ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement