సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య ఈ ఏడాది నుంచి సరికొత్తగా ఉండబోతోంది. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అన్ని కాలేజీలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. విశ్వవిద్యాలయాలు సైతం ఇప్పటికే బోధన ప్రణాళిక తీరు తెన్నులను కాలేజీలకు పంపాయి. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా స్వీయ అనుభవంతో బోధన ఉండబోతోందని యూనివర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి.
మార్కెట్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విజ్ఞానం అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలని అంటున్నాయి. ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు నాలుగో సంవత్సరంలో కాకుండా ముందు నుంచే విద్యార్థులపై దృష్టి పెట్టబోతున్నాయి. వారిలో నైపుణ్యానికి పదును పెట్టే రీతిలో ప్రాజెక్టు వర్క్స్‌ను ఎంపిక చేసినట్టు కొన్ని కాలేజీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు తెలిపాయి.
రెండో ఏడాది నుంచే...
అన్ని బ్రాంచీల విద్యార్థులకు మొదటి సంవత్సరం పుస్తక విషయ పరిజ్ఞానం ఆధారంగానే కొనసాగుతుంది. రెండో ఏడాది నుంచి ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నాల్గవ సంవత్సరంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉండేది. అదికూడా విద్యార్థులు ఇష్టానుసారం ఏదో ఒక ప్రాజెక్టు సమర్పించేవాళ్లు. ఈ క్రమంలో విద్యార్థులు ఎవరో తయారు చేసిన ప్రాజెక్టులను కొని తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది.
దీనివల్ల విద్యార్థికి డిగ్రీ చేతికొచ్చినా విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండేది కాదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు రిపోర్టులను పక్కాగా తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన ప్రముఖ కంపెనీలకు సెకండియర్ విద్యార్థి వెళ్లాలి.
అక్కడి నిపుణులతో మమేకమై సరికొత్త టెక్నాలజీపై ఆలోచన చేయాలి. విద్యార్థిలో విషయ పరిజ్ఞానం ఉందని, ప్రాజెక్టు రిపోర్టు సరికొత్తదేనని సంబంధిత సంస్థలు ధ్రువీకరించాలి. అప్పుడే ప్రాజెక్టు రిపోర్టును విశ్వవిద్యాలయాలు ఆమోదిస్తాయి. ఇదేవిధంగా నాల్గో సంవత్సరంలోనూ మరింత లోతైన అవగాహనతో ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి సంపూర్ణమైన స్వీయ పరిజ్ఞానం పొందుతాడని విశ్వవిద్యాలయాలు భావిస్తున్నాయి.
కంప్యూటర్ కోర్సులపై దృష్టి
రాష్ట్రంలో 90 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరగా, ఇందులో 64 శాతం కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీలకు చెందిన వారున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇంజనీరింగ్ విద్యలో కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకోవడం ఇప్పటివరకూ జరిగింది. ఇక నుంచి తొలి ఏడాదిలోనే అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న కోడింగ్ విధానంపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల అనుసంధానంతో కంప్యూటర్ కోర్సుల్లో లోతైన ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుపరిచే దిశగా ఈ ఏడాది నుంచి బోధన ప్రణాళిక ఉండబోతోందని వర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. కోడింగ్‌పై సరైన అవగాహన ఉందనేది ప్రాజెక్టు రిపోర్టుల ద్వారా విద్యార్థి నిరూపించుకోవాలి.
ప్రాజెక్టు రిపోర్టులే కీలకం
ఈ ఏడాది నుంచి సెకండియర్‌లో ప్రాజెక్టు నివేదికలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనివల్ల విద్యార్థి నాణ్యమైన ఇంజనీర్‌గా బయటకొచ్చే వీలుంది. ఎంతోమంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నా, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకే మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. ఆ దిశగానే సరికొత్త బోధన ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాం.
– ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్‌టీయూ వీసీ
Comments
Please login to add a commentAdd a comment