ఇంజనీరింగ్‌ విద్య పల్లెకు దూరం | Engineering Colleges Closed In Telangana Villages | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్య పల్లెకు దూరం

Published Sun, Jul 31 2022 12:52 AM | Last Updated on Sun, Jul 31 2022 12:52 AM

Engineering Colleges Closed In Telangana Villages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ చేయాలంటే ఇక రాజధానికే చేరాలా? సొంతూళ్లలో ఉండి చదువుకోవడం సాధ్యం కాదా? సాంకేతిక విద్యారంగ నిపుణులు లేవనెత్తే సందేహాలివి. నిజమే! ఇంజనీరింగ్‌ కాలేజీలు శరవేగంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు మాత్రమే పోటీ ప్రపంచంలో పడుతూ లేస్తూ నిలబడుతున్నాయి.

రాష్ట్రంలో 2014లో 249 ఇంజనీరింగ్‌ కాలేజీలుంటే, ఇప్పుడు వీటి సంఖ్య 175కు తగ్గింది. అంటే 2014 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లలో 74 కాలేజీలు మూతపడ్డాయి. ఇందులో 54 కళాశాలలు గ్రామీణ ప్రాంతాలకు చేరువలో జిల్లా కేంద్రంలో ఉండేవే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కాలేజీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కాలేజీల మనుగడే కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన బ్రాంచీల్లోనే పూర్తిగా సీట్లు నిండని కళాశాలలు 15 వరకూ జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనూ కొన్ని కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి.  

హైదరాబాద్‌ బాట పట్టడం వల్లేనా?: టెన్త్‌ వరకూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నా... తర్వాత హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో హాస్టల్లో ఉండి ఇంటర్‌ చదివేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్‌ సహా పలు పోటీ పరీక్షలకు రాజధానిలో కోచింగ్‌ తీసుకోవడం తేలికని భావిస్తున్నారు. ఇంజనీరింగ్‌ తర్వాత ఉపాధే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీంతో అవసరమైన అనుబంధ కోర్సులు చేసేందుకు హైదరాబాద్‌లోనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. పలు కంపెనీలు క్యాంపస్‌ నియామకాలను హైదరాబాద్‌ పరిసర కాలేజీల్లోనే నిర్వహిస్తున్నాయనే ప్రచారం ఉంది.  

కంప్యూటర్‌ కోర్సులూ కారణమే.. 
గత ఐదేళ్లుగా సంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సుల కన్నా, కంప్యూటర్‌ సైన్స్, కొత్తగా వచ్చిన దాని అనుబంధ కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. గత ఏడాది సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో 38,796 సీట్లు ఉంటే, 37,073 సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో 13,935 సీట్లకు 12,308 సీట్లు, సివిల్‌లో 6 వేల సీట్లకు 3 వేలే భర్తీ అయ్యాయి. ఈఈఈలో ఉన్న 7 వేల సీట్లల్లో 4 వేలు, మెకానికల్‌లో 5,800 సీట్లుంటే 2,550 మాత్రమే భర్తీ అయ్యాయి.

దీన్నిబట్టి చూస్తే.. సివిల్, మెకానికల్‌లో చేరే వారి సంఖ్య తగ్గింది. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులను నిర్వహించడం గ్రామీణ కాలేజీలకు సాధ్యం కావడం లేదు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 48 కాలేజీలుంటే, ఇప్పుడు 11కు పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మి గిలాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11లో రెండు మాత్రమే ఉన్నాయి. ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది.  

నిర్వహణ కష్టం.. 
కాలానుగుణంగా వస్తున్న మార్పులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలకు నిర్వహణ కష్టంగానే ఉంది. మంచి ఫ్యాకల్టీ హైదరాబాద్‌ విడిచి వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో భవిష్యత్‌ ప్రయోజనాల కోసం విద్యార్థులు ఇంజనీరింగ్‌ విద్యకు హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. ఇది గ్రామీణ ఇంజనీరింగ్‌ కాలేజీలకు గడ్డు పరిస్థితి తెస్తోంది. 
–ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, వీసీ, జేఎన్‌టీయూహెచ్‌ 

క్షేత్రస్థాయిలో మార్పులు అవసరం
గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్‌ విద్యలో నాణ్యత పెంచాలి. సంప్రదాయ సివిల్, మెకానికల్‌ కోర్సులకు ఆధునిక సాంకేతికత జోడించి కొత్తదనం వచ్చేలా చూడాలి. వీటితో ఉపాధి ఉంటుందనే నమ్మకం కలిగించాలి. లేకపోతే ఇంజనీరింగ్‌ విద్య మరింత భారమయ్యే అవకాశం ఉంది.  
–అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement