అర్హతలున్నాయి... అవగాహనే లేదు  | Telangana Colleges Focus On Expanding NAAC Recognition | Sakshi
Sakshi News home page

అర్హతలున్నాయి... అవగాహనే లేదు 

Published Sun, Feb 27 2022 4:15 AM | Last Updated on Sun, Feb 27 2022 4:02 PM

Telangana Colleges Focus On Expanding NAAC Recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపును తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల డేటాను తెప్పించినట్టు, కొన్నింటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో చాలా కాలేజీలకు న్యాక్‌ గుర్తింపు పొందగల అర్హతలున్నాయని, అయితే సరైన అవగాహన లేకపోవడంతో ఇందుకోసం దరఖాస్తు చేయలేదని అంటున్నారు. ఫలితంగా న్యాక్‌ గుర్తింపు కలిగిన కళాశాలల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశంలో న్యాక్‌ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో ఇది 11 శాతానికే పరిమితమైంది.

కాలేజీల్లో ఉన్నత విద్య ప్రమాణాల స్థాయిని న్యాక్‌ గుర్తింపు తెలియజేస్తుంది. చాలా కాలేజీలు న్యాక్‌ గుర్తింపును అదనపు అర్హతగా భావించడంతో ఈ మేరకు ప్రచారం సైతం చేసుకుంటాయి. ఈ కళాశాలల శాతం ఎంత పెరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు అంత ఎక్కువగా ఉన్నట్టన్న మాట. 

ప్రమాణాలున్నా.. ప్రయత్నమే లేదు 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,976 ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో కేవలం 141 మాత్రమే న్యాక్‌ గుర్తింపు కలిగి ఉండటం గమనార్హం. ఇందులో 35 ప్రభుత్వ సంస్థలు, 19 ఎయిడెడ్, 87 ప్రైవేటు సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 యూనివర్శిటీలకు గాను న్యాక్‌ గుర్తింపు ఉన్నవి పదే. శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సహా కొన్ని ఇప్పటికీ న్యాక్‌ గుర్తింపు పొందలేదు.

ఈ పరిస్థితులపై ఉన్నత విద్య మండలి ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దాదాపు వందకుపైగా డిగ్రీ కాలేజీలు న్యాక్‌ గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించాయి. సొంత భవనాలు, నాణ్యతతో కూడిన బోధన అందించగల ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, పటిష్టమైన బోధన విధానాలు, లైబ్రరీ సదుపాయాలు, కచ్చితమైన నిర్వహణ వ్యవస్థ వీటికి ఉన్నాయి.

కొన్నేళ్ళుగా అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఈ కాలేజీ విద్యార్థుల శాతం మెరుగ్గా కన్పిస్తోంది. ఇలా న్యాక్‌ గుర్తింపునకు అవసరమైన అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయా సంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. వాస్తవానికి విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలనుకున్నప్పుడు న్యాక్‌ గుర్తింపు ఉందా లేదా అని చూస్తారు.

అలాగే దేశ, విదేశీ విద్యా సంస్థలు విద్యార్థుల చేరికల సమయంలో సదరు కాలేజీకి న్యాక్‌ గుర్తింపు ఉందా లేదా అని చూస్తాయి. అలాగే క్రమబద్ధమైన పర్యవేక్షణ, ప్రమాణాలు కొనసాగించేలా ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలన్నిటిపై అవగాహన లేక, ‘నడుస్తోంది కదా..చూద్దాంలే’అన్న నిర్లిప్త ధోరణిలో చాలా కాలేజీలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

దరఖాస్తు చేసేలా కార్యాచరణ 
ఈ నేపథ్యంలోనే న్యాక్‌ గుర్తింపు కలిగిన కాలేజీలు, వర్సిటీల పెంపు కోసం ఉన్నత విద్యామండలి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత.. ఇప్పటికే గుర్తింపు పొందిన 141 కాలేజీల్లో 81 కాలేజీలు న్యాక్‌ గుర్తింపును రెన్యువల్‌ చేయించుకునే దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 72, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 వరకూ ఉన్నాయి.

ఆ తర్వాత మౌలిక వసతులు, ఫ్యాకల్టీ పాటు, అన్ని అర్హతలున్న వందకుపైగా కాలేజీల చేత దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. దీని తర్వాత ప్రమాణాలు పెంచుకుని, న్యాక్‌ గుర్తింపునకు అర్హత సాధించే దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తారు. ఇక ఏమాత్రం ప్రమాణాలు లేని, విద్యార్థుల చేరికలు లేని కోర్సులు, కాలేజీల మూసివేత దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. న్యాక్‌ గుర్తింపు పొందేలా ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరపాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement