‘న్యాక్‌’కు దూరంగా కాలేజీలు! | Telangana Govt Focus On Raising Education Standards | Sakshi
Sakshi News home page

‘న్యాక్‌’కు దూరంగా కాలేజీలు!

May 29 2022 2:51 AM | Updated on May 29 2022 8:21 AM

Telangana Govt Focus On Raising Education Standards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఉన్నత విద్యా ప్రమాణాలకు కొలమానమైన ‘నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌)’గుర్తింపును అన్ని కాలేజీలకు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేస్తోంది.

న్యాక్‌ గుర్తింపు లేని కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాక్‌ గుర్తింపు ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల జాబితా పెంచాలని ఉన్నత విద్యామండలి ప్రయ త్నం చేస్తున్నా పెద్దగా స్పందన కన్పించడం లేదు.  

సదస్సుకు కూడా రాకుండా.. 
న్యాక్‌ బెంగళూరు కేంద్రం ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు అవగాహన కల్పించాలని ఉన్నత విద్య మండలి భావించింది. దీనిపై ఈ నెల 20న సదస్సు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు న్యాక్‌ గుర్తింపు ఏమోగానీ, కనీసం సదస్సులో పాల్గొనేందుకు కూడా విముఖత చూపినట్టు తెలిసింది. అనుకున్న మేర కాలేజీలు పాల్గొనేందుకు సుముఖత చూపకపోవడంతో న్యాక్‌ ప్రధాన కార్యాలయం ఆధికారులు సదస్సును వాయిదా వేశారు. 

నజరానా ఇస్తామన్నా.. 
న్యాక్‌ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలకు రూ.లక్షల్లో నజరానా ఇస్తామని కూడా ఉన్నత విద్యా మండలి గతంలో ప్రకటించింది. అయినా ఒక్క కాలేజీ కూడా ముందుకు రాలేదు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలంటే ప్రమాణాలు పెంచుకోక తప్పదు. అంతగా ఆదాయం లేని తాము ప్రమాణాల కోసం ఎందుకు ఖర్చు చేయాలనే ఆలోచనతో అవి వెనుకడుగు వేస్తున్నాయి. 

 ‘న్యాక్‌’ గ్రేడ్‌ ఉంటే విలువ 
దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేసేందుకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌)ను అమల్లోకి తెచ్చారు. వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఏర్పడే న్యాక్‌ కమిటీల ఆధ్వర్యంలో విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు. న్యాక్‌ ప్రధానంగా ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమమైన ప్రమాణాల అమలు తదితర అంశాలను పరిశీలించి.. సదరు కాలేజీలు, యూనివర్సిటీలకు మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. ఈ గ్రేడ్ల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందే అవకాశం కూడా ఉంటుంది.  

గుర్తింపు తప్పనిసరి అవ్వొచ్చు 
ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు న్యాక్‌ గుర్తింపు ఉంటేనే ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాయి. కాకపోతే ఇది అమలు చేయడానికి కొంత సమయం ఇచ్చాయి. రాష్ట్రంలోనూ న్యాక్‌ గుర్తింపు కోసం ఉన్నత విద్యా మండలి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాలేజీలను ప్రోత్సహించి, చేయూతనివ్వాలని చూస్తోంది. ఈ ప్రక్రియను భవిష్యత్‌లో మరింత ముందుకు తీసుకెళ్తాం. న్యాక్‌ గుర్తింపు పొందడం తప్పనిసరి కావొచ్చు కూడా.. 
– వి.వెంకటరమణ, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement