2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్‌ గుర్తింపు!  | Naac recognition for all colleges by 2024 Andhra Pradesh | Sakshi
Sakshi News home page

2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్‌ గుర్తింపు! 

Published Mon, Nov 28 2022 4:58 AM | Last Updated on Mon, Nov 28 2022 3:37 PM

Naac recognition for all colleges by 2024 Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు చేపట్టింది. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) గుర్తింపును తప్పనిసరి చేసింది. నాక్‌తో పాటు ఇంటర్నేషనల్‌ ర్యాంకింగ్స్‌లోనూ రాష్ట్ర విద్యాసంస్థలు స్థానం సంపాదించేలా చర్యలు చేపట్టింది.  

కాలేజీలకు నాక్‌ గుర్తింపు రావడంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ప్రత్యేకంగా క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయించింది. దీని ద్వారా అన్ని కాలేజీలు నాక్‌ ‘ఎ’ గ్రేడ్‌తో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టింది. క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌లో వర్సిటీలు, స్వయంప్రతిపత్తి పొందిన కాలేజీలు, పరిశ్రమల ప్రముఖులతోపాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ సెల్‌ ద్వారా ఇప్పటికే కాలేజీలు నాక్‌ గుర్తింపు సాధించేలా మార్గనిర్దేశం చేస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు, నాక్‌ గుర్తింపునకు అవసరమైన వనరుల కల్పన, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌కు అవసరమయ్యే అంశాల్లో కాలేజీలను ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్వాలిటీ లీడర్లుగా 164 ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు, వర్సిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కాలేజీలు నాక్‌ గుర్తింపు సాధించేలా సహకారం అందిస్తున్నారు.  

ప్రమాణాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం.. 
తొలి అడుగుగా నాక్‌ ‘బీ’ కేటగిరీలో ఉన్న కాలేజీలను గుర్తించి.. వాటి ద్వారా అసలు నాక్‌ గుర్తింపు లేని కాలేజీలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే 72 నాక్‌ గుర్తింపు ఉన్న కాలేజీలను, 13 వర్సిటీలను గుర్తించి వాటిని క్యూ (క్వాలిటీ) మెంటార్లుగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 117 కాలేజీలను కూడా క్వాలిటీ మెంటార్లుగా గుర్తించి 346 కాలేజీలు నాక్‌ గుర్తింపు సాధించేలా వాటిని అనుసంధానించారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాములు, శిక్షణ, ఈ–కంటెంట్‌ ప్రిపరేషన్‌ తదితర అంశాల్లో ఆయా కాలేజీలకు సహాయమందిస్తున్నారు.  

ఉద్యోగాలు కొల్లగొట్టేలా ఉచిత శిక్షణ.. 
ప్రభుత్వం అన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యార్థులకు సర్టిఫికేషన్‌ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్న్‌షిప్‌ కోసం కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్‌ వంటి సంస్థల ద్వారా లక్ష మందికి వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌నకు చర్యలు చేపట్టారు. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్‌వైస్, హీరో, హోండా, మారుతి సుజికీ వంటి సంస్థల్లో ఫుల్‌స్టేక్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాల్లో 50 వేల మందికి వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement