సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అత్యంత కీలకమైనవి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన పథకాలే. ఇవి అమలు చేయాలంటే సదరు కాలేజీ తప్పకుండా ఈపాస్ వెబ్ పోర్టల్‌లో ధ్రువీకరణ చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత కాలేజీల యాజమాన్యాలు ఈపాస్ పోర్టల్‌లో కాలేజీ గుర్తింపు పత్రాలు, ఏటా సంబంధిత బోర్డు/ యూనివర్సిటీ ద్వారా పొందిన అఫిలియేషన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
వాటిని పరిశీలించిన అధికారులు సదరు కాలేజీని ధృవీకరించి అందులో చదువుతున్న విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను వర్తింపజేస్తారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,833 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలుండగా.. వీటిలో ఇప్పటి వరకు పోర్టల్‌లో సంక్షేమాధికారులు ధ్రువీకరించిన కాలేజీలు 2,843 మాత్రమే. ధృవీకరణ పొందిన వాటిలో 2,626 జూనియర్ కాలేజీలుండగా.. మరో 150 ఐటీఐలున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీల కేటగిరీలో ఇప్పటివరకు ధ్రువీకరణ పొందినవి కేవలం 67 కాలేజీలు మాత్రమే ఉండడం గమనార్హం.
జాప్యం ప్రభావం విద్యార్థులపైనే...
కాలేజీ యాజమాన్యాలు ఈపాస్‌లో ధ్రువీకరణ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. కానీ చాలా కాలేజీలు ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు మొక్కుబడిగా ఈపాస్ పోర్టల్‌లో వివరాలు సమర్పించి చేతులు దులుపుకుంటున్నాయి. అఫిలియేషన్, గుర్తింపు పత్రాలను పూర్తిస్థాయిలో అప్‌లోడ్ చేయకుండానే సబ్మిట్ చేస్తున్నట్లు సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో పూర్తిస్థాయి పత్రాలు సమర్పించిన కాలేజీలను మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు వెబ్‌సైట్‌లో ధ్రువీకరణ పొందగా... డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు మాత్రం అత్యంత వెనుకబడ్డాయి.
►డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 117 కాలేజీలుండగా... వీటిలో కేవలం రెండు కాలేజీలు మాత్రమే పోర్టల్‌లో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి.
►జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలో 200 కాలేజీల్లో ఒక్క కాలేజీ కూడా పోర్టల్‌లో కన్ఫర్మ్ కాలేదు.
►డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 30 కాలేజీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో 111 కాలేజీలు, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 99 కాలేజీలు, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 115 కాలేజీలు, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 79 కాలేజీలు, టీఎస్ పారామెడికల్ బోర్డు పరిధిలో 142 కాలేజీలుండగా వీటిలో ఇప్పటివరకు ఒక్క కాలేజీకి కూడా ధ్రువీకరణ దక్కలేదు.
►ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 535 కాలేజీలుండగా... కేవలం 8 కాలేజీలు మాత్రమే పోర్టల్‌లో కన్ఫర్మ్ అయ్యాయి.
►కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో 115 కాలేజీలుండగా... ఒక్క కాలేజీ మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది.
►డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో 215 ఐటీఐల్లో 150 ఖరారు కాగా మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment