ప్రత్యేకం.. ప్రాక్టీస్ స్కూల్స్
ప్రైవేటు రంగంలో ఇంజనీరింగ్ విద్య అంటే ఠక్కున గుర్తొచ్చేది.. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - పిలానీ. హైదరాబాద్, గోవా, పిలానీ (రాజస్థాన్), దుబాయ్‌ల్లో క్యాంపస్‌లు కలిగిన బిట్స్.. ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ విద్యకు, పరిశోధనలకు పెట్టింది పేరు. బిట్స్ పిలానీ - గోవా క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఈ (ఆనర్స్) నాలుగో ఏడాది చదువుతున్నారు హైదరాబాద్‌కు చెందిన దీపక్. తన క్యాంపస్ విశేషాలను మనతో పంచుకుంటున్నారిలా..
యాంటీ ర్యాగింగ్ అఫిడివిట్ ఇవ్వాలి
మాది హైదరాబాద్. అమ్మా, నాన్న ఇద్దరూ ఉద్యోగులే. అన్నయ్య ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. చెల్లెలు జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ చదువుతోంది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 92 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 94 శాతం మార్కులు వచ్చాయి. బిట్‌శాట్‌లో ర్యాంకు సాధించి బిట్స్ పిలానీ - గోవా క్యాంపస్‌లో చేరాను.క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. విద్యార్థులంతా ఇన్‌స్టిట్యూట్‌లో చేరేటప్పుడే యాంటీ ర్యాగింగ్ అఫిడివిట్ ఇవ్వాలి. విద్యార్థులందరూ చాలా స్నేహంగా ఉంటారు.
క్యాంపస్ సదుపాయాలెన్నో
180 ఎకరాల్లో విస్తరించిన క్యాంపస్‌లో ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ కేటాయిస్తారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. కామన్ రూమ్‌లో భాగంగా టీవీ, పత్రికలు, మ్యాగజైన్లు ఉంటాయి. వార్డెన్‌గా ఒక ప్రొఫెసర్‌ను నియమిస్తారు. స్టడీస్ పరంగా ఎదురయ్యే సందేహాలను వీరిని అడగొచ్చు. తరగతి గదులు, లైబ్రరీ, లేబొరేటరీలు, షాపింగ్ కాంప్లెక్స్ అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయి. క్యాంటీన్‌లో అన్ని రకాల టిఫిన్స్ లభిస్తాయి. భోజనం రుచికరంగా ఉంటుంది. అన్ని ఫీజులు కలుపుకుని సెమిస్టర్‌కు రూ.80,000 వరకు ఖర్చు అవుతుంది. సెమిస్టర్ పరీక్షల్లో 9.0 సీజీపీఏ సాధించినవారికి మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. ఇవేకాకుండా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తారు.
వినూత్న బోధన
ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉన్న సమయంలో విద్యార్థులు ఎంచుకున్న ఎలెక్టివ్స్/స్పెషలైజేషన్‌ను బట్టి క్లాసులుంటాయి. ఒక్కో పీరియడ్ 50 నిమిషాలు ఉంటుంది. ఒక రోజు పీరియడ్‌లో సంబంధిత అంశంపై లెక్చర్ ఉంటే.. మరుసటి రోజు ట్యుటోరియల్.. ఆ తర్వాత రోజు ప్రాక్టికల్స్ ఉంటాయి. లెక్చర్‌లో భాగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో కూడిన బోధన ఉంటుంది. ట్యుటోరియల్‌లో ముందు రోజు చెప్పిన పాఠాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌లో టెస్ట్-1, టెస్ట్-2, కాంప్రహెన్సివ్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (సీజీపీఏ) విధానంలో మార్కులు కేటాయిస్తారు. నేను ఇప్పటివరకు 10 పాయింట్లకు 7.5 సీజీపీఏ సాధించాను. ఆన్‌లైన్‌లో కోర్సులు అందించే ఎడెక్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులను కూడా పూర్తి చేశాను.
నైపుణ్యాలు పెంచే ప్రాక్టీస్ స్కూల్స్
సెకండియర్ వేసవి సెలవుల్లో ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామింగ్-1 (వ్యవధి రెండు నెలలు), నాలుగో ఏడాదిలో ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామింగ్-2 (వ్యవధి ఆరు నెలలు) చేయాలి. ప్రాక్టీస్ స్కూల్స్‌లో భాగంగా క్విజ్, డిబేట్, గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వంటివి ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరిన తర్వాత ఎదురయ్యే వివిధ అంశాలపై వీటిల్లో శిక్షణనిస్తారు. వీటి ద్వారా ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ పెరుగుతుంది. నేను ప్రస్తుతం ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ పొంది ఇండస్ట్రీ ఆర్క్ అనే కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను.
ఇంజనీరింగ్‌తోపాటు హ్యుమానిటీస్ కూడా
ఇంజనీరింగ్ మొదటి ఏడాది అందరికీ కామన్‌గా ఉంటుంది. రెండో ఏడాది నుంచి ఎన్నో ఎలక్టివ్‌స అందుబాటులో ఉంటాయి. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో భాగంగా మూడు హ్యుమానిటీస్ సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. మ్యూజిక్, పబ్లిక్ స్పీకింగ్, భగవద్గీత, సైకాలజీ, మోరల్ పొలిటికల్ కాన్సెప్ట్స్ వంటి ఎన్నో ఎలక్టివ్స్ ఉంటాయి. నేను ఫిలాసఫీ, కాంటెంపరరీ ఇండియా, మోరల్ పొలిటికల్ కాన్సెప్ట్స్, ఎసెర్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఎంచుకున్నాను. వీటివల్ల నాలో బ్రాడ్ థింకింగ్ పెరిగింది. పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకున్నాను.
తెలుగు సమితిని ఏర్పాటు చేశాం
క్యాంపస్‌లో వ ందకుపైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. అందరం కలిసి తెలుగు సమితిని ఏర్పాటు చేసుకున్నాం. క్యాంపస్‌లో ఉగాది, విజయదశమి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, దీపావళి వంటి పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. క్యాంపస్‌లో తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మేము బాగా చేసే పండుగ.. ఉగాది. ఆ రోజు ఉగాది పచ్చడి తయారుచేసి అందరికీ పంచుతాం. వంటవాళ్లను రప్పించి, ఆంధ్రా స్పెషల్ వంటకాలను వండించి విందు చేసుకుంటాం.
అకడమిక్‌తోపాటు మరెన్నో
క్యాంపస్‌లో అకడమిక్‌తోపాటు కల్చరల్ యాక్టివిటీస్‌కు పెద్దపీట వేస్తారు. డ్రామా క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫొటోగ్రఫీ క్లబ్, ఆస్ట్రానమీ క్లబ్ ఉన్నాయి. ప్రతిఏటా కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్‌లను కూడా నిర్వహిస్తారు. వీటిని విద్యార్థులే ఆర్గనైజ్ చేస్తారు. నేను ఒక క్లబ్‌లో సభ్యుడిగా ఉన్నాను. దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకున్నాను.
స్టార్టప్స్‌కు ప్రోత్సాహం
క్యాంపస్‌లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్, సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూరియల్ లీడర్‌షిప్ ఉన్నాయి. కొత్తగా స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఇక్కడ గెడైన్స్, సూచనలు, సలహాలు అందిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కోసం కంపెనీలు, పరిశ్రమలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ కోసం స్థలం కేటాయిస్తారు. ఫ్యాక్స్, ఫోన్, ప్రింటర్, లైబ్రరీ, ఇంటర్‌నెట్, స్కానర్, టెలికాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పిస్తారు.
గేట్‌కు దరఖాస్తు చేశా
వీలు దొరికినప్పుడల్లా గోవా బీచ్‌ల్లో విహరిస్తుంటాం. ఇక్కడ ఎన్నో చూడచక్కని బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం గేట్‌కు దరఖాస్తు చేశాను. మంచి ర్యాంకు సాధించి ఏదో ఒక ఐఐటీలో ఎంటెక్ చేస్తాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఆఫర్ వస్తే ఉద్యోగం చేయడానికి సిద్ధమే.