విద్యార్థి.. ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దుకోవాలి!! | Mahindra École Centrale | Sakshi
Sakshi News home page

విద్యార్థి.. ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దుకోవాలి!!

Published Mon, Jul 14 2014 12:12 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

విద్యార్థి..  ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దుకోవాలి!! - Sakshi

విద్యార్థి.. ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దుకోవాలి!!

గెస్ట్ కాలమ్
‘ఇంజనీరింగ్ విద్యలో పరిశోధనలకు, ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్‌కు ప్రాధాన్యమివ్వాలి.ఇది బ్యాచిలర్‌‌స డిగ్రీ స్థాయి నుంచే మొదలు కావాలి. అప్పుడే విద్యార్థులు కోర్సు పూర్తయ్యేనాటికి పరిపూర్ణత సాధించగలరు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుచుకోగలరు. నేటి పోటీ ప్రపంచంలో ఈ రెండూ అత్యంత కీలక అంశాలు’.. అంటున్నారు టెక్ మహీంద్రా యంగ్ సీఈఓ.. రాహుల్ భూమన్. మహీంద్రా గ్రూప్‌లోని మొత్తం 18 కంపెనీల్లో భవిష్యత్తు సీఈఓలను ఎంపిక చేసే క్రమంలో నిర్వహించిన పోటీలో.. ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఐడియాతో 28 ఏళ్ల వయసులోనే యంగ్ సీఈఓగా ఆయన ఎంపికయ్యారు. టెక్ మహీంద్రా సంస్థ.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎకోల్ సెంట్రల్ ప్యారిస్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్న ‘మహీంద్రా ఎకోల్ సెంట్రల్’ నిర్వహణ బాధ్యతలను రాహుల్ చేపడుతున్నారు. ఈ సందర్భంగా రాహుల్ భూమన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్ కోర్సుగా విద్యార్థుల ఆదరణ పొందుతోంది. అయితే, నాణ్యత పెంచేందుకు మన ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు తేవాలనే నిపుణుల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీ పరిస్థితులు, మన దేశ అవసరాలను గమనిస్తే.. ఇంజనీరింగ్ విద్యలో గణనీయ మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. కరిక్యులంలో మార్పులతో దీనికి శ్రీకారం చుట్టాలి. స్ట్రక్చరల్ విధానం స్థానంలో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించాలి. అప్పుడే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థికి తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. లెర్నింగ్ పరంగానూ నిరంతరం కొత్త అంశాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు కూడా పరీక్షలు-ఉత్తీర్ణత అనే ధోరణికే పరిమితం కాకుండా.. ఆలోచనలను విస్తృతం చేసుకోవాలి. స్వయంగా కొత్త అంశాలు నేర్చుకోవడంలో ఉత్సుకత చూపాలి.
 
ఆర్ అండ్ డీ, ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ విషయంలో చాలా ఇన్‌స్టిట్యూట్‌లు వెనుకంజలో ఉన్నాయి. ఈ పరిస్థితికి పరిష్కారం?
ఇటీవల కాలంలో ఆర్ అండ్ డీ, ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ ప్రాధాన్యం పొందడం ఆహ్వానించదగిన పరిణామం. ఇన్‌స్టిట్యూట్‌లు ఆర్ అండ్ డీ, ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ బోధనలో ముందుండాలంటే.. ఆర్థిక వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు స్పాన్సర్డ్ రీసెర్చ్ యాక్టివిటీస్‌వైపు దృష్టి సారించాలి. పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా నిధుల సమస్యను అధిగమించాలి. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించొచ్చు.
 
ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ కోణంలో ఒక ఇన్‌స్టిట్యూట్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలు?
ఐడియేషన్ టు ఇంక్యుబేషన్.. ఒక ఇన్‌స్టిట్యూట్ ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ కోణంలో అనుసరించాల్సిన తొలి విధానం. విద్యార్థుల నుంచి ఐడియాలు స్వీకరించాలి. ఆచరణ సాధ్యమైన వాటికి కార్యరూపం ఇచ్చేలా ఇంక్యుబేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలి. ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటులో సంస్థల సహకారం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఇన్‌స్టిట్యూట్స్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి.
 
స్టార్ట్-అప్స్ విషయంలో ఔత్సాహికులు అనుసరించాల్సిన వ్యూహాలు?
ముందుగా తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని.. అందులో మార్కెట్ పొటెన్షియల్‌ను గుర్తించాలి. దానికి అనుగుణంగా తమ ఐడియాలు రూపొందించుకోవాలి. ప్రస్తుతం అనేకమంది ఔత్సాహికులు స్టార్ట్-అప్స్ దిశగా ఆలోచిస్తున్నప్పటికీ.. ఫండ్ మొబిలైజేషన్, మార్కెటింగ్ విధానాలపై సరైన అవగాహన లేక ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎన్నో సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు, ఐఐటీ, ఐఎస్‌బీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు స్టార్ట్-అప్స్‌ను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను, ఇన్వెస్టర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ముఖాముఖి చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ఇంటరాక్షన్స్ నిర్వహిస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలి. చక్కటి ఐడియా, మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో ముందుకువస్తే.. ఫండ్ మొబిలైజేషన్ కష్టం కాదు. అంతేకాకుండా సీడ్ ఫండింగ్ కల్పించిన సంస్థలే సదరు స్టార్ట్-అప్ భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై నిరంతర సలహాలు అందిస్తున్నాయి.
 
నేటి అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో తీసుకురావాల్సిన మార్పులు?

కేవలం కోర్ సబ్జెక్ట్స్‌కే పరిమితం కాకుండా.. ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజంలోని అన్ని రంగాలపై అవగాహన ఉండటం తప్పనిసరి. సొంతంగా సంస్థలు స్థాపించినా.. ఉద్యోగంలో ప్రవేశించినా.. పరిశోధనల్లో పాల్పంచుకున్నా.. అవన్నీ పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో సామాజిక అవసరాలు తీర్చేందుకే. వీటిపై అవగాహన లేకుంటే పై మూడు అంశాలకు సంబంధించి సరైన మార్గంలో వెళ్లే అవకాశాలు సన్నగిల్లుతాయి.
 
ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్‌మెంట్ డిగ్రీ అవసరమా.. ఈ రెండు అర్హతలున్న ప్రొఫెషనల్‌గా మీ అభిప్రాయం?
ఉద్యోగం.. ఉపాధి.. రెండు కోణాల్లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్‌మెంట్ డిగ్రీ అదనపు అవకాశాలు కల్పిస్తుంది. ఉదాహరణకు.. ఉద్యోగ కోణంలో విశ్లేషిస్తే.. ఇప్పుడు ఐటీ, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లోని సంస్థలకు అన్ని రంగాల నుంచి క్లయింట్స్ ఉంటున్నారు. ఆయా క్లయింట్స్ వాస్తవ వ్యాపార కార్యకలాపాలపై అవగాహన ఉంటే.. సంస్థ తరఫున ఉద్యోగిగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుంది. అదేవిధంగా ఉపాధి కోణంలో చూస్తే.. సొంత కంపెనీల సమర్థ నిర్వహణకు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఎంతో దోహదం చేస్తాయి.
 
టెక్ మహీంద్రా సంస్థ ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజ్ మహీంద్రా ఎకోల్ సెంట్రల్.. ఇంజనీరింగ్ విద్యలో అందించనున్న వినూత్న విధానాలు?

ఇంజనీరింగ్ విద్యలో మరింత నాణ్యమైన విద్యను అందించాలి. ప్రతి ఒక్క విద్యార్థిని లీడర్, ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్నోవేటర్‌గా తీర్చిదిద్దాలి. ఈ ఉద్దేశాలతోనే ఫ్రాన్స్‌కు చెందిన ఎకోల్ సెంట్రల్ ప్యారిస్, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌లతో అకడెమిక్ భాగస్వామ్యంతో కళాశాలను ఏర్పాటు  చేశాం. ఈ కళాశాల అందించే ఐదేళ్ల బీటెక్ - ఎంటెక్ (డ్యూయల్ డిగ్రీ) కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు మహీంద్రా గ్రూప్‌లోని 18 కంపెనీల్లో ఏదో ఒక కంపెనీలో జాబ్ గ్యారెంటీ.
 
బోధన పరంగా తీసుకోనున్న చర్యలు?
ప్రస్తుతం మన ఇంజనీరింగ్ విద్యా విధానానికి భిన్నంగా వినూత్న తరహాలో బోధనను అందించనున్నాం. నాలుగేళ్ల కోర్సులో ఇండస్ట్రీ-అకడెమిక్ విధానంలో కరిక్యులంలో ఎప్పటికప్పుడు మార్పు లు చేసి విద్యార్థులకు వాస్తవ అవసరాలపై అవగాహన కల్పించనున్నాం. ప్రతి సమ్మర్‌లో ఒక ఇంటర్న్‌షిప్, మినీ ప్రాజెక్ట్ తప్పనిసరి. నాలుగేళ్లు పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్‌టీయూ నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది. అంతేకాకుండా డ్యూయల్ డిగ్రీ విధానంలో ఎంటెక్ సర్టిఫికెట్‌ను పొందే అవకాశం కల్పిస్తున్నాం.

నాలుగేళ్ల తర్వాత ఆసక్తి గల విద్యార్థులు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. ఫ్రాన్స్ ఉన్నత విద్యా శాఖ గుర్తింపు ఉన్న ఎంటెక్ సర్టిఫికెట్ లభిస్తుంది. అంతేకాకుండా.. ఆర్ అండ్ డీకి పెద్దపీట వేసేలా ఇండస్ట్రీ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నాం. ఇప్పటికే ఫార్చూన్-500 సంస్థల జాబితాలో ఉన్న సెఫ్రాన్, ఎయిర్ లిక్విడ్ తదితర సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. మరోవైపు ఫ్యాకల్టీ విషయంలోనూ ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. ఫ్యాకల్టీ-స్టూడెంట్ నిష్పత్తిని 1:10గా నిర్దేశించాం. అంతేకాకుండా ఫ్యాకల్టీలుగా పీహెచ్‌డీలు చేసి ఆయా రంగాల్లో అనుభవం గడించిన వారినే నియమించాం.
 
ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులకు మీ సలహా?
ప్రతి విద్యార్థి తనను తాను ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దుకోవాలి. తులనాత్మక, విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలి. చదివే ప్రతి అంశాన్ని ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించుకుంటూ, వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ  ముందుకు సాగాలి. అప్పుడే నిజమైన ఇంజనీరింగ్ లక్షణాలు లభిస్తాయి. కోర్సు పూర్తయ్యేనాటికి ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యా లనూ ఒంటబట్టించుకోవచ్చు.
 
మహీంద్రా ఎకోల్ సెంట్రల్ (కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్) ప్రత్యేకత
భవిష్యత్తులో ప్రపంచశ్రేణి ఇంజనీరింగ్ పట్టభద్రులను అందించాలనే ఉద్దేశంతో మహీంద్రా గ్రూప్ సంస్థ ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజ్.. మహీంద్రా ఎకోల్ సెంట్రల్. అకడెమిక్ సిలబస్, కరిక్యులం రూపకల్పన, బోధన, ఇతర శిక్షణ అంశాలకు సంబంధించి.. ఫ్రాన్స్‌కు చెందిన 185 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఎకోల్ సెంట్రల్-ప్యారిస్, మన రాష్ట్రంలోని జేఎన్‌టీయూ(హైదరాబాద్)లతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో ఈ కాలేజ్‌ను ఏర్పాటు చేశారు. టెక్ మహీంద్రా సంస్థ ప్రాంగణంలోనే 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికోసం సంస్థ ప్రారంభంలో రూ.300 కోట్లు కేటాయించింది.
 
ప్రధాన ఉద్దేశమిదే
భవిష్యత్తు అవసరాలకు సరితూగే విధంగా ప్రతి విద్యార్థికి రీసెర్చ్ ఓరియెంటెడ్ స్కిల్స్, ప్రాక్టికల్ అప్రోచ్ మెళకువలను అందిస్తారు. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి మంచి నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతారు. ప్రతి విద్యార్థి కోర్సు సమయంలో ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎకోల్ సెంట్రల్ ప్యారిస్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది.
 
కోర్సులు
ఈ ఏడాది నుంచే ప్రారంభం అవుతున్న మహీంద్రా ఎకోల్ సెంట్రల్‌లో ఐదేళ్ల బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సును అందిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో ఒక్కో బ్రాంచ్‌లో 60 సీట్లు చొప్పున భర్తీ చేస్తారు. జేఈఈ-మెయిన్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల కోర్సు తర్వాత మరో ఏడాది అదనంగా చదవాలనుకునే ఔత్సాహికులకు బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ అందుతుంది.
 
కోర్సు స్వరూపం విభిన్నం
మహీంద్రా ఎకోల్ సెంట్రల్ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సు స్వరూపం కూడా భిన్నంగా ఉంటుంది. మొదటి రెండేళ్లు అన్ని బ్రాంచ్‌లకు ఉమ్మడిగా సిలబస్ ఉంటుంది. తర్వాత ఏడాదిన్నర విద్యార్థులు తాము ఎంచుకున్న బ్రాంచ్‌కు సంబంధించిన అంశాలపై బోధన ఉంటుంది. తర్వాత మరో ఏడాదిన్నర ఇండస్ట్రీపరమైన అంశాలలో బోధన ఉంటుంది. ఈ క్రమంలోనే.. విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, ఇంటర్-డిసిప్లినరీ అప్రోచ్ లభించేలా సంగీతం నుంచి సోషల్ సెన్సైస్ వరకు పలు అంశాలను మైనర్స్‌గా నిర్దేశించారు.
 
ఆధునిక సదుపాయాలు
విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ లభించేలా ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో డిజిటల్ లైబ్రరీ, వీడియో కాన్ఫరెన్స్ రూమ్స్, ఆన్‌లైన్ లెక్చర్స్, ఆడియో-విజువల్ నెట్‌వర్క్ సదుపాయాలు లభిస్తాయి. అంతేకాకుండా లైబ్రరీ సదుపాయం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
 
ఫీజులు.. ఆర్థిక ప్రోత్సాహకాలు:
ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి ఏడాదికి రూ. నాలుగు లక్షల ఫీజు నిర్దేశించారు. ప్రతి ఒక్క విద్యార్థి హాస్టల్‌లో ఉండటం తప్పనిసరి. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ ఫీజు నుంచి ఉపశమనం లభించేలా నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. మొత్తం విద్యార్థుల్లో 30 శాతం మందికి ఈ స్కాలర్‌షిప్స్ ఇస్తారు. ఇందుకోసం అర్హులైన విద్యార్థుల ఎంపిక విషయంలోనూ వినూత్నంగా వ్యవహరిస్తోంది.

ముందుగా.. స్కాలర్‌షిప్స్ అవసరమైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. తర్వాత సంస్థ అధికారులు స్వయంగా ఆయా విద్యార్థుల కుటుంబ పరిస్థితులను ప్రత్యక్ష పరిశీలనల ద్వారా తెలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతులను తెలుసుకు న్న తర్వాత మాత్రమే స్కాలర్‌షిప్స్ కేటాయిస్తారు. స్కాలర్‌షిప్స్‌తోపాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం లభించేలా ఆంధ్రాబ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement