ఆలంపల్లి, న్యూస్‌లైన్: స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ కార్డు అనుసంధానం తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోళ నకు దిగడంతో వాహనాలు స్తంభించిపోయాయి. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి స్టేషన్‌కు తరలించారు.
వివరాలు.. వికారాబాద్ పట్టణంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు గంటపాటు ఆందోళన చేశారు. సబ్‌కలెక్టర్ అందుబాటులో లేక పోవడంతో అక్కడి నుంచి విద్యార్థులు ఎన్‌టీఆర్ చౌరస్తాకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు ఏబీవీపీ సంఘటన కార్యదర్శి మొగులయ్య, క ల్యాణ్ తదితరులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. దీంతో విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు.
వికారాబాద్ సీఐ లచ్చిరాంనాయక్ వారిని శాంతింపజేసే యత్నం చేసినా ఫలితం లేదు. పోలీసుల సమాచారంతో వికారాబాద్ డీఎస్పీ నర్సింలు ఘటనా స్థలానికి చేరుకొని లాఠీకి పని చెప్పారు. పోలీసులు దాడి చేయడంతో విద్యార్థులు పరుగులు తీశారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు లాఠీ ార్జి చేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో కొందరిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. మిగతా విద్యార్థులు పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేస్తే తప్పులేదని, జనజీవనానికి భంగం కల్గిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.
విద్యార్థుల అరెస్టు విషయం తెలుసుకున్న బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ మాధవరెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి పాండుగౌడ్, మండల అధ్యక్షుడు రాచశ్రీనివాస రెడ్డి, పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు అనిల్ యాదవ్ తదితరులు ఠాణాకు చేరుకన్నారు. వారి పూచీకత్తుపై విద్యార్థులను విడిపించారు. ఆందోళన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్, కళ్యాణ్, బాగ్ కన్వీనర్ రాజు, నగర కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ఏబీవీపీ వివిధ కళాశాలల అధ్యక్షులు నాగేశ్, నర్సింహాచారి, అవినాష్, మొగులయ్య,మణి కంఠరెడ్డి తదితరులు ఉన్నారు.
ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జి
Published Sat, Jan 4 2014 12:09 AM | Last Updated on Tue, Oct 2 2018 8:08 PM
Advertisement