ఇంజనీరింగ్ విద్య.. ‘మిథ్యే’
- రంగారెడ్డి జిల్లాలో 92 కళాశాలల్లో ప్రవేశాలు కరువు
- మిగతావాటిల్లోనూ పూర్తిస్థాయిలో భర్తీకాని సీట్లు
- నిర్వహణ భారంతో సతమతమవుతున్న యాజమాన్యాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంజనీరింగ్ విద్య సంకటంలో పడింది. రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ కళాశాలల్లో మెదటి సంవత్సరం విద్యార్థులు చేరలేదు. ఒకవైపు కళాశాలల్లో మౌలిక వసతులు, బోధన తీరుపై జేఎన్‌టీయూ నిర్వహించిన తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు, మరోవైపు నిబంధనలపై సర్కారు సైతం కఠినంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే జిల్లాలో 20వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. కొత్త విద్యార్థులు లేకపోవడంతో సీనియర్ల బోధన సిబ్బంది, కాలేజీ నిర్వహణ అంశాలు యాజమాన్యాలకు మరింత భారంగా మారాయి.
జిల్లాలో 172 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీలు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు జిల్లాలోని కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ కాలేజీలన్నీ నగర శివారు మండలాల్లో ఉండడంతో ఎక్కువశాతం జిల్లా కాలేజీలవైపే మొగ్గు చూపారు. దీంతో ఇక్కడి కాలేజీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఈ పరిస్థితి తలక్రిందులైంది. విద్యాప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యంపై దృష్టి సారించిన జేఎన్టీయూ.. పలు కాలేజీల అనుమతిని రద్దు చేసింది. మరోవైపు కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం వసుతులు లేని కాలేజీలపై కఠినంగా వ్యవహరించడంతో 2014-15 విద్యాసంవతర్సంలో జరిగిన తొలివిడత కౌన్సెలింగ్‌కు పలు కాలేజీలు దూరమయ్యాయి.
92 కాలేజీల్లో ఫ్రెషర్స్ నిల్
ఇంజనీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్‌కు జిల్లానుంచి కేవలం 75 కాలేజీలు మాత్రమే అర్హత సాధించాయి. దీంతో ఆ కాలేజీలు మాత్రమే వెబ్ కౌన్సెలింగ్‌లో కనిపించడడంతో.. విద్యార్థులు సైతం వాటినే ఎంచుకున్నారు. అయినప్పటికీ ఆయా కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్టు భర్తీ కాలేదు. ఇదిలా ఉండగా తొలివిడత కౌన్సెలింగ్‌లో అనర్హత వేటు పడిన 97 కాలేజీలకు రెండోవిడత కౌన్సెలింగ్‌లో అర్హత సాధించినప్పటికీ.. విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. రెండోవిడతలో 97 కాలేజీలకు గాను కేవలం 5 కాలేజీల్లో మాత్రమే సింగిల్ డిజిట్‌లో విద్యార్థులు చేరారు. మిగతా 92 కాలేజీల్లో కొత్త విద్యార్థులు చేరకపోవడంతో.. ఆ ప్రభావం.. ఆయా కాలేజీల భవిష్యత్‌పై పడింది.
తగ్గిన 20 వేల మంది విద్యార్థులు
2014-15 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలో దాదాపు 1.5లక్షల మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నారు. కానీ ఈ ఏడాది నెలకొన్న పరిస్థితులతో కొత్తగా ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏటా కొత్త విద్యార్థులు 43వేల మంది ప్రవేశాలు పొందుతుండగా.. ఈఏడాది ప్రవేశాల సంఖ్య 50శాతానికి పడిపోయింది. కేవలం 20 వేల మంది మాత్రమే ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందినట్లు అధికారుల గణాంకాలు చెబుతుండడం గమనార్హం. విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడంతో కాలేజీల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో కళాశాల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడనుంది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో కాలేజీల మూసుకోవాల్సిందేనని ఓ కళాశాల ప్రిన్సిపల్ ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.