JUNTU
-
ఇంజనీరింగ్ విద్య.. ‘మిథ్యే’
రంగారెడ్డి జిల్లాలో 92 కళాశాలల్లో ప్రవేశాలు కరువు మిగతావాటిల్లోనూ పూర్తిస్థాయిలో భర్తీకాని సీట్లు నిర్వహణ భారంతో సతమతమవుతున్న యాజమాన్యాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంజనీరింగ్ విద్య సంకటంలో పడింది. రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ కళాశాలల్లో మెదటి సంవత్సరం విద్యార్థులు చేరలేదు. ఒకవైపు కళాశాలల్లో మౌలిక వసతులు, బోధన తీరుపై జేఎన్టీయూ నిర్వహించిన తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు, మరోవైపు నిబంధనలపై సర్కారు సైతం కఠినంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే జిల్లాలో 20వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. కొత్త విద్యార్థులు లేకపోవడంతో సీనియర్ల బోధన సిబ్బంది, కాలేజీ నిర్వహణ అంశాలు యాజమాన్యాలకు మరింత భారంగా మారాయి. జిల్లాలో 172 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీలు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు జిల్లాలోని కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ కాలేజీలన్నీ నగర శివారు మండలాల్లో ఉండడంతో ఎక్కువశాతం జిల్లా కాలేజీలవైపే మొగ్గు చూపారు. దీంతో ఇక్కడి కాలేజీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ప్రస్తుతం ఈ పరిస్థితి తలక్రిందులైంది. విద్యాప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యంపై దృష్టి సారించిన జేఎన్టీయూ.. పలు కాలేజీల అనుమతిని రద్దు చేసింది. మరోవైపు కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం వసుతులు లేని కాలేజీలపై కఠినంగా వ్యవహరించడంతో 2014-15 విద్యాసంవతర్సంలో జరిగిన తొలివిడత కౌన్సెలింగ్‌కు పలు కాలేజీలు దూరమయ్యాయి. 92 కాలేజీల్లో ఫ్రెషర్స్ నిల్ ఇంజనీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్‌కు జిల్లానుంచి కేవలం 75 కాలేజీలు మాత్రమే అర్హత సాధించాయి. దీంతో ఆ కాలేజీలు మాత్రమే వెబ్ కౌన్సెలింగ్‌లో కనిపించడడంతో.. విద్యార్థులు సైతం వాటినే ఎంచుకున్నారు. అయినప్పటికీ ఆయా కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్టు భర్తీ కాలేదు. ఇదిలా ఉండగా తొలివిడత కౌన్సెలింగ్‌లో అనర్హత వేటు పడిన 97 కాలేజీలకు రెండోవిడత కౌన్సెలింగ్‌లో అర్హత సాధించినప్పటికీ.. విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. రెండోవిడతలో 97 కాలేజీలకు గాను కేవలం 5 కాలేజీల్లో మాత్రమే సింగిల్ డిజిట్లో విద్యార్థులు చేరారు. మిగతా 92 కాలేజీల్లో కొత్త విద్యార్థులు చేరకపోవడంతో.. ఆ ప్రభావం.. ఆయా కాలేజీల భవిష్యత్‌పై పడింది. తగ్గిన 20 వేల మంది విద్యార్థులు 2014-15 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలో దాదాపు 1.5లక్షల మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నారు. కానీ ఈ ఏడాది నెలకొన్న పరిస్థితులతో కొత్తగా ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏటా కొత్త విద్యార్థులు 43వేల మంది ప్రవేశాలు పొందుతుండగా.. ఈఏడాది ప్రవేశాల సంఖ్య 50శాతానికి పడిపోయింది. కేవలం 20 వేల మంది మాత్రమే ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందినట్లు అధికారుల గణాంకాలు చెబుతుండడం గమనార్హం. విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడంతో కాలేజీల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో కళాశాల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడనుంది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో కాలేజీల మూసుకోవాల్సిందేనని ఓ కళాశాల ప్రిన్సిపల్ ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
ఆ వ్యత్యాసాలెందుకు?
పూర్తి వివరాలను మా ముందుంచండి జేఎన్టీయూకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని సౌకర్యాలు ఏఐసీటీఈ, పీసీఐ నిబంధనల మేరకు ఉన్నాయో..? లేదో..? తేల్చేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ సమర్పించిన నివేదికలోని వివరాలతో జేఎన్టీయూ (హైదరాబాద్) సమర్పించిన నివేదిక వివరాలు సరిపోలకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని జేఎన్టీయూ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), భారతీయ ఫార్మసీ మండలి (పీసీఐ) నిర్ధేశించిన నిబంధనల మేరకు 143 ఇంజనీరింగ్, 7 ఫార్మసీ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేవని, ఆ కాలేజీల్లో భారీ లోపాలున్నాయని, అందువల్ల వాటికి అఫిలియేషన్‌ను నిరాకరిస్తున్నట్లు పేర్కొంటూ జేఎన్టీయూ గత నెల 29న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీన్ని సవాల్‌చేస్తూ కాలేజీలు గురువారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జేఎన్టీయూలో కదిలిన అక్రమాల డొంక
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రానికే తలమానికమైన జేఎన్టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టిసారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ప్రతిష్టాత్మక వర్సిటీ పేరుచెప్పి తప్పుడు కన్సల్టెన్సీ నివేదికలివ్వడమే కాక వర్సిటీ ఖాతాలో జమ చేయాల్సిన ఫీజులను సొంత పేర్లపై డిమాండ్ డ్రాఫ్టులు, నేరుగా నగదును స్వీకరించి స్వాహా చేసిన అక్రమార్కుల ఉదంతంపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా వివిధ ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు ప్రాజెక్టు అవసరాల కోసం నిపుణుల నివేదిక(కన్సల్టెన్సీ రిపోర్టు)కోసం జేఎన్టీయూను ఆశ్రయిస్తాయి. ఇందుకు ప్రత్యేకంగా ఓ విధానం ఉంది. దీని ప్రకారం సంబంధిత ల్యాబ్ ఇన్చార్జ్ ఈ రిపోర్టుకు బాధ్యులుగా ఉంటారు. ఆయన జారీ చేసిన రిపోర్టును అతనిపై అధికారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కానీ కొందరు అక్రమార్కులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి సొంత లెటర్‌హెడ్స్‌పై కనీస ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా ఎలాంటి పరిశీలన చేయకుండా సొంతంగా తప్పుడు కన్సల్టెన్సీ నివేదికలిచ్చి ఆయా సంస్థల నుంచి నేరుగా పెద్ద మొత్తంలో నగదు స్వీకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయం వర్సిటీ ఉన్నతాధికారులకు తెలీకుండా జాగ్రత్తపడిన అక్రమార్కుల గుట్టును ఇటీవల ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. రమ్మని పిలిచి.. పైసలు వసూల్..! కన్సల్టెన్సీ నివేదికల కోసం వర్సిటీని ఆశ్రయించే వారిని తమ వైపు తిప్పుకొని నిబంధనలకు విరుద్ధంగా సదరు అక్రమార్కులు వారి నుంచి సొంత పేర్లపై డిమాండ్ డ్రాఫ్టులు,పెద్ద మొత్తంలో నగదు స్వీకరించి జేఎన్టీయూ ప్రిన్సిపాల్ లెటర్‌హెడ్‌పై కన్సల్టెన్సీ నివేదికలిచ్చారన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఏకంగా వర్సిటీతో సంబంధం లేకుండా నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంబంధిత వ్యక్తులకు బిల్లులిచ్చినట్లు తెలిసింది. ఇలా ఏకంగా తొమ్మిది కన్సల్టెన్సీలకు నివేదికలిచ్చి రూ.లక్షల్లో దండుకున్నట్లు సమాచారం. పలు బహుళ అంతస్తుల భవనాలను కనీసం తనిఖీ చేయకుండానే లంచం పుచ్చుకొని నాణ్యతా సర్టిఫికెట్లు ఇచ్చేసి జేబులు నింపుకున్న విషయం బయటపడింది. గతంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిన ఘటనలో సదరు కాంట్రాక్టర్ తప్పిదమేమీ లేదంటూ క్లీన్చిట్ రిపోర్టు ఇచ్చి.. అందుకు ప్రతిఫలంగా ప్రగతినగర్‌లో విలువైన స్థలాన్ని గిఫ్ట్‌గా పొందినట్లు ఆరోపణలున్నాయి. ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.కోట్లలో జరిగే పలు నిర్మాణ పనులకు సైతం తప్పుడు నిపుణుల కమిటీ రిపోర్టులిచ్చి గుత్తేదారుల నుంచి భారీగా నజరానాలు పొందిన వర్సిటీ ఘనుల ఉదంతం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈ అక్రమాలపై దృష్టిసారించడంపై విద్యావేత్తలు, నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వర్సిటీలో బాధ్యతాయుత స్థానంలో ఉండి అక్రమాలకు పాల్పడిన వారిపై ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణ జరిపితేనే గతంలో జరిగిన అక్రమాల గుట్టలు బట్టబయలవుతాయని అంటున్నారు. -
డబ్బున్నవాడిదే పీహెచ్డీ
జేఎన్టీయూకి అవినీతి చెదలు అంగడి సరుకుగా మారిన పట్టాల వ్యవహారం చేతివాటం చూపుతున్న అధికారులు ప్రతి పనికీ ఓ రేటు మంటగలుస్తున్న విశ్వ విఖ్యాత జేఎన్టీయూ ప్రతిష్ట కష్టపడే వారికి దక్కని ఫలితం ఆందోళన చెందుతున్న విద్యార్థులు సాక్షి, సిటీబ్యూరో: జేఎన్టీయూ అక్రమాల పుట్టగా మారింది. డబ్బులిస్తే ఏ పరీక్షనైనా పాస్ చేస్తున్నారు. డబ్బులకు మరిగిన కొందరు అధికారులు అవినీతి బాగోతంలో నిండా మునిగి తేలుతున్నారు. ఇలాంటి చర్యల కారణంగా సాంకేతిక విద్యారంగంలో రాష్ట్రానికే తలమానికంగా మారి ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. మేథస్సుకు పదును పెట్టాల్సిన చోట, సరికొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ జరగాల్సిన ప్రదేశంలో అవినీతి రాజ్యమేలుతోంది. డబ్బులకు కక్కుర్తి పడుతున్న కొందరు పీహెచ్డీ పట్టాలను అంగడి సరుకుగా విక్రయిస్తున్నారు. ఒక్కో పరీక్షకు ఓ రేటు నిర్ణయించి దర్జాగా వసూలు చేస్తున్నారు. డబ్బున్నోడు చదవకుండానే పట్టా పొందుతున్నాడు. అదే సమయంలో కష్టపడి చదివిన వారు వెనకబడిపోతున్నారు. గత కొన్నేళ్లుగా వర్సిటీలో జరుగుతోన్న ఈ అవినీతి దందాపై పలువురు విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. విద్యా వ్యవస్థలో వేళ్లూనుకుంటున్న ఈ అవినీతిపై విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్డీ పట్టా ధర రూ.2 లక్షలు! విస్తృత పరిశోధనలు చేయకుండానే, సిద్ధాంత పత్రాలు పూర్తిస్థాయిలో సమర్పించకుండానే కొందరు పీహెచ్డీ పట్టాలు పొందుతున్నారు. వర్సిటీలో తిష్టవేసిన అక్రమార్కులు ఈ తతంగాన్ని నడుపుతున్నారు. కేవలం రూ.2 లక్షలు వారి చేతిలో పెడితే చాలు వర్సిటీ నిబంధనలకు పక్కనపెట్టి పీహెచ్డీ ఫైల్‌ను వారే ముందుకు నడిపిస్తారని తెలిసింది. లేకపోతే అదే ఫైల్‌ను తొక్కిపెడతారని సమాచారం. డబ్బులిచ్చిన వారికి సంబంధించిన పీహెచ్డీ ఫైల్‌ను స్వయంగా వారే వీసీ వద్దకు తీసుకెళ్లి పట్టా వచ్చేందుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రీ పీహెచ్డీ పరీక్ష పేపర్ ధర రూ.50 వేలట.. వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రీ పీహెచ్డీ పరీక్షలో రెండు పేపర్లలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాస్‌కావడం కష్టసాధ్యమని పలువురు అభ్యర్థులు భావిస్తారు. కానీ ఈ వర్సిటీలో కొందరు అక్రమార్కులకు ప్రతి పేపరుకు రూ.50 వేల చొప్పున సమర్పిస్తే చాలు ప్రీ పీహెచ్డీ పరీక్ష పాస్ కావడం సులువేనని పలువురు స్కాలర్లు చెబుతున్నారు. బీటెక్, ఎంటెక్ పరీక్ష పేపరుకు రూ.10 వేలు?.. ఇక బీటెక్, ఎంటెక్ కోర్సుల్లోని పలు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కావాలనుకునే వారు ప్రతి పేపరుకు రూ.10 వేలు చొప్పున చెల్లిస్తే కష్టపడి చదవకుండానే పాస్ కావచ్చట. పాస్ మార్కులు వేసేందుకు పేపరుకు రూ.10 వేల చొప్పున వర్సిటీలో తిష్టవేసిన అక్రమార్కులు వసూలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టేషనరీ రుసుములోనూ కక్కుర్తే.. జేఎన్టీయూ గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు ఏటా ప్రతి విద్యార్థిపైమౌలిక వసతుల కల్పన ఫీజు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ)కింద నిర్ణీత మొత్తాన్ని జేఎన్టీయూకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది లక్షల రూపాయల్లో ఉండడంతో పలు కళాశాలలు తమ ఆర్థిక ఇబ్బందులను చూపుతూ ఈ ఫీజును చెల్లించడంలేదు. దీన్ని సాకుగా తీసుకొని కొందరు అధికారులు పరీక్షల నిర్వహణకు అవసరమైన ఖాళీ సమాధాన పత్రాలు(బ్లాంక్ ఆన్సర్ బుక్స్) సరఫరా చేయడాన్ని నిలిపివేస్తున్నారు. దీంతో చేసేదిలేక కళాశాలల యాజమాన్యాలు కళాశాలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున వారికి కప్పం చెల్లించి సమాధాన పత్రాలు(స్టేషనరీ) తీసుకెళుతున్నాయి. లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ చెల్లించాలని వారు ఒత్తిడి తెస్తున్నారని పలువురు కళాశాలల నిర్వాహకులు పేర్కొంటున్నారు. విజిలెన్స్ విచారణకు డిమాండ్.. వర్సిటీలో జరుగుతోన్న అక్రమాలు, మూల్యాంకన విభాగంలోని అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపిం చాలని విద్యారంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అవినీతి, అక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట మంటగలుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్ష ఇస్తే పరీక్ష కేంద్రమే మార్పు.. ఇంజనీరింగ్ కోర్సులో ఏటా జరిగే సెమిస్టర్ ఎగ్జామ్స్‌కు పరీక్ష కేంద్రాలను కోరిన చోట వేయించుకునేందుకు లక్ష రూపాయలిస్తే సరిపోతుందట. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోరిన కేంద్రాల్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించే దుస్సంప్రదాయం వర్సిటీలో నెలకొంది. ఒకవేళ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ లక్ష రూపాయలు కాస్త రూ.2 లక్షలు అవుతుందని సమాచారం. జేఎన్టీయూ పరిధిలో సుమారు 450 ప్రైవేటు కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు కోరిన చోట పరీక్ష కేంద్రాలు కేటాయించి రూ.లక్షల్లో దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.