జేఎన్‌టీయూలో కదిలిన అక్రమాల డొంక
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రానికే తలమానికమైన జేఎన్‌టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దృష్టిసారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ప్రతిష్టాత్మక వర్సిటీ పేరుచెప్పి తప్పుడు కన్సల్టెన్సీ నివేదికలివ్వడమే కాక వర్సిటీ ఖాతాలో జమ చేయాల్సిన ఫీజులను సొంత పేర్లపై డిమాండ్ డ్రాఫ్టులు, నేరుగా నగదును స్వీకరించి స్వాహా చేసిన అక్రమార్కుల ఉదంతంపై ఆరా తీసినట్లు తెలిసింది.
ఈ విషయంలో ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా వివిధ ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు ప్రాజెక్టు అవసరాల కోసం నిపుణుల నివేదిక(కన్సల్టెన్సీ రిపోర్టు)కోసం జేఎన్‌టీయూను ఆశ్రయిస్తాయి. ఇందుకు ప్రత్యేకంగా ఓ విధానం ఉంది. దీని ప్రకారం సంబంధిత ల్యాబ్ ఇన్‌చార్జ్ ఈ రిపోర్టుకు బాధ్యులుగా ఉంటారు.
ఆయన జారీ చేసిన రిపోర్టును అతనిపై అధికారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కానీ కొందరు అక్రమార్కులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి సొంత లెటర్‌హెడ్స్‌పై కనీస ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా ఎలాంటి పరిశీలన చేయకుండా సొంతంగా తప్పుడు కన్సల్టెన్సీ నివేదికలిచ్చి ఆయా సంస్థల నుంచి నేరుగా పెద్ద మొత్తంలో నగదు స్వీకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయం వర్సిటీ ఉన్నతాధికారులకు తెలీకుండా జాగ్రత్తపడిన అక్రమార్కుల గుట్టును ఇటీవల ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే.
రమ్మని పిలిచి.. పైసలు వసూల్..!
కన్సల్టెన్సీ నివేదికల కోసం వర్సిటీని ఆశ్రయించే వారిని తమ వైపు తిప్పుకొని నిబంధనలకు విరుద్ధంగా సదరు అక్రమార్కులు వారి నుంచి సొంత పేర్లపై డిమాండ్ డ్రాఫ్టులు,పెద్ద మొత్తంలో నగదు స్వీకరించి జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ లెటర్‌హెడ్‌పై కన్సల్టెన్సీ నివేదికలిచ్చారన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఏకంగా వర్సిటీతో సంబంధం లేకుండా నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంబంధిత వ్యక్తులకు బిల్లులిచ్చినట్లు తెలిసింది.
ఇలా ఏకంగా తొమ్మిది కన్సల్టెన్సీలకు నివేదికలిచ్చి రూ.లక్షల్లో దండుకున్నట్లు సమాచారం. పలు బహుళ అంతస్తుల భవనాలను కనీసం తనిఖీ చేయకుండానే లంచం పుచ్చుకొని నాణ్యతా సర్టిఫికెట్‌లు ఇచ్చేసి జేబులు నింపుకున్న విషయం బయటపడింది. గతంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిన ఘటనలో సదరు కాంట్రాక్టర్ తప్పిదమేమీ లేదంటూ క్లీన్‌చిట్ రిపోర్టు ఇచ్చి.. అందుకు ప్రతిఫలంగా ప్రగతినగర్‌లో విలువైన స్థలాన్ని గిఫ్ట్‌గా పొందినట్లు ఆరోపణలున్నాయి.
ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.కోట్లలో జరిగే పలు నిర్మాణ పనులకు సైతం తప్పుడు నిపుణుల కమిటీ రిపోర్టులిచ్చి గుత్తేదారుల నుంచి భారీగా నజరానాలు పొందిన వర్సిటీ ఘనుల ఉదంతం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈ అక్రమాలపై దృష్టిసారించడంపై విద్యావేత్తలు, నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వర్సిటీలో బాధ్యతాయుత స్థానంలో ఉండి అక్రమాలకు పాల్పడిన వారిపై ఉన్నతస్థాయి విజిలెన్స్ విచారణ జరిపితేనే గతంలో జరిగిన అక్రమాల గుట్టలు బట్టబయలవుతాయని అంటున్నారు.