డబ్బున్నవాడిదే పీహెచ్‌డీ | Money should never PHD | Sakshi
Sakshi News home page

డబ్బున్నవాడిదే పీహెచ్‌డీ

Published Tue, Jun 24 2014 3:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

డబ్బున్నవాడిదే పీహెచ్‌డీ - Sakshi

డబ్బున్నవాడిదే పీహెచ్‌డీ

  •      జేఎన్‌టీయూకి అవినీతి చెదలు
  •      అంగడి సరుకుగా మారిన పట్టాల వ్యవహారం
  •      చేతివాటం చూపుతున్న అధికారులు
  •      ప్రతి పనికీ ఓ రేటు
  •      మంటగలుస్తున్న విశ్వ విఖ్యాత జేఎన్‌టీయూ ప్రతిష్ట
  •      కష్టపడే వారికి దక్కని ఫలితం
  •      ఆందోళన చెందుతున్న విద్యార్థులు
  • సాక్షి, సిటీబ్యూరో: జేఎన్‌టీయూ అక్రమాల పుట్టగా మారింది. డబ్బులిస్తే ఏ పరీక్షనైనా పాస్ చేస్తున్నారు. డబ్బులకు మరిగిన కొందరు అధికారులు అవినీతి బాగోతంలో నిండా మునిగి తేలుతున్నారు. ఇలాంటి చర్యల కారణంగా సాంకేతిక విద్యారంగంలో రాష్ట్రానికే తలమానికంగా మారి ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది.

    మేథస్సుకు పదును పెట్టాల్సిన చోట, సరికొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ జరగాల్సిన ప్రదేశంలో అవినీతి రాజ్యమేలుతోంది. డబ్బులకు కక్కుర్తి పడుతున్న కొందరు పీహెచ్‌డీ పట్టాలను అంగడి సరుకుగా విక్రయిస్తున్నారు. ఒక్కో పరీక్షకు ఓ రేటు నిర్ణయించి దర్జాగా వసూలు చేస్తున్నారు. డబ్బున్నోడు చదవకుండానే పట్టా పొందుతున్నాడు. అదే సమయంలో కష్టపడి చదివిన వారు వెనకబడిపోతున్నారు.

    గత కొన్నేళ్లుగా వర్సిటీలో జరుగుతోన్న ఈ అవినీతి దందాపై పలువురు విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. విద్యా వ్యవస్థలో వేళ్లూనుకుంటున్న ఈ అవినీతిపై విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
     
    పీహెచ్‌డీ పట్టా ధర రూ.2 లక్షలు!
     
    విస్తృత పరిశోధనలు చేయకుండానే, సిద్ధాంత పత్రాలు పూర్తిస్థాయిలో సమర్పించకుండానే కొందరు పీహెచ్‌డీ పట్టాలు పొందుతున్నారు. వర్సిటీలో తిష్టవేసిన అక్రమార్కులు ఈ తతంగాన్ని నడుపుతున్నారు. కేవలం రూ.2 లక్షలు వారి చేతిలో పెడితే చాలు వర్సిటీ నిబంధనలకు పక్కనపెట్టి పీహెచ్‌డీ ఫైల్‌ను వారే ముందుకు నడిపిస్తారని తెలిసింది. లేకపోతే అదే ఫైల్‌ను తొక్కిపెడతారని సమాచారం. డబ్బులిచ్చిన వారికి సంబంధించిన  పీహెచ్‌డీ ఫైల్‌ను స్వయంగా వారే వీసీ వద్దకు తీసుకెళ్లి పట్టా వచ్చేందుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     
    ప్రీ పీహెచ్‌డీ పరీక్ష పేపర్ ధర రూ.50 వేలట..

     
    వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రీ పీహెచ్‌డీ పరీక్షలో రెండు పేపర్లలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాస్‌కావడం కష్టసాధ్యమని పలువురు అభ్యర్థులు భావిస్తారు. కానీ ఈ వర్సిటీలో కొందరు అక్రమార్కులకు ప్రతి పేపరుకు రూ.50 వేల చొప్పున సమర్పిస్తే చాలు ప్రీ పీహెచ్‌డీ పరీక్ష పాస్ కావడం సులువేనని పలువురు స్కాలర్లు చెబుతున్నారు.
     
    బీటెక్, ఎంటెక్ పరీక్ష పేపరుకు రూ.10 వేలు?..
     
    ఇక బీటెక్, ఎంటెక్ కోర్సుల్లోని పలు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కావాలనుకునే వారు ప్రతి పేపరుకు రూ.10 వేలు చొప్పున చెల్లిస్తే కష్టపడి చదవకుండానే పాస్ కావచ్చట. పాస్ మార్కులు వేసేందుకు పేపరుకు రూ.10 వేల చొప్పున వర్సిటీలో తిష్టవేసిన అక్రమార్కులు వసూలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
     
    స్టేషనరీ రుసుములోనూ కక్కుర్తే..
     
    జేఎన్‌టీయూ గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు ఏటా ప్రతి విద్యార్థిపైమౌలిక వసతుల కల్పన ఫీజు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫీ)కింద నిర్ణీత మొత్తాన్ని జేఎన్‌టీయూకు చెల్లించాల్సి ఉంటుంది.
     
    ఇది లక్షల రూపాయల్లో ఉండడంతో పలు కళాశాలలు తమ ఆర్థిక ఇబ్బందులను చూపుతూ ఈ ఫీజును చెల్లించడంలేదు. దీన్ని సాకుగా తీసుకొని కొందరు అధికారులు పరీక్షల నిర్వహణకు అవసరమైన  ఖాళీ సమాధాన పత్రాలు(బ్లాంక్ ఆన్సర్ బుక్స్) సరఫరా చేయడాన్ని నిలిపివేస్తున్నారు. దీంతో చేసేదిలేక కళాశాలల యాజమాన్యాలు కళాశాలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున వారికి కప్పం చెల్లించి సమాధాన పత్రాలు(స్టేషనరీ) తీసుకెళుతున్నాయి.
     
    లేకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫీ చెల్లించాలని వారు ఒత్తిడి తెస్తున్నారని పలువురు కళాశాలల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
     
    విజిలెన్స్ విచారణకు డిమాండ్..

    వర్సిటీలో జరుగుతోన్న అక్రమాలు, మూల్యాంకన విభాగంలోని అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపిం చాలని విద్యారంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అవినీతి, అక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట మంటగలుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
     రూ.లక్ష ఇస్తే పరీక్ష కేంద్రమే మార్పు..

    ఇంజనీరింగ్ కోర్సులో ఏటా జరిగే సెమిస్టర్ ఎగ్జామ్స్‌కు పరీక్ష కేంద్రాలను కోరిన చోట వేయించుకునేందుకు లక్ష రూపాయలిస్తే సరిపోతుందట. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోరిన కేంద్రాల్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించే దుస్సంప్రదాయం వర్సిటీలో నెలకొంది. ఒకవేళ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ లక్ష రూపాయలు కాస్త రూ.2 లక్షలు అవుతుందని సమాచారం. జేఎన్‌టీయూ పరిధిలో సుమారు 450 ప్రైవేటు కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు కోరిన చోట పరీక్ష కేంద్రాలు కేటాయించి రూ.లక్షల్లో దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement