
క్లాస్మేట్ ఫీజు కోసం చందాలు వేసుకున్న తోటి పిల్లలు
వేలల్లో షేర్లు.. వందల్లో కామెంట్లు
మామా మందుకు డబ్బుల్లేవా.. డోంట్ వర్రీ మామా.. నేనున్నాను కదా పదా పోదాం.. ఇదిగో సిగరెట్ తీసుకో బావా.. భయమెందుకు నేనున్నా.. కదా.. బే ఫికర్ బ్రదర్.. నేను చూస్కుంటానులే.. ఈ చొక్కా నచ్చిందా తీసుకో.. నేను బిల్లు పే చేస్తాను.. ఆగాగు.. టిక్కెట్ నువ్వెందుకు తీయడం.. నీకసలే జీతం తక్కువ.. ఇంకెప్పుడూ పక్కన నేను ఉండగా నువ్వు జేబులో చేయి పెట్టొద్దు.. పెట్రోల్ నేను పోయిస్తాను తమ్ము.. నువ్వెందుకు కంగారు పడతావ్... ఇలాంటి స్నేహాలు మనం చూస్తూనే ఉన్నాం..
వద్దులే లక్ష్మి ఆటోచార్జీ పది రూపాయలు నువ్వు ఇవ్వకు.. నేను ఇస్తాలే.. ఒసేయ్ మంగా మేమంతా తలో రెండొందలతో ఆరుకు వెళ్తున్నాం.. నువ్వూ రావాలి.. డబ్బులెం ఇవ్వద్దులే.. మేం చూసుకుంటాం.. జస్ట్ నువ్వు ఆటో ఎక్కు చాలు.. ఇదీ హౌస్ వైవ్స్ స్నేహం.. హలొ.. బ్రదర్ రాజేష్.. మనవాళ్ళం ముగ్గురం బిజినెస్ పెడుతున్నాం తలో టూ క్రోర్స్ ఉండాలి.. నువ్వు అంత పెట్టలేవు.. ఎంత ఉంటే అంత పెట్టు.. చాలు.. మిగతాది మేం చూస్తాం.. నువ్వేం ఫీల్ కావద్దు.. హలో రెడ్డీ.. ఈ బిజినెస్ మనదే.. పెట్టుబడి నేను పెడతాను.
నువ్వు జస్ట్ డబ్బుల్లేకున్నా వర్కింగ్ పార్ట్నర్ గా ఉండు.. పని మొత్తం నువ్వే చూసుకో.. ఇదో టైప్ స్నేహం.. అసలు స్నేహం.. ఇతరులకు సహాయం చేయడం ఇది ఒక జీవన విధానం అయింది.. చిన్నప్పుడు తెచ్చుకున్న బిస్కెట్ ముక్క.. కాకెంగిలి చేసి ఇచ్చిన ఉసిరికాయ లంచ్ టైములో తన డబ్బాలోంచి తీసిచ్చిన చిన్న ఆవకాయ ముక్క.. ఇవన్నీ మనలోని ఒక ఆత్మీయ భావనకు సూచికలు ...
ఒక్కడే తిన్నది తిండీ కాదు.. ఒక్కడే బతికింది బతుకూ కాదు.. మనిషి సంఘ జీవి.. తాను బతుకుతూ ఇంకొందరిని బతికించాలి.. తానూ తింటూ ఇంకొకరి ఆకలి తీర్చాలి అప్పుడు కదా జీవితానికి సార్థకత. కాకి .. పిచ్చుక.. కుక్కలు కూడా తాము తింటూనే అక్కడ అక్కడ గింజలు.. మెతుకులు ఉన్నాయ్.. మీరూ రండి అని తోటివాళ్లను పీలుస్తాయి.. అంతా కలిసి ఆకలి తీర్చుకుంటాయి.. కానీ మనిషి ఒక్కడే తాను తింటే చాలనుకుంటాడు.
చిన్న పిల్లలు.. పెద్ద మనసులు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ స్కూల్లో పిల్లలు తమ సహచరుడి ఫీజ్ కోసం ఎంత యాతన పడ్డారు.. వారంతా ఐక్యంగా ఆ సమస్య నుంచి తమ మిత్రుడిని ఎలాగట్టెక్కించారన్నది ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీనికి వేళల్లో షేర్లు.. వందల్లో కామెంట్లు వచ్చాయి. స్కూల్లో ఫీజు చెల్లించలేదని ఒక అబ్బాయిని స్కూలు మేనేజిమెంట్ ప్రశ్నిస్తుంది.. అయితే తన తండ్రి పేదరికం కారణంగా ఆ పిల్లడు ఫీజు సకాలంలో చెల్లించలేకపోతాడు.. దీంతో అతని సహచరులు.. అంతా పదేళ్లలోపు పిల్లలే అయినా పెద్దమనసు చేసుకుంటారు.. తలా కొంత వేసుకుని స్నేహితుడి ఫీజు చెల్లిస్తారు.
వారు తమలోతాము చందాలు వేసుకుంటుండగా టీచర్ వచ్చి అబ్బాయిలు.. మీ ఫ్రెండ్ ఫీజు సంగతి నేను చూసుకుంటాను.. మీరు వెళ్ళండి.. మీకెందుకురా కష్టం అని చెబుతున్నా.. మీ సాయం మాకు అవసరం లేదు.. మా వాడికి మేమున్నాం.. మేం చూసుకుంటాం అని వారంతా ఏకమై తమ మిత్రుడి ఫీజు చెల్లించిన వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. తనకోసం వాళ్లంతా ఇలా డబ్బులు వేసుకోవడాన్ని చూసిన ఆ పిల్లడు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనకైనా మనసు కరుగుతుంది. ఇది కదా పిల్లలలో ఉండాల్సింది. ఇలాంటి లక్షణాలు కదా పిల్లల్లో మొలకెత్తాలి.. అలా పిల్లల్లో పురుడుపోసుకున్న ఆలోచనలకూ తల్లిదండ్రులు సైతం తోడ్పాటును ఇవ్వాలి
-సిమ్మాదిరప్పన్న
These young good hearts collected money to pay fees of his friend 🥺
I hope these young angels continue their pure and innocent spirit and bless the world 🙌 pic.twitter.com/BGQ2uw9d5o
— Vineeta Singh 🇮🇳 (@biharigurl) February 7, 2025