- పూర్తి వివరాలను మా ముందుంచండి
- జేఎన్‌టీయూకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని సౌకర్యాలు ఏఐసీటీఈ, పీసీఐ నిబంధనల మేరకు ఉన్నాయో..? లేదో..? తేల్చేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ సమర్పించిన నివేదికలోని వివరాలతో జేఎన్‌టీయూ (హైదరాబాద్) సమర్పించిన నివేదిక వివరాలు సరిపోలకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని జేఎన్‌టీయూను ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని జేఎన్‌టీయూ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), భారతీయ ఫార్మసీ మండలి (పీసీఐ) నిర్ధేశించిన నిబంధనల మేరకు 143 ఇంజనీరింగ్, 7 ఫార్మసీ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేవని, ఆ కాలేజీల్లో భారీ లోపాలున్నాయని, అందువల్ల వాటికి అఫిలియేషన్‌ను నిరాకరిస్తున్నట్లు పేర్కొంటూ జేఎన్‌టీయూ గత నెల 29న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీన్ని సవాల్‌చేస్తూ కాలేజీలు గురువారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.