ఏపీలో 43వేల సీట్లు ఖాళీ
ఒకరోజు ముందే ఎంసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఏపీ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కమిటీ షెడ్యూల్‌కన్నా ఒకరోజు ముందే సోమవారమే పూర్తిచేసింది. రాష్ట్రంలోని కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో మొత్తం 1,61,512 సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్‌కోటాలో 1,13,058 సీట్లకు గాను మొదటివిడత కౌన్సెలింగ్‌లో 69,459 (61.4 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 43,599 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఎంసెట్‌లో మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారిలో అత్యధికులు ఈసారి ఇక్కడి కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదని తాజా కేటాయింపులు స్పష్టంచేస్తున్నాయి. అనేకమంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుతో పాటు పలు ఇతర యూనివర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించి ఉండడం, వాటిలో చేరేందుకు ఉత్సుకత చూపుతుండడం ఏపీ ఎంసెట్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోవడానికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్‌జాయినింగ్ రిపోర్టు
సీట్లు కేటాయింపు అయిన అభ్యర్థులకు కాలేజీ, కోర్సుల వారీగా సమాచారాన్ని అడ్మిషన్ల కమిటీ సంక్షిప్త సమాచారాన్ని వారి ఫోన్లకు పంపింది. సీట్లు కేటాయింపుపైన అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్’లో పొందుపరిచిన సెల్ఫ్‌జాయినింగ్ రిపోర్టు ఆప్షన్ ద్వారా, లేదా సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో కానీ సెల్ఫ్ రిపోర్టు చేయాలని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆన్‌లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసిన అనంతరం సంబంధిత రిపోర్టింగ్ కాపీలు రెండింటిని ప్రింటవుట్ తీసుకోవాలి. వాటిలో ఒకదాన్ని తమకు కేటాయించిన కాలేజీలకు జులై 1లోగా తీసుకువెళ్లి సమర్పించి మరో దానిపై ఆ కాలేజీనుంచి అకనాలెడ్జిమెంటు చేయించుకోవాలి. తమకు మొదటివిడత కేటాయించిన సీటు సంతృప్తికరంగా ఉందని భావిస్తే అభ్యర్థులు ఆ కాలేజీల్లో రిపోర్టు మాత్రమే చేయాలి. ఒరిజినల్ ధ్రువపత్రాలను, ట్యూషన్ ఫీజులను (ఫీజు రీయింబర్స్‌మెంటు పరిధిలోకి రానివారు) కాలేజీలకు అందించరాదు. చివరి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక మాత్రమే ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో అర్హులైన అభ్యర్థులందరికీ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని అడ్మిషన్ల కమిటీ వర్గాలు వివరించాయి. ఇంజనీరింగ్, ఫార్మ కాలేజీల్లో తరగతులు జూలై 1నుంచి ప్రారంభమవుతాయని ఉదయలక్ష్మి వివరించారు.