రాష్ట్రంలో దయనీయంగా మారిన విద్యారంగం
- ఎంసెట్–2017 కౌన్సెలింగ్‌పై విద్యార్థుల అనాసక్తి.. 100 లోపు ర్యాంకర్లలో హాజరైంది ఇద్దరే
- 1,000 లోపు ర్యాంకర్లలో వచ్చింది 178 మందే.. ప్రమాణాల్లేని కళాశాలల్లో చేరడానికి విముఖత
- ఏపీలో చదివితే ఉద్యోగాలొస్తా్తయన్న నమ్మకం లేక వెనుకంజ.. జాతీయస్థాయి విద్యాసంస్థలపై దృష్టి
- హైదరాబాద్ పరిసరాల్లోని కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నాలు
- ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు గొప్పలు
ఇంజినీరింగ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు 1.50,000
అగ్రి కల్చర్, ఫార్మాలో అర్హత సాధించింది 70,000
ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 22,734
సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్, ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నాం. దేశ విదేశాల నుంచి ఏపీకి వచ్చి ఉన్నత విద్యనభ్యసించేలా విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను ఏపీకి తీసుకొస్తున్నాం. చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నాం...’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా చెప్పుకునే గొప్పలవీ. అత్యుత్తమ విద్యాసంస్థల ఏర్పాటు ముసుగులో తనకు కావాల్సిన వారికి వందల ఎకరాల భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారు.
కానీ, రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్నత విద్య కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలి రావడం సంగతి పక్కనపెడితే ఏపీ విద్యార్థులు సైతం సొంత రాష్ట్రంలో చదవడానికి ఇష్టపడడం లేదు. ఏపీ ఎంసెట్–2017 కౌన్సెలింగే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎంసెట్‌లో టాప్ ర్యాంకర్లతోపాటు ఇతరులు మీ చదువులు మాకొద్దు బాబోయ్ అంటున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. 1,000 లోపు ర్యాంకర్లలో కేవలం 178 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారంటే ఏపీలో చదువుల దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
నిధులివ్వరు... ఖాళీలు భర్తీ చేయరు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రమాణాలు పాతాళంలోకి దిగజారాయి. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో బోధన అత్యంత నాసిరకంగా మారిపోయింది. ఏపీలో ఈ కోర్సులు చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండడం లేదు. విద్యారంగం అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటోంది. వర్సిటీలు, కళాశాలల్లో సంవత్సరాల తరబడి వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నా భర్తీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని విద్యాసంస్థల్లో చేరాలంటే విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. చాలామంది జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు పక్క రాష్ట్రం తెలంగాణలోని(ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల) కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఏపీ ఎంసెట్–2017లో టాప్ ర్యాంకులు సాధించినవారు కౌన్సెలింగ్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. ఎంసెట్‌లో 1వ ర్యాంకు నుంచి 100వ ర్యాంకు సాధించిన అభ్యర్థుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం ఇద్దరే హాజరు కావడం గమనార్హం. 1,000 లోపు ర్యాంకర్లలోనూ ఇప్పటిదాకా కేవలం 178 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఏపీ ఎంసెట్–2017 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాప్ ర్యాంకర్లు ఈ కౌన్సెలింగ్ పట్ల విముఖత చూపుతున్నారు. ఈ ఏడాది మొత్తం ర్యాంకర్లలో సగం మంది కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఏపీ ఎంసెట్‌కు హాజరై కళాశాలల్లో చేరిన తర్వాత జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు వస్తే దీన్ని వదులుకొని వెళ్లిపోయేవారు. ఈసారి కనీసం ధ్రువపత్రాల పరిశీలనకు కూడా హాజరు కాకపోవడం విశేషం. గతంలో టాప్ ర్యాంకర్లు వదిలేయడంతో ఖాళీగా ఉన్న సీట్లను ప్రభుత్వ ఉత్తర్వులతో, ఉన్నత విద్యామండలి అనుమతితో ఇతరులకు కేటాయించేవారు. ప్రైవేట్ కాలేజీలు వాటిని లెఫ్ట్ ఓవర్ సీట్లుగా పరిగణించి భర్తీ చేసుకునేవి. ఈసారి టాప్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు దూరంగా ఉండడంతో.. మెరుగైన ర్యాంకు రాని వారికి కూడా మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సగమైనా భర్తీ అయ్యేనా?
ఏపీ ఎంసెట్–2017లో ఇంజనీరింగ్‌లో 1.50 లక్షలకు మందికి పైగా అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా (బైపీసీ స్ట్రీమ్)లో 70,000 మంది అర్హత సాధించారు. వీరికి కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాల్లో ఇంజనీరింగ్ సీట్లు 1,38,751, అగ్రికల్చర్, ఫార్మా సీట్లు 10,233 అందుబాటులో ఉన్నాయి. టాప్ ర్యాంకర్లతోపాటు ఇతర ర్యాంకర్లు కూడా ఏపీలోని ప్రమాణాల్లేని విద్యాసంస్థల పట్ల నిరాసక్తంగా ఉండడంతో వీటిలో ఈసారి ఎన్ని భర్తీ అవుతాయో చూడాలి. 2015–16లో ఇంజనీరింగ్ విభాగంలో కన్వీనర్ కోటాలో 1,10,951 సీట్లు ఉండగా, 74,281 మాత్రమే భర్తీ అయ్యాయి. 2016–17లో 1,17,278 సీట్లు ఉండగా, 65,765 మాత్రమే భర్తీ అయ్యాయి.
వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 22,734 మందే
ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం నాటికి ఆరో రోజుకు చేరింది. ఇప్పటిదాకా 78,000 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉండగా, 41,455 మంది వచ్చారు. వీరిలో 8,998 మంది మంగళవారం కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటివరకు 36,545 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు దూరంగా ఉన్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు 60,000 మంది వెబ్‌ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా, 22,734 మంది మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ తరువాత ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.