విద్యార్ధులకు అమెజాన్‌ అదిరిపోయే శుభవార్త | Amazon provide Computer Science education to rural India | Sakshi
Sakshi News home page

Amazon: పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్‌ సైన్స్‌

Published Wed, Sep 29 2021 7:31 AM | Last Updated on Wed, Sep 29 2021 1:54 PM

Amazon provide Computer Science education to rural India  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంప్యూటర్‌ సైన్స్‌ విద్య రంగంలో భారత్‌లో పెద్ద ముందడుగు. ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ (ఏఎఫ్‌ఈ) ప్రోగ్రాంను పరిచయం చేయనుంది.

ఇందులో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం చేస్తారు. తొలి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలను ఎంపిక చేస్తారు.  

6–12 తరగతి విద్యార్థులకు.. 
అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ కార్యక్రమంలో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కోడింగ్‌ మూల సిద్ధాంతాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (వాయిస్‌ టెక్నాలజీ) వంటి భవిష్యత్‌ కేంద్రీకృత సాంకేతిక కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు అమెజాన్‌ నిపుణులను కలిసే అవకాశమూ ఉంటుంది.

అమెజాన్‌ సైబర్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్‌ బేసిక్స్, కోడింగ్‌ నేర్చుకోవచ్చు. ఉపకార వేతనాలు, ఇంటర్న్‌షిప్స్, హాకథాన్స్, మార్గదర్శకత్వం సైతం లభిస్తుంది. సీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా బోధించడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు శిక్షణ ఇస్తారు. భారత్‌లో నాణ్యమైన సీఎస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ కోడ్‌.ఓఆర్‌జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్‌ పనిచేస్తోంది. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో.. 
ఏఎఫ్‌ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యారంగానికి సేవలు అందిస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్‌ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ‘ఉపాధి రంగంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక క్లిష్టమైన నైపుణ్యంగా మారింది. సీఎస్‌ను యువత ముందస్తుగా నేర్చుకోవడం ద్వారా ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని అమెజాన్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు.

‘నాణ్యమైన కోర్సు కంటెంట్‌ లేకపోవడం, స్థానిక భాషలో పరిమితంగా అధునాతన కంటెంట్‌ వంటివి సీఎస్‌ కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు అడ్డంకులు. ప్రతిభ, అభిరుచి యువకులందరిలో విస్తరించినప్పటికీ అవకాశాలు పరిమితమే. ఏఎఫ్‌ఈతో సీఎస్‌ విద్యను ముందస్తుగా అందించడం ద్వారా ఈ అంతరాన్ని  పరిష్కరించాలనేది మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.

చదవండి: వారం తిరగకుండానే మారిన జాతకాలు! మళ్లీ టాప్‌లోకి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement