ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.
పదిలో తొమ్మిది మంది ఓకే
ఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..
ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవు
ఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్‌లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్‌కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment