![Amazon indeed made a significant contribution to President elect Donald Trump inauguration fund](/styles/webp/s3/article_images/2024/12/13/amazon01.jpg.webp?itok=wi9zFAVl)
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్‌ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్‌బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్‌ను విమర్శించారు. గతంలో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్‌కు సంబంధించి అమెజాన్‌కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్‌లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.
ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
ఎలాన్‌మస్క్ ఇప్పటికే ట్రంప్‌నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్‌రామస్వామిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment