న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ (అమెజాన్ ఇండియా ఎగుమతుల కార్యక్రమం) ఎగుమతులు ఈ ఏడాది చివరికి మొత్తంగా 13 బిలియన్ డాలర్లకు (రూ.1.08 లక్షల కోట్లు) చేరుకుంటాయని సంస్థ డైరెక్టర్ భూపేన్ వకంకర్ తెలిపారు. 2025 నాటికి 20 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోనే ఉన్నట్టు చెప్పారు.
2015లో అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి భారత్‌లో తయారైన 40 కోట్లకుపైగా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అందించినట్టు వకంకర్ తెలిపారు. 2015 నుంచి 2023 మధ్య అమెజాన్ 8 బిలియన్ డాలర్ల ఎగుమతులే నమోదు చేయగా, కేవలం ఏడాది వ్యవధిలోనే (2023–24) 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వివరించారు.
గడిచిన 12 నెలల్లో 50వేల కొత్త విక్రేతలను ఇందులో చేర్చుకున్నట్టు తెలిపారు. దీంతో మొత్తం విక్రేతల సంఖ్య 1.5 లక్షలకు చేరుకున్నట్టు వెల్లడించారు. దేశీ విక్రేతలు అంతర్జాతీయ బ్రాండ్ల సృష్టికి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ వీలు కల్పిస్తోంది.
సౌందర్య ఉత్పత్తుల ఎగుమతులు 2023లో 40 శాతం వృద్ధిని చూడగా, వస్త్రాలు, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యధిక వృద్ధితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూఎస్, యూకే, కెనడా, జర్మనీ భారత విక్రేతలకు ప్రధాన ఎగుమతి మార్కెట్లుగా ఉన్నట్టు అమెజాన్ విడుదల చేసిన ‘ది ఎక్స్‌పోర్ట్స్ డైజెస్ట్ 2024’ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment