ఇంజనీరింగ్‌.. బాలురు భళా! | JEE Winners itself the Eamcet Toppers | Sakshi
Sakshi News home page

బాలురు భళా!

Published Thu, May 3 2018 3:16 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

JEE Winners itself the Eamcet Toppers - Sakshi

ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు. చిత్రంలో అధికారులు

26 నుంచి కౌన్సెలింగ్‌
జూన్‌ 11 నుంచి తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 26 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి చెందిన దాదాపు 20 వేల నుంచి 30 వేల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుతారన్నారు. గతేడాది అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌ కలిపి 1,36,790 సీట్లు ఉండగా 84,498 భర్తీ అయ్యాయని, 52,312 సీట్లు మిగిలిపోయాయని వెల్లడించారు. నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. 

కంబైన్డ్‌ స్కోరుతో ర్యాంకుల్లో మార్పులు
ర్యాంకుల నిర్ణయంలో ఎంసెట్‌లో (160 మార్కులు) సాధించిన మార్కులను, ఇంటర్మీడియెట్‌ మార్కులను నార్మలైజేషన్‌ చేసి 75 శాతం, 25 శాతంగా తీసుకొని కంబైన్డ్‌ స్కోర్‌ను నిర్ణయించారు. ఆ స్కోర్‌ ప్రకారం ర్యాంకులను ప్రకటించారు. దీనివల్ల ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా ఇంటర్మీడియెట్‌ మార్కులతో కలిపి కంబైన్డ్‌ స్కోర్‌ను తీసుకున్నప్పుడు కొందరు ర్యాంకుల్లో వెనుకంజలో నిలిచారు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంకర్‌ సూరజ్‌ కృష్ణకు ఎంసెట్‌ మార్కులు 150.1803 రాగా కంబైన్డ్‌ స్కోర్‌ 95.2720 వచ్చింది. రెండో ర్యాంకర్‌.. గట్టు మైత్రేయకు ఎంసెట్‌ మార్కులు 151.7622 రాగా కంబైన్డ్‌ స్కోర్‌ 94.9302. ఫలితంగా ఎంసెట్‌లో తక్కువ మార్కులు ఉన్నా కంబైన్డ్‌ స్కోర్‌లో ముందున్న సూరజ్‌కృష్ణను ఫస్టు ర్యాంకర్‌గా ప్రకటించారు.  

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్‌–2018 ఫలితాల్లో బాలురు సత్తా చాటారు. టాప్‌ ర్యాంకుల్లోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ ముందంజలో నిలిచారు. టాప్‌ 10 ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌లో 9, అగ్రి, మెడికల్‌ విభాగంలో 7 ర్యాంకులు సాధించారు. బాలికలు టాప్‌ టెన్‌లో ఇంజనీరింగ్‌లో 1, అగ్రి, మెడికల్‌లో 3 ర్యాంకులు దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన భోగి సూరజ్‌ కృష్ణ సాధించగా, తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ రెండో స్థానంలో నిలిచాడు.

ఇక అగ్రి, మెడికల్‌లో విశాఖపట్నానికి చెందిన జంగాల సాయి సుప్రియ మొదటి ర్యాంకు, కర్నూలుకు చెందిన గంజికుంట శ్రీవాత్సవ్‌ రెండో ర్యాంకు దక్కించుకున్నారు. ఏపీ ఎంసెట్‌–2018 ఫలితాలను బుధవారం విజయవాడలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఎంసెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణారావు, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సాయిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 22, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. 160 మార్కులకు నిర్వహించిన ఎంసెట్‌లో కనీస అర్హత మార్కులను 40గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు లేవు.

ఇంజనీరింగ్‌ విభాగంలో 1,90,922 మంది పరీక్ష రాయగా 1,38,017 మంది (72.28 శాతం) అర్హత సాధించారు. 52,905 మంది అర్హత మార్కులు సాధించలేదు. అర్హత సాధించినవారిలో బాలురు 82,190 మంది, బాలికలు 55,827 మంది ఉన్నారు. అగ్రి, మెడికల్‌ విభాగంలో 73,373 మంది పరీక్ష రాయగా 63,883 మంది (87.06 శాతం) అర్హత సాధించారు. వీరిలో 21,852 మంది బాలురు, 42,031 మంది బాలికలు ఉన్నారు. 9,460 మందికి అర్హత మార్కులు కూడా రాలేదు. అర్హత సాధించినవారికి ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్మీడియెట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి కంబైన్డ్‌ స్కోర్‌ ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు. ఇంజనీరింగ్‌లో 1,26,197 మందికి, అగ్రి, మెడికల్‌ విభాగంలో 58,923 మందికి ర్యాంకులు ప్రకటించారు.

ర్యాంకుల సమాచారాన్ని అభ్యర్థుల మొబైల్‌ నెంబర్లకు పంపించారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులు ఈ నెల 7 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌/ఈఏఎంసీఈటీ’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ర్యాంకులు సాధించినవారే ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కూడా టాప్‌ ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన భోగి సూరజ్‌కృష్ణ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోనూ మొదటి ర్యాంకు సాధించాడు. ఇక జేఈఈ రెండో ర్యాంకర్‌ అయిన హేమంత్‌కుమార్‌ 8వ ర్యాంక్‌ పొందాడు. ఐదో ర్యాంకు సాధించిన మైత్రేయ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. ఏటా ఎంసెట్‌ రాసేవారి సంఖ్య పెరుగుతున్నా ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. 2017లో 79.74 శాతం అర్హులు ఉండగా ఈసారి 72.28 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. 

124 ప్రశ్నలపై 235 అభ్యంతరాలు
ఎంసెట్‌ ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్‌ ప్రాథమిక ‘కీ’ల్లో 124 ప్రశ్నలకు సంబంధించి 235 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని నిపుణుల కమిటీ పరిశీలించి ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా నాలుగు ప్రశ్నలకు మల్టిపుల్‌ సమాధానాలను సరైనవిగా గుర్తించి మార్కులను కలిపారు. ఇంజనీరింగ్‌లో మొత్తం ఆరు సెషన్లలో 960 ప్రశ్నలు ఇవ్వగా నిపుణుల సలహా మేరకు ఒక ప్రశ్న ఆప్షన్‌ను మార్పు చేశారు. మూడు ప్రశ్నలకు మల్టిపుల్‌ ఆప్షన్లు ఇచ్చారు. అగ్రికల్చర్‌ విభాగంలో రెండు సెషన్లలో 320 ప్రశ్నల్లో పరీక్ష నిర్వహించగా నిపుణుల సలహాతో ఒక ప్రశ్నకు మల్టిపుల్‌ ఆప్షన్లను ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement