ఇంజినీరింగ్ విద్యకు క్రేజ్
ఎచ్చెర్ల:ఇంజినీరింగ్ విద్యపై జిల్లా విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. అదే స్థాయిలో కళాశాలలు కూడా పెరగడం కూడా విద్యార్థులకు కలిసొచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తూ ఆయూ రంగాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. 3,024 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్‌లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. దీంతో పాటు ప్రభుత్వ రంగంలో ఐదు, ప్రైవేటు రంగంలో ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది రెండు పాలిటెక్నిక్ కళాశాలలు టెక్కలి, సీతంపేటల్లో ప్రారంభించటంలో ఇంజినీరింగ్ విద్య ప్రభుత్వ రంగంలో విస్తరించింది. ప్రస్తుతం 3,070 సీట్లు పాలిటెక్నిక్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
నేడు ఇంజినీరింగ్ డే కార్యక్రమాలు
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల కళాశాలలో సోమవారం ఇంజినీరింగ్ డే నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. కార్యక్రమానికి బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ ఎస్‌ఈ రమణ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీపీ రామకృష్ణ తది తరులు హాజరుకానున్నారు. శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్‌లోఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రిన్సిపాల్ వీఎస్ దత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లోను మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నిర్వహనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గౌరవప్రదమైన వృత్తి
ఇంజినీరింగ్ వృత్తి గౌరవప్రదమైనది. సమాజంలో ఎంతో గుర్తింపునిస్తుంది. గృహ నిర్మాణశాఖలో వివిధ హోదాల్లో పని చేసినప్పుడు ప్రజలకు చేసిన సేవ లు, వారి ప్రశంసలు ఎంతో సంతృప్తినిచ్చాయి. కుటుంబపరంగా కూడా గౌరవాన్ని పెంచుతోంది.
- పొన్నాడ కూర్మినాయుడు, కార్యనిర్వాహక ఇంజినీర్,
గృహ నిర్మాణశాఖ డివిజన్
నేటి తరాలకు ఆదర్శం...
ఏ రంగంలో ఇంజినీర్లకైనా సీఆర్‌ఎం పట్నాయక్ ఆదర్శమే. విధుల్లో ఆయన పాటించిన విలువలు, చూపిన చిత్తశుద్ధి నేటి మా లాంటి తరాలకు ఎంతో అవసరం. ఆదర్శం. ఇప్పటికీ వంశధార నిర్మాణంలో ఆయన పాత్రే కీలకం. కోర్టు పెండింగ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలి... క్షేత్రస్థాయిలో నివేదికలంతా ఆయన సలహాలతోనే నడుస్తున్నాయి.
- పి.సుగుణాకరరావు, ఈఈ (ఆర్‌విఎం), శ్రీకాకుళం
అందుబాటులో ఇంజినీరింగ్ విద్య
ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఉపాధి అవకాశాలు సైతం మెరుగు పడ్డాయి. ఇంజినీరింగ్‌లో శ్రమించి చదివితే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఇంజినీరింగ్ విభాగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ ఆర్థర్ కాటన్ వంటి వారి సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోలేదు.
-పి.హేమశ్రీ, మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని
ఉత్తమ ఇంజినీర్ కావడమే లక్ష్యం
ఉత్తమ ఇంజినీరు కావడమే నా లక్ష్యం. దీనికోసం ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా చదువుతున్నాను. ఇంజినీరై సమాజానికి నా వంతు సేవ చేస్తాను. దేశంలో ఇంకా నైపుణ్యంగల ఇంజినీర్లు కొరత ఉంది. ఇంజినీర్లు వల్లే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. సమాజానికి మేలు జరగుతుంది.
- ఎస్.గాయత్రి, మహిళా పాలిటెక్నిక్ విద్యార్థిని
ఇంజినీర్లతోనే సమాజ ప్రగతి
ప్రస్తుతం ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంజినీరింగ్ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఐటీ, ఆటోమొబైల్స్, సెల్ నెట్ వర్క్, ఇంటర్నెట్ తదితర అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. సాంకేతిక ప్రగతి నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యతోనే సాధ్యం. చదువును పూర్తిచేసి మంచి ఇంజినీరుగా స్థిరపడతాను. దేశానికి సేవ చేస్తాను.
-ఇ.రేవతి, మహిళా పాలిటెక్నిక్ విద్యార్థిని