సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అర్హత(క్వాలిఫైడ్) మార్కుల విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అర్హత మార్కులు పొందుతున్న వారికంటే సీట్ల సంఖ్య అధికంగా ఉండడంతో అవి భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ప్రతిఏటా వేలాది సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. క్వాలిఫైడ్ మార్కులను తగ్గిస్తే ఎక్కువ మంది అర్హత సాధిస్తారని, తద్వారా సీట్లు భర్తీ చేసుకోవచ్చని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వంపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచుతున్నాయి.
ఇంజనీరింగ్‌లో 2 మార్కులు తగ్గిస్తే..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు 406 ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్స రానికి వీటిలో 1,66,373 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఇంజనీరింగ్‌లో 1.38 లక్షల మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 63,000 మంది అర్హత సాధించారు. ఇటీవల నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్ ఎంపీసీ స్ట్రీమ్‌లో 89,592 కన్వీనర్ కోటా సీట్లకుగాను ఇంకా 47,000 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఆదివారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టినా పెద్దగా స్పందన లేదు. బైపీసీ స్ట్రీమ్‌లోనూ భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో అర్హత మార్కులను తగ్గించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎంసెట్‌లో అర్హత పొందాలంటే 160 మార్కులకుగాను 25 శాతం అంటే 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అందులో 2 మార్కులు తగ్గించాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దానివల్ల కొత్తగా మరో 20,000 మంది అర్హత సాధిస్తారని, కొన్ని సీట్లు భర్తీ అవుతాయని పేర్కొంటున్నాయి. క్వాలిఫైడ్ మార్కుల తగ్గింపునకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనా«థ్ దాస్ ససేమిరా అంటున్నట్లు సమాచారం. క్వాలిఫైడ్ మార్కుల తగ్గింపు వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతారని, ఫలితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ఖజానాపై అధిక భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
పాలిసెట్‌లో 39,444 సీట్లు ఖాళీ
రాష్ట్రంలోని 291 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 74,312 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. అయినా ఇంకా 39,444 సీట్లు మిగిలిపోయాయి. ఈ నెల 5, 6 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. అయినా సీట్లన్నీ భర్తీ అయ్యే అవకాశం లేదని సమాచారం. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్’లో కూడా అర్హత మార్కులను తగ్గించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పాలిసెట్‌లో 120 మార్కులకుగాను 30 శాతం అంటే 36 మార్కులు సాధిస్తే అర్హులవుతారు. దీన్ని 25 శాతానికి అంటే 30 మార్కులకు కుదించాలని ప్రతిపాదనలు పంపగా.. అనుమతిస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. అయితే, సంబంధిత ఫైల్ ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వద్ద పెండింగ్‌లో ఉంది.
ఎటూ తేలని డీఎడ్ ప్రవేశాలు
డీఎడ్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్‌లో అర్హత మార్కుల తగ్గింపు వ్యవహారాన్ని ప్రభుత్వం కొన్ని నెలలుగా నాన్చుతోంది. దాదాపు 65,000 సీట్లు అందుబాటులో ఉండగా అర్హులైన అభ్యర్థులు కేవలం 12,000 మంది ఉన్నారు. భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఇంకా చేపట్టలేదు. డీఈఈసెట్‌లో అర్హత సాధించాలంటే ఓసీలు 50 శాతం, బీసీలు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఓసీలు, బీసీలకు అర్హత మార్కులను 35 శాతానికి కుదించాలని, ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు పెట్టరాదని కాలేజీల యాజమాన్యాలు బేరసారాలు సాగిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో డీఎడ్ ప్రవేశాలు నిలిచిపోయాయి.
అర్హత మార్కులపై ఆరాటం
Published Tue, Jul 3 2018 2:18 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment